ఆ బాబా 'జీన్స్'లోనే బిజినెస్ వుంది!
Publish Date:Sep 12, 2016
Advertisement
మారుతున్న కాలంతో పాటూ మారేదే ఎక్కువ కాలం మన్నుతుంది! లేకపోతే అంతరించిపోతుంది! ఈ సత్యానికి సజీవ సాక్ష్యం హిందూ మతం! బాబా రాందేవ్ తాజా ఉదాహరణ! హిందూ స్వామీజీలు అంటే గడ్డాలు పెంచుకుని, కాషాయం ధరించి, గంభీరంగా కూర్చునే పుటకు గతిలేని సన్యాసులు. ఇంత వరకూ అందరూ ఇలాగే అనుకునేవారు. లేదంటే కొందరు దొంగ స్వామీజీల సంగతి సరేసరి! కోట్లాది రూపాయల ఆస్తులు, ఛండాలమైన వ్యవహారాలు... ఇదీ వరస! అలాంటి హిందూ బాబాల్ని, స్వామీల్ని మీడియా తనకు వీలైనంత ఏకిపారేస్తూనే వుంటుంది. మనం అడగాల్సిన పనే లేదు! పోగా మిగిలిన నిజమైన సాధువులు జనాన్ని పట్టించుకోకుండా తమ జీవితం తాము గడిపేస్తుంటారు! యోగా గురు బాబా రాందేవ్ ఇప్పుడు హిందూ స్వామీజీ అన్న పదానికే సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. కాషాయం కట్టినప్పటికీ ఆయన ఎప్పుడూ డిఫరెంటే. యోగా నేర్పటంతో మొదలు పెట్టిన ఆయన ప్రయాణం ఆ మధ్య కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిరాహార దీక్షతో కొత్త మలుపు తిరిగింది. పొలిటికల్ గా ఆయన మీద ఎన్నో దాడులు కూడా జరిగాయి. అన్నిట్ని తట్టుకుని నిలబడ్డ ఆయన మోదీ ప్రధాని అయ్యాక తిరుగులేని కార్పోరేట్ అయ్యారు! ఇప్పటి దాకా స్వామీజీలు, బాబాలు ఆశ్రమాలు పెట్టి కోట్లు సంపాదించి వుండవచ్చు. విమర్శలు ఎదుర్కోవచ్చు. లేదంటే తమ సేవా కార్యక్రమాలతో ప్రశంసలు కూడా పొందవచ్చు. కాని, బాబా రాందేవ్ మరీ వినూత్నంగా దూసుకుపోతున్నారు! పతంజతి ప్రాడక్ట్స్ తో ఆయన వ్యాపారంలోకి దిగారు. చూస్తుండగానే వేల కోట్ల టర్నోవర్ సృష్టించారు. దాంతో పాటే తక్కువ ధరకి వినియోగాదారులకి అత్యుత్తమ వస్తువుల్ని అందిస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే చాలా మంది రాందేవ్ బాబా ఆర్జన మీద అప్పుడప్పుడూ సెటైర్లు వేయటం మనకు తెలిసిందే. కాని, ఆయన తన ఆయుర్వేదిక్ ప్రాడక్ట్స్ అమ్మకం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయి మళ్లీ సమాజ శ్రేయస్సు కోసమే వాడుతున్నారు. సో... ఆయన నిస్వార్థ కార్పోరేట్ అన్నమాట! ఇంతకాలం పతంజలి బ్రాండ్ తో ఆయుర్వేదిక్ మందులు, ఉత్పత్తుల వరకూ మాత్రమే పరిమితమైన బాబా ఇక మీదట మరో కొత్త అంకం ప్రారంభించనున్నారు. నాగపూర్ లో వెయ్యి కోట్ల భారీ పెట్టుబడితో జీన్స్ ప్యాంట్ల తయారీ యూనిట్ మొదలుపెట్టబోతున్నారు. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ ఫ్యాక్టరీలో పూర్తిస్థాయి స్వదేశీ జీన్స్ లు రెడీ అవుతాయట! ఇప్పటికే బాబా తీసుకొచ్చిన పేస్టులు, సబ్బుల వల్ల కోల్గేట్, లైఫ్ బాయ్ లాంటి బ్రాండ్ లు లబోదిబోమంటున్నాయి. మరి ఈ రాందేవ్ జీన్స్ రంగంలోకి దిగితే రచ్చ ఎలా వుంటుందో?
బాబా కేవలం ఇండియానే కాకుండా పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మొదలు సౌదీ అరేబియా దాకా ఇంకా చాలా దేశాల్ని టార్గెట్ చేస్తున్నారు. అత్యధిక ముస్లిమ్ జనాభ వున్న దేశాల్ని కూడా బాబా రాందేవ్ తమ ఉత్పత్తులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయటం విశేషం! మొత్తం 50లక్షల కోట్ల టర్నోవర్ తమ లక్ష్యమని బాబా రాందేవ్ నమ్మకంగా చెబుతున్నారంటే... మన స్వామీజీ ప్రవేశపెడుతున్న కాషాయ జీన్స్ కల్లోలం సృస్టించటం ఖాయమే!
http://www.teluguone.com/news/content/baba-ramdev-45-66360.html





