వైసీపీలో రగులుతున్న ఆత్మీయ సమ్మేళనాల చిచ్చు!
Publish Date:Jul 23, 2023
Advertisement
ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్నది. పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు తీర్చేందుకు అధిష్టానం పడరాని పాట్లు పడుతున్నది. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. నేతల మధ్య చిచ్చు తీర్చే క్రమంలో అధిష్టానం పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారౌతున్నది. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు, సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా భావించి వారిని దెబ్బతీసే కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా.. పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారౌతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం తారస్థాయికి చేరింది. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ పార్టీలో కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. ఇలా పార్టీలో విభేదాలు రచ్చకెక్కిన నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, సీనియర్ నేతల నియోజకవర్గాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ, విశాఖలో అవంతి, తూర్పు గోదావరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలో అంతర్గత యుద్ధం నడుస్తున్నది. అది కూడా ఈ బడా నేతల వల్లనే పోరు జరగడం ఇప్పుడు అధిష్టానం సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీనియర్ నేతలకు అదే జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అదే నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ మంత్రి చెల్లుబోయిన వేణు.. మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కి చేరింది. ప్రస్తుతం బోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. తాను ఇండిపెండెంట్‌గా లేదా టీడీపీ తరఫున బరిలో దిగి వేణును ఓడిస్థానని ప్రజలకు చెప్తున్నారు. తాజాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. ఈ తండ్రీ కొడుకులలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వకుంటే వారు పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తున్నది. కాగా, ఆదివారం (జూలై 23) మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. చోడవరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వేణు వర్గం నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించి తన సత్తా చాటుకున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లయిన సందర్భంగానే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు మంత్రి వర్గం చెప్పుకుంది. మంత్రిగా మూడేళ్ళ వేడుక అనే చెప్తున్నా ఇది ముమ్మాటికీ వేణుగోపాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుని బలం నిరూపించుకోవడానికి నిర్వహించిన సమావేశమే వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఇక ఒక్కొక్కటీ ఆత్మీయ సమ్మేళనాల రూపంలో బయటపడే ఛాన్స్ కనిపిస్తున్నది.
http://www.teluguone.com/news/content/disaccord-in-ycp-peaks-25-158866.html





