ఆత్మకూరులో మేకపాటి ప్రత్యర్థి భరత్ కుమార్ యాదవ్.. డిపాజిట్ అయినా దక్కేనా?
Publish Date:Jun 3, 2022
Advertisement
బీజేపీ ముందు నుంచీ చెబుతున్నట్లుగానే ఆత్మకూరులో అభ్యర్థిని పోటీలో నిలబెట్టి అధికార వైసీపీ నెత్తిన పాలు పోసింది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ను రంగంలోనికి దింపింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబీకులకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఆనవాయితీని పాటించి తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. అయితే రాష్ట్రంలో ఏ మాత్రం పొలిటికల్ స్టేక్ లేని బీజేపీ తగుదునమ్మా అంటూ ఆనవాయితీని తోసి రాజని అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఇక్కడ పోటీ అనివార్యం అయ్యింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ కూడా వైసీపీ ఆత్మకూరులో పోటీ జరగాలని ఆశిస్తూ వచ్చింది. ఎందుకంటే బలమైన తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో పోటీ అంటూ జరిగితే వైసీపీ విజయం నల్లేరు మీద బండినడకే, అయితే మెజారిటీ విషయంలో కొత్త రికార్డులు సృష్టించుకుని.. జనంలో తమ పార్టీకీ, ప్రభుత్వానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరిగిందని చెప్పుకునే వీలుంటుంది. అలాంటి వీలును అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ వైసీపీకి ఇచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టడానికి బీజేపీ నానా యాతనలూ పడాల్సి వచ్చింది. పార్టీ తరఫున అభ్యర్థే దొరకక మల్లగుల్లాలు తొలుత బిజవేముల రవీంద్రరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దింపాలని భావించినా, పోటీ అనే సరికి ఆయన మొహం చాటేశారు. దీంతో పోటీ చేయడానికి అభ్యర్థి ఎవరూ దొరకని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని రంగంలోనికి దింపింది. అయితే పరిశీలకులు మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ వచ్చినా గొప్పేనని వ్యాఖ్యానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-candidate-in-atmkur-bharat-kumar-yadev-can-he-get-deposit-25-136952.html





