కేసీఆర్ ఓడిపోయారా? కేసీఆర్‌ను ఓడించారా? హుజురాబాద్ రణనీతి ఏంటి?
Publish Date:Nov 2, 2021
Advertisement
నేను మామూలు మనిషిని కాను. ముఖ్యమంత్రిని. ప్రగతిభవన్ అధినేతను. ఉద్యమ నాయకుడిని. తెలంగాణ నా జాగీరు. ఓటర్లు నేను ఆడినట్టు ఆడించే తోలుబొమ్మలు. నన్ను కాదని ఎవరైనా ఎదిగితే తొక్కేస్తా. ప్రశ్నిస్తే పక్కనపెట్టేస్తే. నిలదీస్తే నలిపేస్తా. ఇలా ఉంటుంది కేసీఆర్ మనోభావం అని అంటుంటారు. అందుకు తగ్గట్టే ఉంటుంది ఆయన వ్యవహార తీరు. కేసీఆర్ మోనార్క్ అని.. ఎవరి మాటా వినరని.. మంత్రులనూ పట్టించుకోరని.. ప్రజలంటే చులకన భావమని.. అది ప్రగతిభవన్ కాదు.. బానిస భవన్ అంటూ.. కేసీఆర్ ఉక్కు పిడికిలి విడిపించుకొని బయటికొచ్చారు ఈటల రాజేందర్. కేసీఆర్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న కుడిభుజం ఇలా తెగిపడటంతో.. తాను అవిటి వాడిని కాలేదని.. తానింకా బాహుబలినే అనే మెసేజ్ బలంగా వినిపించడానికి హుజురాబాద్ ఎన్నికల్లో పెద్ద యుద్ధమే చేశారు గులాబీ బాస్. ఆ హుజురావార్‌లో వార్ వన్‌సైడ్‌గా మారి.. కేసీఆర్ బాహుబలి కాదు భల్లాలదేవుడని నిరూపించారు ఈటల రాజేందర్. ఇంతకీ ఈ రాజకీయ యుద్ధంలో కేసీఆర్ ఓడిపోయారా? లేక, కేసీఆర్‌ను అంతా కలిసి ఓడించారా? కేసీఆర్ ఓడిపోయారా? లేదా? అంటే.. అవును కేసీఆర్ ఓడిపోయారు. గెలుస్తాననుకున్నారు కానీ సాధ్యం కాలేదు. గెలుపు కోసం ఆయన ఎంచుకున్న కుట్రలు, కుతంత్రాలను ఓటర్లు అసహ్యించుకున్నారు. ఈటలపై భూకబ్జాకోరు ముద్ర వేసి, మంత్రి పదవిపై వేటు వేయడం చూసి.. కేసీఆర్ కుటుంబం ఏమైనా సుక్కం పూసా అంటూ లైట్ తీసుకున్నారు. అందుకే, ఈ ఎన్నికల్లో అవినీతి మేటర్ అంతలా ప్రభావం చూపలేదంటున్నారు. అందుకే, ఈటలను దోషిగా నిలబెట్టడంలో కేసీఆర్ ఓడిపోయారు. ఇక ఈటల పార్టీని వీడుతూ ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నిటినీ రాసి పెట్టుకున్నట్టున్నారు సీఎం కేసీఆర్. కొద్దిరోజుల్లోనే రేషన్ కార్డులు జారీ చేయడం, దళితుడిని పీఎంవోలోకి తీసుకోవడం చేశారు. ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి రారు.. మంత్రులను లోనికి రానీయరంటూ ఈటల విమర్శించగా.. ఆ తర్వాత నుంచీ ప్రగతిభవన్ గేట్లు బార్లా తెరిచిపెడుతున్నారు. ఏకంగా ప్రతిపక్ష నేతలను సైతం లోనికి ఆహ్వానించారు. ఆసుపత్రుల తనిఖీలు, జిల్లాల పర్యాటనలతో ప్రజల్లోకి వచ్చినట్టు చేసి హడావుడి చేశారు. అయితే, అవన్నీ ఈటల ఎఫెక్ట్ వల్లేనని ప్రజలు భావించారు. ఇలా.. ఈటల చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించడంలో కేసీఆర్ ఓడిపోయారు. 20 ఏళ్లుగా జరగని అభివృద్ధి హుజురాబాద్‌లో 20 వారాల్లో చేసి చూపించారు సీఎం కేసీఆర్. మరి, ఇన్నాళ్లూ ఏమై పోయారు? రోడ్డేయలేదు.. ఇళ్లు ఇవ్వలేదు.. కమ్యూనిటీ హాళ్లు కట్టించలేదు.. ఇవన్నీ ఇప్పుడే గుర్తొచ్చాయంటే అదంతా ఈటల దయేనంటూ జనం డిసైడ్ అయ్యారు. అలా, తాను మాత్రమే హుజురాబాద్‌ను అభివృద్ధి చేయగలనంటూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంలో కేసీఆర్ ఓడిపోయారు. ఇక దళితబంధు. కేసీఆర్ అమ్ములపొది నుంచి బయటకు తీసిన బ్రహ్మాస్త్రం. దాన్ని తొలుత ఈటల ఇలాఖా హుజురాబాద్‌పైనే ప్రయోగించారు. ఆ ఆయుధం ప్రభావంతో ఈటల మాడిమసైపోతారని వేసిన అంచనా గురి తప్పింది. ఈటల వల్లే దళితబంధు వచ్చిందంటూ.. ఆ పథకం ఆయనకే బూమరాంగ్‌గా మారి దెబ్బకొట్టింది. అందుకే, దళితబంధు ప్రారంభించిన శాలపల్లిలోనూ ఈటలకే మెజార్టీ వచ్చింది. ఇలా.. దళితబంధు విషయంలో కేసీఆర్ ఘోరంగా ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోవడం ఎంత నిజమో.. కేసీఆర్‌ను అంతా కలిసి ఓడించారనేది కూడా అంతే బలమైన అంశం. కేసీఆర్ దురహంకారానికి చెంపపెట్టు ఈ ఫలితం అంటున్నారు. కేసీఆర్ మోనార్కేమీ కాదు.. ఆయనకంటే మొనగాళ్లూ ఉన్నారనే మెసేజ్ ఇచ్చింది హుజురాబాద్. దొరల నియంతృత్వ పోకడలను ఎంతోకాలం ఆమోదం ఉండదని.. ప్రజల మధ్యకు రాని ముఖ్యమంత్రిని ఇలానే కర్రు కాల్చి వాత పెడతామని హుజురాబాద్ ఓటర్లు బలంగా చాటారు. కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఎప్పటికీ పబ్బం గడుపుకోలేరని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దళితులకు ఏడేళ్లుగా మోసం అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి దళితబంధు అంటే ఆ వర్గం నమ్మలేదు. అందుకే, దిమ్మతిరిగేలా బదులిచ్చారు. డబ్బుసంచులతో, తాయిలాలతో, బెదిరింపులతో ప్రతీసారి గెలుపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అంతా కలిసి కేసీఆర్‌ను ఓడించారు. గులాబీ బాస్‌కు మంచి గుణపాఠం చెప్పారు.. అని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/is-kcr-defeated-in-huzurabad-by-election-25-125697.html





