జగన్ చేతులు కాలిన తరువాత ఆకులు వెతుక్కుంటున్నారా?
Publish Date:Dec 4, 2024
Advertisement
రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెదరాయుడి తీరు నడిచిందేమో కానీ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన వ్యవహార శైలిని సొంత పార్టీ నేతలే భరించలేకపోతున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు. అధికారంలో ఉన్నంత వరకూ జగన్ చూసి రమ్మంటే కాల్చేసి వచ్చినట్లుగా తెగరెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయనో కలిసి నడిచిన నేతలు కూడా ఇప్పుడు వేరు దారి చూసుకుంటున్నారు. మరో వైపు జగన్ హయాంలో యథేచ్ఛగా అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఒక్కొక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్ హయాంలో జరిగిన అవకతవలక మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లోనే ఉన్నాయన్నది దర్యాప్తులో వెల్లడౌతుండటంతో.. సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టుల నుంచి, అవినీతి, కుంభకోణాలు, హత్యల తీగ లాగే వరకూ అక్కర్లేకుండా ముట్టుకుంటేనే తాడెపల్లి డొంక కదిలిపోతున్నది. దీంతో జగన్ తో ఇంకా అంటకాగితే తమ పుట్టి మునుగుతుందన్న భయంతో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు, కొందరైతే పార్టీకీ దూరమౌతున్నారు. జగన్ కు సన్నిహితులుగా ఉన్న వారైతే ఉన్న పదవులకు సైతం రాజీనామాలు చేసేసి పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెడుతుంటే.. జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గతంలోలా ఆయన మాటలకు వంత పాడే వారు పార్టీలో కరవయ్యారు. అంబటి, పేర్ని వంటి ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారే కరవైన పరిస్థితి. ఇక పార్టీ క్యాడర్ ఇప్పటికే కకావికలైపోయింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ అభివృద్దితో పాటు భవిష్యత్ కార్యాచరణ అజెండాగా చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి తరువాత నుంచి జగన్ ప్రజలలోకి వస్తారని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పార్టీ క్యాడర్ నూ, ప్రజలనూ పట్టించుకోని జగన్ ఇప్పుడు వారితో మమేకమౌతానంటూ ముందుకు రావడాన్ని వారు స్వాగతించే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాజీలుగా మారిన నేతల్లో అత్యధికులు జగన్ తీరు కారణంగానే ఓటమి పాలయ్యామని బాహాటంగానే చాటారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలనూ, కార్యకర్తలనూ పూర్తిగా విస్మరించిన జగన్ క్షేత్ర స్థాయి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించారు. చెబుదామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటూ గళమెత్తారు. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల డొంక కూడా కదులుతున్నట్లు భావిస్తున్నారు. ఆ కేసు విచారణ, దర్యాప్తు నత్తనడకన నడవడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వివరాలన్నీ సమర్పించాల్సిందిగా సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ తరుణంలో పూర్తిగా చేతులు కాలిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కీలకభేటీ కావడం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-lost-party-confidence-39-189440.html