బీజేపీ తురఫు ముక్క పాలేనా?- అమిత్ షా అప్పాయింట్ మెంట్ అందుకేనా?
Publish Date:May 14, 2022
Advertisement
రాజకీయాలలో కమేడియన్ గా అందరూ భావించే పాల్ కు తెలంగాణలో హఠాత్తుగా ఇంత ప్రాముఖ్యత ఎందుకు పెరిగిపోయింది. పాల్ ప్రసంగాలను జనం వింటారు. నవ్వుకుంటారు. టీవీల్లో ఆయన హావభావాలు ఒక కామెడీ సినేమా చూసినట్లు చూస్తారు. నవ్వు కుంటారు. అంతకు మించి పట్టించుకోరు. 2019 ఎన్నికలలో ఏపీలో ఆయన కామెడీ పాలటిక్స్ జనానికి మంచి ఎంటర్నైన్ మెంట్ ఇచ్చింది. అంతే అంతకు మించి అక్కడ ఆయన సాధించిందీ లేదు.. ఆయన పార్టీ పోటీలో ఉన్నదీ లేదు. కానీ తెలంగాణలో ఏమైందో కానీ హఠాత్తుగా కేఏ పాల్ అనే వ్యక్తి రాజకీయ చర్చల్లో కేంద్ర బిందువుగా మారిపోయారు. గత ఎన్నికలలో ఏపీపై మాత్రమే కాన్సన్ ట్రేట్ చేసిన ఆయన ఇప్పుడు ఆ రాష్ట్రం ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో మాత్రం కలియతిరిగేస్తున్నారు. ఇక్కడ తన పార్టీ పోటీలో ఉంటుందని చెబుతున్నారు. గెలిచి చూపిస్తానని సవాళ్లూ చేస్తున్నారు. జనానికి ఆయన వాగాడంబరం అలవాటే. కానీ ఆశ్చర్యంగా ఇక్కడ పార్టీలు మాత్రం ఆయనకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాయి. అధికారంలో తెరాస అయితే తెలంగాణలో తమకు పోటీ ఇచ్చేది పాల్ పార్టీయే అంటోంది. టీఆర్ఎస్ వర్గాలు ఆయనపై దాడి కూడా చేశాయి. దాడిపై ఫిర్యాదు చేయడానికి బయలు దేరిన ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు కూడా చేశారు. రాజకీయంగా ఆయనకు టీఆర్ఎస్ ఎందుకంత ప్రాముఖ్యాన్ని ఇచ్చిందన్న సందేహం సర్వత్రా వ్యక్తమైంది. అక్కడితో పాల్ ప్రస్థానం ఆగిపోలేదు. తనపై తెలంగాణలో దాడి జరిగిందంటూ కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడానికి అడగగానే ఆయనకు అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో అందరికీ అర్ధమైంది. పాల్ వెనుక ఉన్న బీజేపీ కారణంగానే తెరాస పాల్ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని. తెలంగాణలో అధికారం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న బీజేపీ.. అందుకు ప్రత్యర్థి ఓట్లు చీల్చడం కూడా ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కారణంగా ముస్లిం ఓట్లలో చీలిక సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చి.. టీఆర్ఎస్ కు క్రైస్తవులను దూరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని వ్యూహం పన్నుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కేఏ పాల్ ను దగ్గరకు తీస్తున్నారని వివరిస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అందరి దృష్టిలో జోకర్ అయినా.. పాల్ క్రైస్తవ మత బోధకుడిగా వెరీ సక్సెస్ ఫుల్. ఆయన బోధనలు విని ఆయనకు అభిమానులుగా మారిన వారు కోకోల్లలు. అందుకే బీజేపీ తెలంగాణలో కేఏ పాల్ ను దువ్వుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ వ్యూహాన్ని గుర్తించింది కనుకనే పాల్ తెరాసకు పోటీ అంటూ కేటీఆర్ వంటి వారు బహిరంగ వేదికలపై ప్రకటించి.. బీజేపీని ఇరుకున పెట్టే యత్నం చేశారు. పాల్ పై దాడికి పాల్పడటం ద్వారా ఆయన తెలంగాణలో క్రియా శీలంగా తిరగకుండా నిరోధించే ప్రయత్నం చేశారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే అమిత్ షా అడిగిన వెంటనే పాల్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం.. దాడులకు వెరవ కుండా తెలంగాణలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనేందుకు భరోసా ఇవ్వడాన్ని చూడాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/bjp-depend-on-paul-to-trouble-kcr-25-135869.html





