LATEST NEWS
మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.
విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు. బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్ క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు.
అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు.
ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది.
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు.
కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు. మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయనపై అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.
ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం. అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక విజయ్, మధునందన్, లక్ష్మణ్ మీసాల, షిజు మీనన్, శివకార్తీక్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డీఓపీ: ప్రవీణ్ కె బంగారి
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
రచన, దర్శకత్వం: యుగంధర్ ముని
నిర్మాతలు: రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి
బ్యానర్: షైనింగ్ పిక్చర్స్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025
ప్రేమ కావాలి, లవ్లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ని ప్రారంభించిన ఆది సాయికుమార్.. సరైన విజయం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఆ ఎదురుచూపులకు తెర దించే సినిమా 'శంబాల' అవుతుందని నమ్మకం పెట్టుకున్నాడు. ప్రచార చిత్రాలు ప్రామిసింగ్ గా అనిపించడంతో.. ప్రేక్షకుల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. మరి 'శంబాల' ఎలా ఉంది? ఆది ఖాతాలో హిట్ పడేలా ఉందా? (Shambhala Movie Review)
కథ:
శంబాల అనే మారుమూల గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరిలో అన్నీ అనర్ధాలు జరుగుతుంటాయి. దీంతో ఊరి ప్రజలు.. ఆ ఉల్కని బండ భూతంగా భావిస్తూ.. భయంతో వణికిపోతుంటారు. స్వామీజీల సహాయంతో దీని నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించే పనిలో పడతారు. స్వామిజీ సూచనతో.. పాలకు బదులుగా రక్తాన్ని ఇస్తున్న ఆవుని చంపేయడానికి కూడా సిద్ధపడతారు. మరోవైపు యువ శాస్త్రవేత్త అయిన విక్రమ్(ఆది) ఆ ఉల్కపై పరిశోధన చేయడం ప్రభుత్వం తరపున అక్కడికి వస్తాడు. శాస్త్రాలు అబద్ధం, సైన్స్ మాత్రమే నిజమని నమ్మే నాస్తికుడైన విక్రమ్.. ఆ ఊరి వాళ్ళ నమ్మకాన్ని, భయాన్ని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తాడు. స్వామీజీల పూజలను కూడా అడ్డుకుంటాడు. ఈ క్రమంలోనే ఊరి వాళ్ళ ఆగ్రహానికి గురవుతాడు. ఓ వైపు విక్రమ్ పరిశోధన జరుగుతుండగా.. మరోవైపు ఊరిలో వరుస హత్యలు, ఆత్మహత్యలు సంభవిస్తూ ఉంటాయి. దీంతో ఊరి ప్రజలంతా కలిసి విక్రమ్ ని చంపడానికి కూడా సిద్ధపడతారు. అప్పుడు విక్రమ్ ఏం చేశాడు? శంబాల గురించి అతను తెలుసుకున్న నిజం ఏంటి? ఈ కథలో దేవి(అర్చన అయ్యర్) పాత్ర ఏంటి? వరుస మరణాల వెనకున్న శక్తి ఏంటి? దాని నుంచి విక్రమ్, ఊరిని ఎలా కాపాడగలిగాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
శంబాల టీజర్, ట్రైలర్ చూసినప్పుడే.. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. శివుడు అంధకాసురుడిని సంహరించే సన్నివేశాలతో సినిమాని ప్రారంభించి.. అసలు ఈ కథకి పురాణాలతో సంబంధం ఏంటనే క్యూరియాసిటీని కలుగజేయడంలో సక్సెస్ అయ్యారు.
శంబాల ఊరిలో ఉల్క పడటం, ఒక ఆవు పాలకు బదులుగా రక్తం ఇవ్వడం, ఆ ఆవు యజమాని రాములు(రవి వర్మ) వింతగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలతో.. ప్రేక్షకులను మొదటి నుంచే కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగారు. ఈ క్రమంలో వచ్చే హారర్ ఎపిసోడ్ కూడా బాగుంది. అయితే కెమెరా, ఎడిటింగ్ విభాగాల పనితీరు ఇంకా మెరుగ్గా ఉంటే.. ఆ ఎపిసోడ్ మరింత ఎఫెక్టివ్ గా ఉండేది.
ఉల్క గురించి పరిశోధన చేయడానికి నాస్తికుడైన విక్రమ్ గా ఆది ఎంట్రీ ఇవ్వడం బాగుంది. గ్రామ ప్రజలకు, ఆదికి మధ్య సన్నివేశాలను కూడా బాగానే రాసుకున్నారు. అయితే దేవి ట్రాక్ ని మాత్రం ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. నిజానికి ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మాటల్లో తెలుస్తుంది కానీ, సన్నివేశాల్లో అది కనిపించదు. ముఖ్యంగా కీలకమైన సెకండ్ హాఫ్ లో ఆ పాత్ర ప్రేక్షక పాత్ర వహించినట్టుగానే అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే అదృశ్య శక్తి కారణంగా రాములు(రవి వర్మ), కృష్ణ(లక్ష్మణ్ మీసాల) వింతగా ప్రవర్తించడం, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మెప్పించాయి. దాంతో కథనం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ త్వరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథనంలో కూడా కాస్త వేగం కనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. అలాగే, పతాక సన్నివేశాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. ఆది-పాప మధ్య బాండింగ్ ని మరింత ఎఫెక్టివ్ గా చూపించినట్లైతే.. క్లైమాక్స్ కి ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యుండేవారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
శాస్త్రవేత్త విక్రమ్ పాత్రలో ఆది చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో బాగా రాణించాడు. ఈ కథను నమ్మి, ఒక నటుడిగా తాను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. దేవి పాత్రకు తగ్గట్టుగా అర్చన అయ్యర్ కనిపించిన తీరు మెప్పించింది. అయితే రచన ప్రభావవంతంగా లేకపోవడంతో.. ఆ పాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తన సీనియారిటీతో రాములు పాత్రకు న్యాయం చేశాడు రవివర్మ. ఇక కృష్ణగా లక్ష్మణ్ మీసాల మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. అతను ఇచ్చిన కొన్ని కొన్ని ఎక్స్ ప్రెషన్స్ థియేటర్స్ లో విజిల్స్ పడేలా ఉన్నాయి. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ ఆకట్టుకున్నాడు. హనుమంతు కూతురిగా నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. స్వాసిక విజయ్, శివకార్తీక్, అన్నపూర్ణ, షిజు మీనన్, శైలజ ప్రియ, హర్ష వర్ధన్, ఇంద్రనీల్ తదితరులు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
శ్రీ చరణ్ పాకాల నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. చాలా సీన్స్ ని తన మ్యూజిక్ తో బాగానే ఎలివేట్ చేశాడు. హారర్ థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా ప్రవీణ్ కె బంగారి కెమెరా పనితనం మెప్పించింది. అయితే కొన్ని కొన్ని షాట్స్ మాత్రం ఇంకా ఎఫెక్టివ్ గా తీయొచ్చు అనిపించింది. ఎడిటింగ్ లోపం కూడా కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ కలగడానికి కారణమైంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయవచ్చు. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా...
రైటింగ్ పరంగా, టెక్నికల్ గా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆదికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో ఆది నుంచి వచ్చిన బెస్ట్ ఫిల్మ్ ఇది అనడంలో డౌట్ లేదు. ఈ సినిమా భయపెడుతుంది, థ్రిల్ ని పంచుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి 'శంబాల' నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
Cast: Aadi Saikumar, Archana Iyer, Ravi Varma, Swasika Vijay, Shiju, Harshavardhan, Madhunandan, Laxman Meesala, Chaitra, Annapoorna
Crew:
Written by Ugandhar Muni, Suresh Kothapalli
Music by Sricharan Pakala
Cinematography by Praveen K. Bangarri
Edited by Shravan Katikaneni
Directed by Ugandhar Muni
Aadi Saikumar has been trying his level best with different scripts to entertain audiences and establish himself as a leading hero. Now, his new film, Shambhala, with huge expectations and good buzz released on Christmas Eve. The movie teasers and trailers have created positive buzz prior to the release and the theme interested many. Let's discuss about the film in detail.
Plot:
Scientist Vikram (Aadi Saikumar) is appointed by central government to check the areas and research about the meteorite that fell in the village Shambhala. The locals believe that the celestial object is going to create bad omens in the village and will destroy them. Vikram starts to live alone near the "Banda Bhootham" - as the villagers give it the name - ignoring threats of villagers and Swamiji. He states that it is just a stone and he needs to investigate it. Only a Police Constable (Madhunandan) starts to mingle with him and his child Chitra, who has autism, only befriends Virkam.
On contrary, in the village, a demonic force starts to create hovoc as it enters into Ramulu (Ravi Varma). Villagers do not understand its effects and decides to kill Ramulu's cow as it gives blood instead of milk. Vikram stops it and Devi (Archana Iyer) starts to help him. Ramulu kills six people in a rage of anger and then he too kills himself. Similarly, people who have extreme evil traits are targeted by this demonic force. Can Vikram use sciene to stop it or will he change from an atheist? Will Swamiji allow Vikram to take over? Who is Devi? What is demonic forces connection with Lord Shiva's Devasura Sangrama? Watch the movie to know more.
Analysis:
Aadi Saikumar has decided to give script more priority than showcasing him and his skills. This works like a magic for him as he fits the character perfectly. His performance is measured and he is able to handle varied emotions with ease. His performance is the key to this high-content film and he delivers big time. This is a very good film after a long time, we have to mention that.
Archana Iyer doesn't really have much to do and she is okay. Ravi Varma, young actress, Swasika Vijay, Madhunandan, Laxman Meesala are good in their performances. They handle the portions given to them very aptly. But some portions seem to have been over-dragged at places while they are still engaging, the makers could have trimmed them down for better impact.
Technically, movie is good as the production values shine in this limited budget film. VFX at places seems to have been under done and such things could have been improved. The film core strength lies in maintaining believability of 1980's. Costume, make-up and location recce have helped it to achieve such finesse. Ugandar Muni showcases that he has skill in engaging audiences with his execution.
But writing wise, he depends on the cliches to engage audiences and feels like he followed some of the previous films that came in this genre. Few scenes seem to have been dragged a lot while some seem to have been winded up to cut things short. His victory lies in engaging audiences throughout while there is a too much a wow factor there is no cringe or headache portions that make this film a good watch.
Bottomline:
A Good Film that engages throughout and could've been better with even sharper writing.
Rating: 2.75/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
సినిమా పేరు: ఈషా
నటీనటులు: హెబ్బా పటేల్, బబ్లూ పృథ్వీ, అదిత్ అరుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, మైన్ మధు తదితరులు
సినిమాటోగ్రఫీ: సంతోష్ షనమోని
ఎడిటర్: వినయ్ రామస్వామి
సంగీతం: ఆర్ ఆర్ ధృవన్
రిలీజ్: బన్నీ వాసు వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్
సమర్పణ: కే ఎల్ దామోదర్ ప్రసాద్
నిర్మాత: పోతుల హేమ వెంకటేశ్వరరావు
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మన్నే
రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 ,2025
హర్రర్ థ్రిల్లర్ సినిమాల రాక ఈ మధ్య కాలంలో తక్కువ అయ్యింది. దీంతో హర్రర్ జోనర్ ప్రేమికులతో పాటు ప్రేక్షకులు ఆ తరహా చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలో 'ఈషా' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. సినిమాపై నమ్మకంతో మేకర్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.
కథ
నయన( హెబ్బా పటేల్), కళ్యాణ్ (ఆదిత్ అరుణ్), అపర్ణ(సిరి హనుమంత్), వినయ్(అఖిల్ రాజ్) లు స్కూల్ డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్.ఆ ఏజ్ నుంచే మనిషి చనిపోయాక ఆత్మలు ఉండవనే బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. అందుకు తగ్గట్టే ఆత్మలు ఆవహించాయనే పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే అన్ని మతాలకి చెందిన స్వామిజీలని ప్రూఫ్స్ తో సహా చట్టం ముందు ఉంచుతారు. ఆ నలుగురి నెక్ట్ టార్గెట్ ఆదిదేవ్( బబ్లూ పృథ్వీ) అవుతాడు. ఆదిదేవ్ ఎంతో ఎడ్యుకేట్ పర్సన్ తో పాటు వైద్య వృత్తికి సంబంధించి అమెరికాలో ఫేమస్ న్యూరాలజిస్ట్ గా పని చేసాడు. అలాంటి ఆదిదేవ్ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో ఆత్మలని వదిలించే స్వామిజీగా ఉంటుంటాడు.నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్ లు ఆదిదేవ్ ని కలుస్తారు. ఈ క్రమంలో ఆ నలుగురి జీవితాలకి సంబంధించిన ఒక భయంకరమైన నిజం ఆదిదేవ్ కి తెలుస్తుంది. దీంతో ఆ నలుగురి జీవితాల్లో పలు మార్పులు సంభవిస్తాయి.పైగా ఆ నలుగుర్ని చంపడానికి పుణ్యవతి అనే మహిళ ఆత్మ ప్రవేశించిన ఒక శివ భక్తుడు(మైన్ మధు)ప్రయత్నిస్తుంటాడు. ఆదిదేవ్ కి ఆ నలుగురు గురించి తెలిసిన నిజం ఏంటి? శివ భక్తుడు ఎందుకు ఆ నలుగుర్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు? పుణ్యవతి ఎవరు? ఆమెకి ఆ నలుగురికి సంబంధం ఏంటి? ఉంటే ఎలాంటి సంబంధం? ఆత్మల పేరుతో ఆదిదేవ్ నిజంగానే ప్రజలని మోసం చేస్తున్నాడా? న్యూరాలజిస్ట్ స్వామిజీగా మారడానికి కారణం ఏంటి? ఆత్మలు లేవని ఆ నలుగురు నిరూపించారా? అసలు ఈషా అంటే ఏంటి అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
కథ గా చెప్పుకుంటే చాలా మంచి కథ. కోరికలు, ఆశలు తీరని వారు చనిపోయినప్పుడు , వాళ్ళు మరణించారని ప్రకృతి చెప్తున్నా వాళ్ళు ఆ విషయాన్నీ ఎలా ఒప్పుకోరో కూడా చెప్పింది. ఈ కథ మెయిన్ పాయింట్ కూడా ఇదే. కాకపోతే ఈ విషయం క్లైమాక్స్ లో తెలుస్తుంది. సదరు పాయింట్ తెలిసినప్పుడు ఎంతో థ్రిల్ కూడా ఫీలవుతాం. కానీ సదరు మెయిన్ పాయింట్ కి సింక్ అయ్యే సన్నివేశాల రూపకల్పనలో మేకర్స్ ఎక్కువ శ్రద్ద చూపించలేకపోయారు.
కాని సదరు సన్నివేశాలు మనకి ఎక్కడ బోర్ కొట్టవు. అందుకు తగ్గట్టే ఫొటోగ్రఫీ, దర్శకత్వం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మెస్మరైజ్ చేసాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం నుంచే పదునైన స్క్రీన్ ప్లే తో నడిచింది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. కాకపోతే చిన్న వయసు నుంచే నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్ లు ఆత్మలు లేవు అనే బలమైన నమ్మకాన్నికలిగి ఉండటానికి డైలాగు ద్వారా చెప్పకుండా సన్నివేశం ద్వారా చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే కథ మెయిన్ పాయింట్ ఆత్మలు లేవనే నమ్మకం వాళ్ళకి ఉంది కాబట్టి.
పుణ్యవతి ఎపిసోడ్ పరిధిని ఇంకొంచం పెంచాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ వేగంగానే నడిచినా భయపెట్టే సీన్స్ రిపీట్ గా వచ్చినట్టుగా ఉంది.ఆది దేవ్ కి నలుగురు గురించి ముందుగానే తెలుసు కాబట్టి ఆదిదేవ్ ని చెడ్డ వ్యక్తిగా చీట్ చేస్తు చూపించాల్సింది. ఆత్మ రూపంలో శివ భక్తుడులో ప్రవేశించిన పుణ్యవతి తన కొడుకు, భర్త దగ్గరకి వెళ్లి తమ కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలని చెప్పి ఉంటే బాగుండేది. దీనివల్ల సెంటి మెంట్ వర్క్ అవుట్ అయ్యి ఈషా కి సరికొత్త లుక్ వచ్చి ఉండేది. ఆర్ ఆర్ సౌండ్ కి క్యారెక్టర్స్ భయపడటం కొంచం ఎక్కువ అయినట్టుగా అనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఆదిదేవ్ స్వామిజీగా కొనసాగడానికి గల కారణాన్ని కూడా సన్నివేశాల రూపకల్పనలో చెప్పి ఉంటే ఒకే పాయింట్ పై కథ నడుస్తున్న ఫీలింగ్ కొంత తగ్గేది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
హెబ్బా పటేల్(Hebah Patel),ఆదిత్ అరుణ్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్ నటనలో మెరుపులు లేకపోయినా కథకి తగ్గ నటనని ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. బబ్లూ పృథ్వీ కూడా అంతే. మెరుపులు లేకపోయినా మరో సారి మెచ్యూర్డ్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. శివ భక్తుడిగా, మహిళ ఆత్మ ప్రవేశించిన వ్యక్తిగా మైమ్ మధు పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ మొత్తంలో తన నటనే హైలెట్. బిజీ ఆర్టిస్ గా మారడం ఖాయం. ఫొటోగ్రఫీ అత్యద్భుతంగా ఉండి 'ఈషా' కి ప్రధాన వెన్నెముక గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే క్రెడిట్ ఇవ్వచ్చు. ఒక కొత్త లోకాన్ని మన కళ్ళ ముందు ఉంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మన్నే శ్రీనివాస్(Srinivas Manne)దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు. కానీ రచన పరంగా మరింత శ్రద్ద చూపించాల్సింది.
ఫైనల్ గా చెప్పాలంటే కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నా వాటిని మర్చిపోయేలా రెండుగంటల ఏడు నిమిషాల నిడివితో ఈషా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. హార్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులని మాత్రం నిరాశపరచదు.
రేటింగ్ 2 .75 /5 అరుణాచలం
విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించగా నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ ను ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు మాట్లాడుతూ... "చిత్ర బృందం అందరికీ మంచి సినిమా తీసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ అభినందనలు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీజర్ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అర్థం అవుతుంది. భవిష్యత్ లో మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికి అభినందనలు" అన్నారు.
అతిథి నిర్మాత, నటుడు అశోక్ కొల్ల మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. శ్రీధర్ గారు నాకు ఎంతోకాలం నుండి తెలుసు. ఈ చిత్ర టీజర్ చాలా బావుంది. ఇప్పుడు చిన్న సినిమాలు వచ్చి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుంది అని అర్థం అవుతుంది. ఎంతో తపన ఉన్న నిర్మాత కాబట్టి మరెన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
అతిథి కంఠమనేని శివ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చిత్ర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
అతిథి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... "నాకు బాగా కావలసిన వ్యక్తులు ఈ చిత్ర నిర్మాతలు. ఈ సినిమా టీజర్ చూస్తే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయాలు అందుకుంటున్న వరుసలో ఈ సినిమా ఉంటుంది" అన్నారు.
అతిథి నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సాయి కొమ్మాలపాటి అని సాయి గారిని పిలవడానికి నేను ఆనందంగా ఫీల్ అవుతాను. సుమతీ శతకం చిత్ర టీజర్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. హీరో అమరదీప్, హీరోయిన్ శైలి, దర్శకుడు నాయుడు గారికి ఆల్ ది బెస్ట్. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ... "సుమతీ శతకం చిత్ర టీజర్ రిలీజ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా అమరదీప్ కు మంచి మైలేజ్ తీసుకొస్తుంది అని కోరుకుంటున్నాను. హీరోయిన్ కు మంచి పేరు రావాలని, దర్శకునికి ఈ సినిమా ద్వారా మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సరదాగా మొదలైన ఈ సినిమా ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలిగించకుండా మంచి సందేశాత్మక చిత్రం సుమతి శతకం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... "ఈ చిత్ర కుటుంబంలో నేను ఒకడికి కావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో పాటలు చాలా బావుంటాయి. సంగీతం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు 10 సంవత్సరాల ప్రయాణం. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని కోరుకుంటున్నాను" అన్నారు.
యశ్ని గౌడ మాట్లాడుతూ... "చిత్ర బృందం అందరికీ కృతజ్ఞతలు. చిత్ర టీజర్ అందరికీ బాగా నచ్చింది అని అర్థం అవుతుంది. సినిమాను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.
నటుడు అర్జున్ అంబటి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చి అందరికి థాంక్స్. దర్శకుడు చాల కష్టపడి సినిమాను తీశారు. నిర్మాతలకు నా స్నేహితుడు అమర్దీప్ ను నమ్మి సినిమాను తెరకెక్కించినందుకు థాంక్స్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ " అన్నారు.
నిర్మాత సుధాకర్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కథ దర్శకుడు మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు కుటుంబంతో కలిసి ఎంటర్టైన్ అయ్యే విధంగా అనిపించింది. అమర్దీప్ ప్రేక్షకులు ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. అలాగే సరదాగా, ఆక్టివ్ గా ఉంటాడు. ఈ తరం రవితేజ గారిలా అనిపిస్తాడు, అందుకే ఈ చిత్రం అమర్ బాగా చేయగలడు అనిపించింది. హీరోయిన్ కోసం ఒక చక్కటి తెలుగుతనం ఉన్న అమ్మాయి కావాలని శైలి గారిని తీసుకున్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ చాలా బాగా పని చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన సుమతీ శతకం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి తెలుగుతనం ఉన్న టైటిల్. సినిమా మంచి విజయం సాయించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. టీజర్ లాంచ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా నాకు తొలి చిత్రం. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నాతో నటించిన అమర్దీప్, అలాగే ఇతర నటీనటులకు ధన్యవాదాలు. మీడియా వారికి, ప్రేక్షకులకు థాంక్స్. చిత్ర టీజర్ అందరికీ నచ్చిందని అవుతుంది. మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా నన్ను నమ్మి సినిమాను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత గారికి, నా దర్శక బృందానికి థాంక్స్. సినిమాలో నటించిన అమర్దీప్ గారికి, ఇతర నటీనటులకు నన్ను నమ్మినందుకు థాంక్స్. సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అందించారు. సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఎంతో కష్టపడి మంచి విజువల్స్ అందించారు. పాటలు రాసిన లిరిసిస్ట్ లు బాగా సపోర్ట్ చేశారు. సినిమా మంచి విజయం సాధించేందుకు ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.
హీరో అమర్దీప్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు సినిమాలో అవకాశం ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా ప్రేక్షకులను పూర్తిగా వినోదపరుస్తుంది. సినిమాలోని పాటలు, సంగీతం అద్భుతంగా ఉండబోతుంది. సినిమాటోగ్రాఫర్ సినిమా కోసం పెట్టిన కష్టం వెండి తెరపై కనిపిస్తుంది. అలాగే మంచి డాన్స్ స్టెప్స్ ఉంటాయి. సినిమాలో చాలా మంచి విషయం ఉంటుంది. సినిమాలో కొంచెం రవితేజ గారిని రిఫర్ చేసుకుంటు కొన్ని ఉంటాయి. శైలి సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఇతర నటీనటులు అంతా కష్టపడి సినిమాకు సపోర్ట్ చేశారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.
సినిమా పేరు: దండోరా
నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, మణిక, అదితి భావరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
బ్యానర్: లౌక్య ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవ సోత్
ప్రచార చిత్రాల ద్వారా మూవీ లవర్స్ లో, ప్రేక్షకుల్లో మంచి బజ్ ని సంపాదించుకున్న చిత్రం 'దండోరా'. నటుడుగా రీ ఎంట్రీ లో తన జైత్ర యాత్రని కొనసాగిస్తున్న శివాజీ 'దండోరా'కి స్పెషల్ ఎట్రాక్షన్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. (Dhandoraa Movie Review)
కథ
శివాజీ(శివాజీ) తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న తుళ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఆర్ధికంగా స్థితిమంతుడేమి కాదు. కానీ నరనరాన కుల అభిమానాన్ని నింపుకుని ఉంటాడు. కొడుకు పేరు విష్ణు(నందు). హైదరాబాద్ నగరంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. విష్ణుకి భార్య(మౌనిక రెడ్డి), తొమ్మిదివ తరగతి చదివే కూతురు ఉంటారు. శివాజీ, విష్ణు మధ్య చాలా సంవత్సరాల నుంచి మాటలు లేవు. శివాజీ కూతురు పేరు సుజాత (మణిక). రవి(రవికృష్ణ) మంచి మనసు గల అట్టడుగు వర్గానికి చెందిన యువకుడు. డబ్బు, చదువు విషయంలో శివాజీ కుటుంబం కంటే రవి కుటుంబానికే ఎక్కువ పరపతి ఉంది. సుజాత, రవి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. సీతారామ్(నవదీప్) ఊరి ప్రెసిడెంట్. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలని చిన్నతనం నుంచే పుణికి పుచ్చుకున్న వ్యక్తి. శ్రీలత(బిందుమాధవి) వేశ్య వృత్తి చేసుకుంటు బతికే అందమైన అతివ. ఆమె కూతురు పేరు సుజాత(రాధ్య). చిన్నతనంలోనే తండ్రిని చంపి జైలుకి వెళ్లి వచ్చిన అమ్మాయి. పైన చెప్పుకున్న ఈ క్యారక్టర్ ల చుట్టు అల్లుకున్న మంచి, చెడు, ప్రేమ, అభిమానం,స్నేహం, బాధ, సంతోషం, భావోద్వేగం, ఈర్ష్య, అసూయ, ఆశయం, నీతి వంటి అంశాల సమూహారమే దండోరా.
ఎనాలసిస్
ఇలాంటి కథలు సెల్యులాయిడ్ పై గతంలో చాలానే వచ్చాయి. కానీ దండోరా ఆ ఛాయల అంచుని టచ్ చేస్తూ మరో అద్భుతమైన పాయింట్ కి సరికొత్త కథనంతో వచ్చింది. దీంతో కొత్తదనాన్ని ఫీల్ అవుతాం. ఎన్నో జీవిత సత్యాలని కూడా చెప్పింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తో పాటు శివాజీ క్యారక్టర్ ని ఎలివేట్ చేసిన విధానం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ప్రధాన ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ప్రధాన బలంగా నిలిచాయి.
ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం 2004 ,2014 మధ్య జరిగే కథగా రివర్స్ స్క్రీన్ ప్లేతో స్టార్ట్ అయ్యింది. మొదటి సీన్ తోనే మూవీలో లీనమైపోతాం కూడా. శివాజీ, విష్ణు, రవి, సుజాత క్యారక్టర్ ల మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా బాగుండటంతో పాటు నాచురల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. ఒక శవంకి సంబంధించి సదరు వ్యక్తి గత జీవితం బాగానే ఎలివేట్ అయ్యింది. కాకపోతే ఎంటర్ టైన్ మెంట్ కి సంబంధించి డైలాగ్స్, సన్నివేశాల విషయంలో మరింత శ్రద్ద పడాల్సింది. బలగం మూవీ సంచలన విజయాన్ని సాధించడానికి.. సెంటిమెంట్ తో పాటు పారలాల్ గా నడిచిన ఎంటర్ టైన్ మెంట్ కూడా ఒక కారణం అని తెలిసిందే.
రవి, సుజాత మధ్య వచ్చిన లవ్ సీన్స్ బాగున్నాయి. ముద్దు పెట్టుకోవడానికి కూడా సుజాత పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆ సందర్భంగా వచ్చే సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. దీని ద్వారా తెలంగాణలోని పల్లెల్లో ఉండే చాలా మంది అమ్మాయిల మెంటాలిటీ తో ముడిపడి ఉన్న ఆత్మాభిమానాన్ని తెలియచేస్తుంది. కాకపోతే ఆ ఇద్దరి లవ్ కి శివాజీ అడ్డు వస్తాడని ముందుగానే అర్ధం చేసుకుంటాం కాబట్టి, రవిని శివాజీ కులానికే చెందిన వ్యక్తిగా చీట్ చేయాల్సింది.
శివాజీ, అతని ఫ్రెండ్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. తమ వ్యక్తిగత పగని కుల పగగా మార్చే వారు ఉంటారనే నిజాన్నికూడా చూపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా ఊహించిందే. టోటల్ గా ఫస్ట్ హాఫ్ బెటర్ అనే స్థాయిలో ఉంది. దీంతో సెకండ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి తగ్గట్టే సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో సాగింది. ఎంతలా అంటే ఎన్నో సీన్స్ బావోద్వేగానికి గురి చేస్తాయి. సగటు మనిషి మైండ్ సెట్ ని కూడా తెలియచేసింది.
శివాజీ, శ్రీలత మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు శ్రీలత గత జీవితం కూడా ఆలోచింపచేస్తుంది. ముఖ్యంగా శివాజీ తన కూతురుకి సంబంధించిన చిన్న వయసు ఫొటోస్ నుంచి యుక్త వయసులో ఉన్నఫొటోస్ ని చూసి ఏడ్చే సన్నివేశం, కోర్టు సన్నివేశాలు మనకి తెలియకుండానే కన్నీళ్లు తెప్పిస్తాయి. సదరు సన్నివేశాలతో కులతత్వాన్ని ఓవర్ గా నింపుకున్న ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మార్పు రావడం ఖాయం. శ్రీలత కూతురుకి సంబంధించిన సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రధాన బలంగా నిలిచాయి. కాకపోతే మంచోళ్ళు, చెడ్డోళ్లు అన్ని కులాల్లోనూ ఉంటారనే విషయాన్నీ ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
మొదట్లోనే చెప్పుకున్నట్టు ఒక్కరిని కాదు అందరు తమ క్యారెక్టర్స్ లో జీవించారు. ముఖ్యంగా శివాజీ పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శివాజీ కి అవార్డు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. తనలోని భావాలని అణుచుకోని బతుకుతుండే వ్యక్తిగా నందు, ఊరి ప్రెసిడెంట్ గా నవదీప్ మైండ్ బ్లోయింగ్ పెర్ ఫార్మెన్స్ ని ఇచ్చాడు. ఆ ఇద్దరు ఈ చిత్రం తర్వాత మరింత బిజీగా మారడం గ్యారెంటీ. మణిక చిక్కాల కూడా అందుకు అర్హురాలైన పెర్ఫార్మెన్సు ని ఇచ్చింది. ఇక ఒకప్పటి హీరోయిన్ బిందు మాధవి కూడా అంతే. అద్భుతమైన నటనతో సదరు శ్రీలత క్యారక్టర్ ని మాత్రమే కనపడేలా చేసింది. శివాజీ ఫ్రెండ్ గా చేసిన కమల్ తో పాటు మిగతా నటీనటులు కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు చేసి మెప్పించారు.
నిర్మాణ విలువల్లో భారీతనం లేకపోయినా 'వెంకట్ శాఖమూరి' అద్భుతమైన ఫొటోగ్రఫీ ఆ లోటుని తెలియనీయకుండా చేసింది. ప్రతి ఫ్రేమ్ మన కళ్ళ ముందు జరుగుతున్న కథలా ఉంది. దర్శక, రచయిత మురళి కాంత్ గురించి చెప్పుకుంటే దర్శకత్వంలో మెరుపులు లేకపోయినా రచయితగా మాత్రం కట్టిపడేసాడు. నటీనటుల దగ్గర్నుంచి మంచి పెర్ ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో భారీగా సక్సెస్ అయ్యాడు. మార్క్ కె.రాబిన్ నుంచి వచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దండోరాని ఇంకో మెట్టు పైకి ఎక్కించాయి.
ఫైనల్ గా చెప్పాలంటే..
అహంకారం, అజ్ఞానం, మూర్ఖత్వంతో కళ్ళు మూసుకొని పోతే నిజమైన అభిమానాన్ని, ప్రేమని ఎలా దూరం చేసుకుంటామో దండోరా చెప్పింది. తరతరాలుగా చాలా గ్రామాల్లో జరుగుతున్న ఒక ప్రధాన పాయింట్ ని కూడా ఎంతో ధైర్యంగా చెప్పింది.
రేటింగ్: 2.75/5
- అరుణాచలం
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి. భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా, సాంప్రదాయంగా జరుగుతాయి. అయితే ఈ వేడుకలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. వారి వారి సాంప్రదాయాల పరంగా మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఐస్లాండ్ దేశంలో కూడా క్రిస్మస్ లో కూడా ఒక ప్రత్యేకత, వింత ఉంది. అదే శాంతా క్లాజ్.. ప్రతి దేశంలోనూ క్రిస్మస్ వేడుక వచ్చిందంటే పిల్లలు అందరూ శాంతా క్లాజ్ కోసం ఎదురు చూస్తారు. శాంతా క్లాజ్ పిల్లలకు బోలెడు బహుమతులు తెస్తాడని నమ్ముతారు. అయితే ఐస్లాండ్ లో మాత్రం శాంతా క్లాజ్ విషయంలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలలో శాంతా క్లాజ్ ఒక్కడే.. కానీ ఐస్లాండ్ లో మాత్రం 13మంది శాంతా క్లాజ్ లు ఉంటారట.
జానపద కథ ఏం చెప్తుందంటే..
ప్రతి దేశంలో జానపద కథలు ఉన్నట్టే ఐస్లాండ్ లోనూ జానపద కథలు ఉన్నాయి. అక్కడి జానపద కథల ప్రకారం అక్కడి శాంతా క్లాజ్ లను యూల్ లాడ్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. ఈ 13మంది గురించి మొదటగా 1862లో ప్రస్తావించబడిందట. రచయిత జాన్ అర్నాసన్ ప్రసిద్ధ గ్రిమ్స్ నుండి ప్రేరణ పొంది జానపద కథలను సేకరించడం మొదలు పెట్టాడు. 1932లో ఐస్లాండిక్ కవి జోహన్నెస్ ఉర్ కోట్లమ్ యూల్ లాడ్స్ అనే కవితను క్రిస్మస్ ఈజ్ కమింగ్ అనే పుస్తకంలో ప్రచురించాడు. ఇది వారి పేర్లు, వ్యక్తిత్వాలతో పాటు వారి గురించి ఒక నమ్మకాన్ని సెట్ చేసింది.
యూల్ లాడ్స్ ప్రకారం 13మంది అన్నదమ్ములు గ్రైలా అనే ట్రోల్ కు జన్మించారట. కానీ కాలక్రమేణా వారి పిల్లలు, వారసులు అందరూ ఉదారంగా బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్లారచ. దీని వల్ల వారికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. చివరకు వారికి ఏమీ మిగలకుండా పోయిందట. క్రిస్మస్ కు ముందు ప్రతి రాత్రి ఈ 13మంది యూల్ లాడ్స్ పిల్లలను అందరినీ సందర్శిస్తారట. ఐస్లాండ్ జానపద కథల ప్రకారం, ఏడాది పొడవునా మంచి ప్రవర్తన కలిగిన ప్రతి చిన్న పిల్లవాడు యూల్ లాడ్స్ నుండి ఒక చిన్న బహుమతి పొందుతాడట. అంతేకాదు.. అల్లరి పిల్లలకు పచ్చిగా ఉన్న లేదా కుళ్లిన బంగాళాదుంపను ఇస్తారట. అక్కడి పిల్లలు క్రిస్మస్ బహుమతి స్వీకరించడానికి కిటికి గుమ్మం మీద ఒక షూ ను ఉంచుతారట. ఇదీ ఐస్లాండ్ లో క్రిస్మస్ విశేషం.
*రూపశ్రీ.
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు. సమయం సందర్భం వచ్చిన ప్రతి సారి తమ తెలివితేటలు, సామర్థ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఎవరైతే తెలివి లేని వెధవ అని అన్నారో.. వారికి తమ విజయం తెలిసేవరకు మనసు ప్రశాంతంగా మారదు. తాము తెలివైన వాళ్ళం అని నిరూపించేంత వరకు వారి అహం కూడా అస్సలు తగ్గదు. అయితే ఇదంతా కూడా చాలా పిచ్చి చేష్ట అని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్తగా, రాజనీతి శాస్త్రజ్ఞునిగా, ఆర్థిక నియమాలు అద్బుతంగా వెల్లడించిన వ్యక్తిగా అందరికీ పరిచయమే. ఆయన రెండువేల సంవత్సరాల కిందట చెప్పిన విషయాలు నేటికీ ఆచరణీయంగా, అనుసరణీయంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన మనుషులను, సమాజాన్ని, పరిస్థితులను, రాజకీయాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి తెలివైన వారికి ఒక నమ్మలేని వాస్తవాన్ని చెప్పారు. ఈ విషయం చదివితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసుకుంటే..
చాణక్యుడు చెప్పిన నమ్మలేని రహస్యం..
చాణక్యుడు ప్రజలను తెలివైన వారిగా ఉండమని చెబుతాడు. అయితే బయటకు మాత్రం మూర్ఖులుగా నటించమని చెబుతాడు. అంతేకాదు.. అవసరమైనప్పుడు స్వార్థంగా కూడా ఉండాలని చెబుతాడు. ఈ విషయంగానే ఇదొక తప్పు మార్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన విషయాలకు తగిన వివరణ కూడా ఇచ్చాడు.
ప్రతి వ్యక్తి తాను చేసే పనిని, తన ప్రణాళికను గొప్పగా అందరికీ తెలిసేలా చెప్పడం తెలివైన పని కాదని చాణక్యుడు అంటాడు. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు, చుట్టుపక్కల ఉండేవారు, సన్నిహితులు, ఆత్మీయులు అందరూ స్నేహపూర్వకంగా కనిపిస్తుంటారు. కానీ వారి ఉద్దేశాలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవిగా ఉండవని చాణక్యుడు చెబుతాడు. అందరినీ గుడ్డిగా నమ్మితే ఏదో ఒకరోజు అవతలి వారు బలహీనతనలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నిజంగా తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన తెలివితేటలను అవసరం లేకుండా బయటపెట్టడు. అందరికీ ప్రదర్శన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తన తెలివిని బయటపెట్టడు.
మూర్ఖుడిలా నటించాలి ఎందుకుంటే..
ఒక వ్యక్తి తనను తాను తెలివైన వాడిని అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంటే అలాంటి వ్యక్తి నుండి అందరూ క్రమంగా దూరం అవుతారని చాణక్యుడు అంటున్నాడు. లేకపోతే ఇతరుల వల్ల హాని కలగడం లేదా ఇతరుల కుట్రలకు బలి కావడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వాడిని అని అందరికీ తెలిసేలా చేయడం కంటే మూర్ఖుడిగా నటించడం ఉత్తమం. దీని వల్ల ఇతరుల ప్రణాళిక, వారి ఉద్దేశ్యాలు గుర్తించడం సులువు అవుతుంది. అంతేకాదు.. ఎవరి ముందు అయినా సరే.. తక్కువగా మాట్లాడి, ఎదుటివారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు ఎదుటివారి ఉద్దేశ్యాలు చాలా బాగా అర్థం చేసుకోవచ్చు.
స్వార్థంగా ఎందుకు ఉండాలి? ఎప్పుడు ఉండాలి?
మనుషులు స్వార్థపూరితంగా ఉండాలని చాణక్యుడు ఎప్పుడూ సమర్థించడు. పరిస్థితులు మారిపోయినప్పుడు, ఒక వ్యక్తిని ఇతరులు స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు, స్వంత ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని చాణక్యుడు చెబుతాడు. మొదట తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, తమ పనులను తాము సమర్థవంతంగా చేసుకుంటూ తమకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పరుచుకున్నప్పుడు ప్రపంచం కూడా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఎప్పుడూ ఇతరుల కోసం మాత్రమే బ్రతికేవారిని ప్రజలు దోపిడీ చేస్తారు. స్వార్థపూరితంగా ఉండటం అంటే ఇతరులకు హాని చేయడం కాదు, ప్రతి వ్యక్తి తన హక్కులను కాపాడుకోవడం.
తెలివి, చాకచక్యం..
తెలివిగా ఉండటం, చాకచక్యంగా ఉండటం రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. తెలివి అంటే పరిస్థితులను తెలివిగా నిర్వహించడం, మాటలు నిర్ణయాలలో సమతుల్యతను కాపాడుకోవడం. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఆలోచించి, సరైన సమయంలో తమ జ్ఞానాన్ని ఉపయోగించే వారు మాత్రమే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తారని చాణక్య నీతి బోధిస్తుంది. చాకచక్యం ఏదైనా పనిని సులువుగా, ఎలాంటి సమస్య లేకుండా చేయడం. కాబట్టి చాకచక్యంగా ఉండటం ముఖ్యమే కానీ తెలివైన వారు కూడా మూర్ఖుడిలా నటిస్తూ సరైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
జాతీయ గణిత దినోత్సవాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 2011లో అధికారికంగా ప్రారంభించింది. రామానుజన్ గణిత విభాగానికి చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది . మరుసటి సంవత్సరం 2012 దేశవ్యాప్తంగా జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకున్నారు, గణిత అభ్యాసం, పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రణాళికలు వేసుకోవడం, ప్రోత్సాహం అందించడం, కృషి చేయడం.. అలాగే గణిత శాస్త్రానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఆయా వ్యక్తులను గౌరవించడం వంటివి జరుగుతాయి.
డిసెంబర్ 22..
డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం. ఆయన కృషి వందేళ్లు గడిచిన తర్వాత కూడా నేటి మోడరన్ గణితాన్ని ప్రభావితం చేస్తోంది. గణితంలో ఆయన చేసిన పరిష్కారాలు, సమస్యలు, ప్రపంచం మీద ఆయన ప్రభావం మొదలైనవి గుర్తించడానికి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఇది ఆయనకు నివాళిగా మాత్రమే కాకుండా, విద్యార్థులు, పరిశోధకులు గణితాన్ని ఆవిష్కరించడం, సాంకేతికత, శాస్త్రీయ విచారణకు కేంద్రంగా గణితాన్ని ప్రోత్సహించడానికి ఒక మంచి వేదిక అవుతుంది.
సుధీర్ఘ ప్రయాణం..
భారతదేశానికి, గణిత శాస్త్రానికి అనుబంధం ఆధునిక చరిత్రది కాదు.. అనేక శతాబ్దాల ముందే ఈ అనుబంధం ఉంది. భారతదేశం గణిత శాస్త్రానికి చేసిన కృషిని క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1800 వరకు గుర్తించవచ్చు. అంకగణితం, బీజగణితం, త్రికోణమితిలో గణనీయమైన పరిణామాలతో పాటు.. దశాంశ సంఖ్యా వ్యవస్థ, సున్నా, ప్రతికూల సంఖ్యలను వాడటం వంటి ప్రాథమిక భావనలు భారతదేశంలో పుట్టాయి.
దాదాపు నాల్గవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న భారతీయ గణిత శాస్త్రంలోని క్లాసికల్, స్వర్ణ యుగాలలో ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కర II వంటి పండితుల నుండి ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. ఇంత సుధీర్ఘమైన బారత గణిత చరిత్రలో శ్రీనివాస రామానుజ్ కూడా ప్రముఖుడు అని చెప్పడానికి ఆయన జయంతి రోజున గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.
రామానుజ్ వారసత్వం..
గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి, భిన్నాలలో రామానుజన్ తన మార్గదర్శకులకు ఎప్పుడూ గుర్తుండిపోతారు. నాటి కాలంలో ఆయనకు అధికారం, శిక్షణ అన్నీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ స్వతంత్రంగా దాదాపు 3,900 ఫలితాలను సంకలనం చేశాడు. వాటిలో చాలా వరకు తరువాత కాలంలో అసలైనవని, చాలా లోతైనవిగా నిరూపించబడ్డాయి. ఆయన విధానం, పద్దతులు ఇరవయ్యవ శతాబ్దపు గణిత శాస్త్రంలోని కీలక రంగాలను పునర్నిర్మించాయి. ఇరవై ఒకటవ శతాబ్దంలో పరిశోధనలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
*రూపశ్రీ.
మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.
విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు. బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్ క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు.
అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు.
ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది.
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు.
కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు. మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయనపై అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.
ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం. అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి, అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు. అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే..
రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం..
నిమ్మకాయ నీరు క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవమైన మూత్రపిండాలకు చాలా పెద్ద నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
మూత్రపిండాల వైద్యులు ఏం చెప్తున్నారు?
చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసే ఏదైనా అలవాటు మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
ఎలక్ట్రోలైట్ అంటే..
పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్, బైకార్బోనేట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు. ఈ ఖనిజాలు శరీరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి గుండె పనితీరుతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాలి.
ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత..
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల తలనొప్పి, గుండె లయ గందరగోళంగా ఉండటం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం చేస్తుంటే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు.. ఇతర మాంసాలతో పోలిస్తే జీర్ణం కావడానకి కూడా తేలికగా ఉంటుంది. చికెన్ లేకుండా భోజనం చేయలేని వారు చాలామంది ఉంటున్నారు. ముక్క లేకపోతే ముద్ద దిగదు అని చాలా గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే రోజూ చికెన్ తినేవారికి చాలా పెద్ద షాకింగ్ న్యూస్. రోజూ చికెన్ తినడం వల్ల జరిగేదేంటో వివరంగా చెప్పేశారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే..
వైద్యులు చెప్పేదాన్ని బట్టి కడుపు క్యాన్సర్ మెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు కారణం అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా చికెన్ ను రెగ్యులర్ గా ఎక్కువ రోజులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు. చికెన్ ను ఎలా వండుతున్నారనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు.
అధికంగా చికెన్ తినడం వల్ల కడుపు, పేగు సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, చికెన్ తినడం వల్ల మాత్రమే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని కాదు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు చికెన్ రెగ్యులర్ గా తినడం కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఒకే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర ఆహారాల నుండి లభించాల్సిన చాలా పోషకాలు లోపిస్తాయని. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా ఒకే ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కడుపు లోపల సహజంగా ఉండే రక్షణ పొర బలహీనం అవుతుందని చెబుతున్నారు.
రోజూ చికెన్ తినడం, అది కూడా బయట తినడం, వేయించిన చికెన్, లేదా వేయించిన ఆహారాలు, బయటి ఆహారాలు తినడం, తక్కువగా కూరగాయలు తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
చికెన్ తింటే క్యాన్సర్ ఎలా వస్తుంది?
శాకాహారాలతో పోలిస్తే చికెన్ జీర్ణం అవడం కాస్త కష్టం. రోజూ చికెన్ తినడం వల్ల జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అధికంగా నూనె లేదా కారం వంటివి తిన్నప్పుడు కడుపులోపలి పొరకు మంట కలుగుతుంది. దీని వల్ల వెంటనే సమస్య కనిపించకపోయినా ఎక్కువ కాలం కంటిన్యూగా చికెన్ తింటే కడుపు లోపలి రక్షణ పొర దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ మంట మీద వండిన చికెన్ ను, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనెతో తయారు చేసిన చికెన్ ను రెగ్యులర్ గా తీసుకుంటే హెటెరోసైక్లిక్ అమైన్స్ అనే హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలను చాలా కాలం పాటు పదే పదే తీసుకుంటే, అవి కణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి రోజూ చికెన్ తినేవారు.. దాన్ని ఎలా వండుతున్నారు, ఎలా తింటున్నారు అనే విషయాన్ని గమనించుకోవాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే..
అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం..
అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ, టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు..
మెదడు, నాడీ వ్యవస్థ..
అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎముకలు, మూత్రపిండాలు..
శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం, ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది. ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది.
వేడి, ఆమ్ల ఆహారం..
అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత, ఆహారం స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా, వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది.
ప్రత్యామ్నాయాలు..
అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని, పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది. ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
