జగన్ డౌన్ డౌన్.. పిన్నెల్లి రచ్చ.. కోటంరెడ్డి కన్నీరు.. వైసీపీలో సంక్షోభం..
Publish Date:Apr 10, 2022
Advertisement
జగన్ పని అయిపోయినట్టే. ఒకప్పుడు జగనే మోనార్క్.. జగన్ చెప్పిందే శాసనం అన్నట్టు ఉండేది వైసీపీ. అధినేత గీసిన గీతను ఏ ఒక్కరూ జవదాటేవారు కాదు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో వైసీపీలో కుంపటి రాజుకుంది. జగన్‌రెడ్డిని అయితేనేం.. సీఎం డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కారు. జగన్ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. అధికార పార్టీలో కిష్కిందకాండ నడుస్తోంది. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా.. వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లికి జగన్‌రెడ్డి హ్యాండ్ ఇవ్వడంపై మండిపడ్డారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. రోడ్లపై టైర్లు తగులబెట్టారు. మాచర్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు ఒకరు మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడున్నవారు ఆమెను అడ్డుకున్నారు. ఇక, మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కిషోర్‌తో పాటు 30మంది కౌన్సిలర్లు, 5మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. సీఎం కార్యాలయం ఫోన్ వచ్చినా.. పిన్నెళ్లి సరిగ్గా జవాబు ఇవ్వకుండా సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేసి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు, జగనన్న తనకు తీవ్ర అన్యాయం చేశాడంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కన్నీరు పెట్టడం కలకలం రేపింది. ‘‘పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నా. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించింది. కార్యకర్తలు, నాయకులు వారి రక్తం చెమటగా మార్చి నాకోసం కష్టపడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు’’ అన్నారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీనామాలకు సిద్ధమైన నేతలు, కార్పొరేటర్లకు కోటంరెడ్డి నచ్చజెప్పారు. కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్‌పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు జగ్గయ్యపేటలోని ఉదయభాను నివాసం వద్దకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్, పలువురు కార్పొరేటర్లు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని నిరసన చేశారు. కేబినెట్‌లో తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి చోటు లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘాలు అధ్యక్షులు రాజీనామాలకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు.
http://www.teluguone.com/news/content/ycp-agitations-in-ap-39-134182.html





