డిప్యూటీ సీఎంపై ఐటీ పంజా.. 1000కోట్ల ఆస్తులు సీజ్.. ఏపీలో కలకలం..
Publish Date:Nov 2, 2021
Advertisement
రాజకీయం..అవినీతి. రెండిటినీ వేరు చేసి చూడలేని దుస్థితి. రాజకీయంగా ఎంత ఎదిగితే.. అంతలా అవినీతికి పాల్పడుతున్నారు కొందరు నేతలు. వందలు, వేల కోట్ల అక్రమ సంపాదన పోగేస్తున్నారు. కొందరిపై లక్షల కోట్లు దోచేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులు, కోర్టులు, శిక్ష, జైలు, బెయిల్‌లాంటి విషయాలు కొందరికి కామన్ అయ్యాయి. దొరికితే దొంగ.. లేదంటే లీడర్..అన్నట్టు తయారైంది రాజకీయం. ఏపీ సీఎం జగన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి.. బెయిల్‌పై బయటకొచ్చి.. రాష్ట్రాన్ని ఏలుతున్నారు. తాజాగా మహారాష్ట్రను పాలిస్తున్న డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ సైతం ఆ జాబితాలో చేరినట్టు ఉన్నారు. అజిత్ పవార్‌కు ఐటీ శాఖ గట్టి షాకిచ్చింది. దాదాపు రూ.1000కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబయిలోని నారిమన్ పాయింట్‌లో గల నిర్మల్ టవర్‌తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో పవార్‌కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తుల్లో అజిత్ పవార్ కుటుంబానికి చెందిన కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీలో రూ.20కోట్ల విలువ చేసే ఫ్లాట్, నిర్మల్ టవర్‌లో రూ. 25కోట్ల విలువ చేసే పార్థ్ పవార్ (అజిత్ కుమారుడు) ఆఫీస్, రూ.600 కోట్ల విలువైన షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో ఓ రిసార్టును అధికారులు అటాచ్ చేసిన జాబితాలో ఉన్నాయి. గత నెలలో అజిత్ పవార్ సోదరీమణుల నివాసాలు, కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసి రూ.184కోట్ల మేర లెక్కకు రాని ఆదాయం సీజ్ చేశారు. తాజాగా అజిత్ పవారే టార్గెట్‌గా ఐటీ రైడ్స్ జరిపి.. ఏకంగా వెయ్యి కోట్ల ఆస్తులు జప్తు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మరాఠా కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకే.. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తమపై ఐటీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్. మహారాష్ట్రలో ఐటీ దాడుల విషయం ఏపీలోనూ కలకలం రేపుతోంది. ఇటీవల వైసీపీ-కేంద్రం మధ్య సత్సంబంధాలు మారిపోతుండటంతో.. తమపైనా ఐటీ రైడ్స్ జరిగితే.. తామూ దొరికిపోతామనే భయం చాలామంది వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే, కేంద్రానికి జీహుజూర్ అన్నట్టు ఉంటోంది వైసీపీ ప్రభుత్వం. లేదంటే.. ప్రభుత్వ పెద్దలపై ఐటీ, ఈడీ, సీబీఐ కత్తి.. వేటు వేసేందుకు రెడీగా ఉందనే సంగతి అందరికీ తెలుసిందే..
http://www.teluguone.com/news/content/deputy-cms-1000-crore-properties-seized-by-it-25-125695.html





