జగన్ మెడకు వివేకా హత్య కేసు
Publish Date:Jul 23, 2023
Advertisement
మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసు ఇప్పటికీ ఇంకా ఇంకా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో నిన్న మొన్నటి వరకూ వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పేరు గట్టిగా వినిపించిన సంగతి విదితమే. ఈ కిరాతకమైన హత్య కేసులో చట్టప్రకారం న్యాయస్థానాలే దోషులను శిక్షించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అని వాయిదా పడుతూ వస్తుంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. సీబీఐ ఈ కేసు విచారణను ఎప్పుడో ముగించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఇంకా తేల్చడం లేదు. దీంతో మళ్ళీ మెల్లగా బయటకి వచ్చిన అవినాష్ ఈ మధ్యనే పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. అదలా ఉండగానే సీబీఐ తను నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలు కోర్టులో ప్రవేశపెట్టడంతో.. కొత్త టెన్షన్ మొదలైంది. గత నెల 30వ తేదీన సీబీఐ కోర్టుకు సమర్పించిన దాదాపు 145 పేజీల చార్జి షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల, ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, వైసీపీ కీలక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ సీబీఐ కోర్టుకు సమర్పించింది. షర్మిల చెప్పిన దాని ప్రకారం రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని, ఆవినాష్ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకి కారణం కావచ్చని, వివేకా అడ్డువస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చు. మరోవైపు ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. తనను వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని ఈ మధ్యనే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల చల్ చేశాయి. మరోవైపు, షర్మిల, ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ నవీన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఈ హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. హత్య జరిగిన విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే అవినాష్ రెడ్డి వైఎస్ భారతీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారనీ అర్ధమవుతున్నది. అదే సమయంలో జగన్ అక్కడే ఉన్న ఎవరికీ హత్య ఎలా జరిగిందో చెప్పకపోవడం, మ్యానిఫెస్టో సమావేశం మధ్యలోనే ఆపేసి పులివెందులకు బయల్దేరాకుండా వైఎస్ భారతీతో చర్చలు జరపడం, అప్పటికే హెలికాఫ్టర్ సిద్ధంగా ఉన్నా కాదని కారులోనే జగన్ బయల్దేరడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అంటే అటు సాక్షులు చెప్పిన దాని ప్రకారం, ఇటు ఆ రోజు పరిస్థితులను చూస్తే హత్య గురించి జగన్, భారతీలకు ముందే తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య జరిగిన రోజున మొదట చూసిన వ్యక్తి పీఏ కృష్ణారెడ్డిగా ఈ కేసులో కొందరు సాక్షులు చెప్పారు. పీఏ కృష్ణారెడ్డి చెబితే ఉదయం 6.30కి అవినాష్ జగన్ కు ఫోన్ చేసిన చెప్పినట్లు జగన్ మ్యానిఫెస్టో మీటింగ్ లో ఉన్న వారికి చెప్పారని ఓఎస్డీ స్టేట్మెంట్ లో చెప్పారు. కానీ, ఉదయం 5.30 గంటల సమయంలో వివేకానంద రెడ్డి చనిపోయారని జగన్ చెప్పినట్టు అజేయ కల్లం స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే ఈ హత్యకు ముందే, హత్య జరిగిన విషయం బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ దంపతులకు తెలుసన్నది సీబీఐ వాదన. హత్య గురించి తెలిసినా తమ్ముడిని కాపాడేందుకే జగన్ గుండెపోటు నాటకానికి తెరతీశారని, అప్పటి నుండి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ్ముడిని కాపాడేందుకు జగన్ మోహన్ రెడ్డి దంపతులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో వివేకా హత్య కేసును జగన్ స్వయంగా తన మెడకు చుట్టుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-in-viveka-murder-case-25-158864.html





