పార్కునూ వదలని జగనన్న!.. బెజవాడ బెర్మ్ పార్కు తాకట్టు.. 143 కోట్ల అప్పు!
Publish Date:Feb 11, 2022
Advertisement
భూములు, బిల్డింగ్‌లు అయిపోయాయి. అప్పుకోసం పార్కుల మీద పడింది జగనన్న సర్కారు. 5 ఎకరాల అందమైన పార్కును.. అడ్డంగా తాకట్టు పెట్టేసింది. ఆ విషయం తెలిసి విజయవాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. అవునా, మా పార్కు తాకట్టులో ఉందా? అని అవాక్కవుతున్నారు. విజయవాడలో ఐదెకరాల్లో బెర్మ్ పార్కు విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజూ వందలాది మంది బోట్లలో భవానీ ద్వీపానికి వెళ్లి వస్తుంటారు. బెర్మ్ పార్కును ఆనుకొని బోటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం పార్కు ప్రాంగణంలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్ నిర్వహిస్తున్నారు. ఇందులో 30 వరకు రూములున్నాయి. పెద్ద కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. దాన్ని మీటింగ్‌లకు, ఫంక్షన్లకు రెంట్‌కు ఇస్తుంటారు కూడా. అలాంటి.. బెర్మ్ పార్కును ఏపీ ప్రభుత్వం అప్పు కోసం కుదవ పెట్టేసింది. విజయవాడలో కృష్ణానది తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ఉండే అత్యంత విలువైన బెర్మ్ పార్కును.. HDFC బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ-ఏపీటీడీసీ తనఖా పెట్టేసింది. పలు అభివృద్ధి పనుల కోసం 143 కోట్ల రుణం తీసుకుంటోంది. ష్యూరిటీ ప్రక్రియ పూర్తి కావడంతో తొలి విడతగా త్వరలోనే 35 కోట్ల రుణాన్ని బ్యాంకు రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. బెర్మ్ పార్కును కుదవ పెట్టి తీసుకున్న రుణంతో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడంతో పాటు హోటళ్లు, రిసార్టులను ఆధునికీకరిస్తామని బ్యాంకుకు ఏపీటీడీసీ తెలిపింది. వివిధ జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2015-16లో ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనులు.. నిధుల కొరతతో నిలిచిపోయాయి. చేసిన పనులకే దాదాపు 10 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఆ ప్రాజెక్టుల్లో ఇడుపులపాయలో రాజీవ్ నాలెడ్జి వ్యాలీ, లంబసింగి, బొర్రా గుహలు, అహోబిలంలో పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన, గండికోట, కోటప్పకొండ దగ్గర రోప్‌వే వంటివి ఉన్నాయి. ఈ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఏపీటీడీసీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బెర్మ్ పార్కును రూ.143 కోట్ల రుణం కోసం తనఖా పెట్టింది. విషయం తెలిసి విజయవాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే అప్పుల కోసం మద్యం ఆదాయాన్ని ష్యూరిటీగా పెట్టిన జగనన్న.. చివరకూ పార్కులనూ తనఖా పెడుతున్నారా? అంటూ చర్చించుకుంటున్నారు. జగనన్నా.. మజాకా.. అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-govt-mortgage-berm-park-of-vijayawada-39-131586.html





