హైదరా'బాధ' తీర్చలేకపోతోన్న మెట్రో రైల్!
Publish Date:Sep 12, 2016
Advertisement
హైద్రాబాద్ ఇప్పుడు మెట్రోపాలిటన్ కాదు కాస్మోపాలిటన్! అంటే... విశ్వనగరం అన్నమాట! మామూలు సమయాల్లో ఈ మాట బాగానే వుంటుంది కాని ప్రతీ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జాముల్లో హైద్రాబాదీలు పడే నరకయాతన అంతా ఇంతా కాదు! అప్పడు తెలుస్తుంది హైద్రాబాద్ నిజమైన స్టేటస్! అయితే, జనానికి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇప్పుడప్పుడప్పుడే తీరేలా లేవు! హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యలకి పెద్ద రిలీఫ్ అనుకున్నారు మెట్రో. ఇదుగో వస్తుంది, అదుగో వస్తుంది అంటూ ఊరించారు ప్రభుత్వం, నిర్మాణ సంస్థ వాళ్లు కూడా! కాని, లేటెస్ట్ సమాచారం ప్రకారం మెట్రో డ్రీమ్స్ ఇప్పుడప్పుడే తీరే సూచనలు ఎంత మాత్రం లేవు. నిజానికి పోయిన సంవత్సరమే తొలి మెట్రో ట్రైన్ చక్కర్లు కొడుతుందని ఎల్ అండ్ టీ చెప్పింది. కాని, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం గడిచిపోతున్నా ఇప్పటికీ ఫస్ట్ మెట్రో పట్టాలెక్కలేదు... సిటీ మొత్తం విస్తరించేలా అన్ని దిశల్లో సాగుతోన్న మెట్రో వర్క్స్ ఎక్కడా ఓ కొలిక్కి రాలేదు. నాగోల్ మెట్టుగుడా మధ్య ట్రాక్ పూర్తిగా సిద్ధమైనా ఇంత వరకూ మెట్రో సర్వీస్ మొదలు కాలేదు. ఇక మియాపూర్, ఎస్ ఆర్ నగర్ మధ్య లైన్ కూడా దాదాపు కంప్లీట్ అయింది. అయినా ఫినిషింగ్ టచ్చెస్ ఇస్తున్నారు. రైల్వే శాఖ నుంచి సర్టిఫికెట్ కూడా రావాల్సి వుంది. ఈ లైన్ కూడా సంవత్సరం కిందే ఉపయోగంలోకి రావాల్సి వుంది. మెట్టుగుడా, బేగంపేట మధ్య నడుస్తున్న మెట్రో వర్క్ కూడా ఆలస్యంగానే సాగుతోంది. ఈ లైన్ లో అనేక చోట్ల రైల్వే ట్రాక్ పైనుంచి మెట్రో బ్రిడ్జ్ కట్టాల్సి వుండటంతో పర్మిషన్స్ రాక పని మందగించింది. ఎంతో మంది ఉద్యోగస్థులకి ఉపయోగపడే బేగంపేట, శిల్పారామం లైన్ కూడా తాపీగా సాగుతోంది. ఈ సంవత్సరం పూర్తవతుందని మొదట చెప్పినప్పటికీ 2018 చివరికి కూడా డౌటే అంటున్నారు! ఎస్ ఆర్ నగర్, ఎల్బీనగర్ మధ్య నడవాల్సిన మెట్రో కూడా 2016లోనే జనానికి అందుబాటులోకి రావాల్సింది. కాని, అసెంబ్లీ భవనం వుండటంతో అలైన్మెంట్ ఛేంజ్ అంటూ చాలా రోజులు పనులు ఆపేశారు. ఇప్పుడు నడుస్తున్నా మరో రెండేళ్ల వరకూ పూర్తయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. మెట్రో పనుల్లో అత్యంత దారుణంగా నడుస్తున్న మార్గం జేబీఎస్, ఫలక్ నుమా. అసలు ఈ లైన్లో చాలా చోట్ల పని కొంచెం కూడా మొదలు కాలేదు. సుల్తాన్ బజార్ తొలగించాల్సి వుండటంతో చాలా రోజులు నిరసనలు కొనసాగాయి. ఎట్టకేలకు ఇప్పుడు అడ్డంకులు తొలిగినా పనులు నత్తనడకన సాగుతన్నాయే తప్ప స్పీడ్ అందుకోవటం లేదు!
అటు ప్రభుత్వం , ఇటు మెట్రో నిర్మాణ సంస్థ రెండూ చెబుతున్న లెక్కల ప్రకారం హైద్రాబాదీల కల ఇప్పుడప్పుడే తీరే సూచనలు కనిపించటం లేదు. మరో నాలుగేళ్లైతే తప్ప మెట్రో ఓ కోలిక్కి వచ్చే అవకాశం లేదు. పైగా మెట్రో పనులు ఆలస్యమైన కొద్దీ రోడ్డుపైన కూడా ట్రాఫిక్ జాములు పెరిగిపోయి నగర వాసులు నరకం చూస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎప్పుడు దీనిపై దృష్టి పెడుతుందో ఏంటో?
http://www.teluguone.com/news/content/hyderabad-metro-rail-45-66351.html





