వైసీపీ 'బి' టీమ్‌గా బీజేపీ? విజయవాడలో జగన్ అనుగ్రహ సభ!
Publish Date:Dec 28, 2021
Advertisement
ప్రజాగ్రహ సభ పేరుతో విజయవాడలో ఏపీ బీజేపీ భారీ బహిరంగ సభ. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలపై విరుచుకుపడటమే సభ ఉద్దేశం.. జగన్‌ను ఏకిపారేయడమే మీటింగ్ లక్ష్యం.. అంటున్నారు కమలనాథులు. అయితే, జగన్‌పై బీజేపీ చేస్తున్నదంతా ఉత్తుత్తి పోరాటమే అనే అనుమానం. అమరావతి కోసమే పోరాడని వాళ్లు.. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి మేము సైతమంటే నమ్మే వాళ్లు ఎవరు? అంటున్నారు. అందుకే, ఏపీ బీజేపీ బహిరంగ సభపై ప్రతిపక్ష టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... విజయవాడలో బీజేపీ నిర్వహించేది ప్రజాగ్రహ సభ కాదని.. జగన్ అనుగ్రహ సభ అంటే బాగుండేదని పయ్యావుల అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలు కొనసాగిస్తున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం నోరెత్తడం లేదని ఆరోపించారు. బీజేపీకి బ్రాండ్‌గా ఉన్న హిందుత్వ అంశాలపైనా మౌనంగా ఉన్నారని.. ఆలయాలపై దాడులు జరిగినా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని కేశవ్ మండిపడ్డారు. "అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చి చెబితేనే మేలుకొన్నారు. పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చి దాడులు చేస్తున్నారు. ఏపీ బీజేపీ.. ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసం పనిచేసేలా తయారైంది. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మోదీ, అమిత్‌షా నెట్‌వర్క్‌లో పనిచేస్తుంటే.. ఏపీ బీజేపీ మాత్రం జగన్ నెట్‌వర్క్‌లో పనిచేస్తోంది. కేంద్ర నిధులు దారి మళ్లిస్తుంటే ఇక్కడి బీజేపీ నేతలకు ఏమాత్రం పట్టట్లేదు. నిజంగా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆర్థిక అరాచకాలపై పోరాడాలి" అని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/is-ap-bjp-becomes-ycp-b-team-39-129189.html





