కేసీఆర్ అజ్ఞాతవాసం అసలు రహస్యం ఇదేనా?
Publish Date:May 14, 2022
Advertisement
కేసీఆర్ ఎక్కడ? కనీసం టీవీ తెర మీద అయినా, ముఖ్యమంత్రి ముఖం కనిపించక పక్షం రోజులకు పైగానే అయింది. నిజానికి, టీవీ తెర మీద కనిపించి, వినిపించక పోవడమే కాదు, వార్తా పత్రికల్లోనూ ముఖ్యమంత్రి చాలా కాలంగా ‘కనిపించుట’ లేదు. అప్పుడెప్పుడో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కనిపించారు. ఇక ఆ తర్వాత ఆయన ఫార్మ్ హౌస్’కే పరిమితం అయ్యారు. నిజమే,ఇలా సుదీర్గకాలం, కనిపించకుండా పోవడం కేసీఆర్’కు కొత్త కాదు. గతంలోనూ ఆయన పరిస్థితులు అనుకూలించని అనేక సందర్భాలాలో తెర చాటుకు పోవడం. తిరిగి ప్రత్యక్షం కావడం చాలా కాలంగా అలవాటుగా వస్తోంది. అలాగే, ఇలా కనిపించకుండా పోయిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్, బాహుబలి రూపంలో రీ ఎంట్రీ ఇవ్వడం కూడా కొత్తకాదు. ఒక విధంగా అలా అదృశ్యం కావడం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమనీ అంటారు. \అయితే, ఈసారి ముఖ్యమంత్రి ఏ వ్యూహంతో, మౌన వ్రతం (గిట్టని వారు ఇంకేదో వ్రతం అంటారు అనుకోండి అది వేరే విషయం) పాటిస్తున్నారు? అంటే, పార్టీ వర్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ వినిపిస్తున్నారు. జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల వ్యూహరచనలో కేసీఆర్ మునిగి తేలుతున్నారని అంటున్నారు. అయితే, మరో వంక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్’ చక్రం తిప్పేందుకు గత ఐదారు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలిచలేదు. అది ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. బీజేపీకి ప్రత్యామ్నాయం కోరుకునే ప్రాంతీయ పార్టీలు అన్నీ, కాంగ్రెస్’ను కలుపుకు పోవాలనే కోరుకుంటున్నాయి. నిజానికి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ కూడా కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదిరించడం అయ్యే పనికాదని,స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా, చివరకు, జాతీయ రాజకీయాలలో కేసీఆర్’కు ఒక గౌరవప్రదమైన స్థానం కలిపించేందుకు పీకేతో కుదుర్చుకున్న ఒప్పందం వలన కూడా చేతి చమురు వదలడమే కానీ, ప్రయోజనం అయితే లేదని, పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. మరో వంక తెలంగాణలో తెరాస ప్రభుత్వం సాధించిన, ‘అద్భుత’ విజయలాను ఎకరువు పెడుతూ. జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. అందుకే, ముఖ్యమంత్రి ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళతారని, అక్కడే రెండు మూడు వారాలు ఉండి జాతీయ పార్టీ/ కూటమి ఏర్పాటు గురించి సీరియస్’ గా చర్చలు జరుపుతారని, రెండు మూడు వారాల క్రితమే పార్టీ వర్గాల చెప్పినా, ఇంతవరకు ముఖ్యమంత్రి, ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్లక పోవడమే కాదు, ఫార్మ్ హౌస్ గడప కూడా దాటలేదని మీడియాలో వస్తున్న కథనాలు సూచిస్తున్నాయి. బీజేపీ అభ్యర్ధికి మద్దతునిస్తే కాంగ్రెస్ కస్సుమంటుంది. బీజేపీతో అక్రమ సంబందాన్ని అంటగడుతుంది. కాంగ్రెస్ సారధ్యంలో ప్రతిపక్ష కూటమి నిలిపే అభ్యర్ధికి మద్దతునిస్తే, బీజేపీ బుస కొడుతుంది. కాంగ్రెస్, తెరాసల సీక్రెట్ లవ్’ ను బయట పెడుతుంది. ఇదొక విధంగా కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా, రాష్ట్రపతి, ఎన్నిక తెరాసకు అగ్నిపరీక్షగా మారింది. ఈ నేపధ్యంలో మరో ఒకటి రెండు చిన్నా చితక పార్టీలు కలిసి వచ్చినా, మూడో అభ్యర్ధిని నిలిపే ప్రయత్నాలలో ఉన్నారని, అందుకే ఆయన ఫార్మ్ హౌస్’ కే పరిమితం అయ్యారని అంటున్నారు. అయితే, పైకి ఏ కారణం చెప్పినా అసలు కారణం ఇంకేదో ఉందని, బహుశా కేటీఆర్’కు పగ్గాలు అప్పగించేందుకు, గౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, కావచ్చని అంటున్నారు. అందుకే, తెర మీద కేసీఆర్’ లేని లోటును కేటీఆర్ తీరుస్తున్నారని అంటున్నారు. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ప్రస్తుత అజ్ఞాతవాసం అసలు రహస్యం ఏమిటన్న విషయంలో పార్టీ శ్రేణుల్లో గందరగోళంనెలకొన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్’ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి నిలిపారని, ఈ ఎన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహం విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/is-that-the-secreat-for-kcr-hiding-in-farm-house-25-135872.html





