సిఆర్ఆర్ కు కాంగ్రెస్ లో సహాయ నిరాకరణ
Publish Date:Mar 12, 2012
Advertisement
ఆదిలాబాద్: ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న సి.రామచంద్రారెడ్డికి ఆ పార్టీలోకి సీనియర్ నాయకుల మద్దతు లభించడం లేదు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిఆర్ఆర్ నామినేషన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎంపి వివేక్, ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్యే సక్కు, మాజీ ఎంపి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు మొక్కుబడిగా పాల్గొన్నారు. తరువాత వారి ఆచూకి లేకుండా పోయింది. ఈ నియోజకవర్గానికి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బసవరాజు సారయ్య, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డిలు ఎన్నికల ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరు కూడా మనస్ఫూర్తిగా సిఆర్ఆర్ కు సహకరించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాస్తో కూస్తో పేరున్న సారయ్య, మహేశ్వరరెడ్డిలు మాత్రమే రామచంద్రారెడ్డికి అండగా నిలిచి ప్రచారం చేస్తున్నారు. తాము ఎన్నికల ప్రచారంలోకి దిగితే తెలంగాణా అంశంపై ప్రజలు తమను నిలదీస్తారేమోనన్న భయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కారణాలు ఏమైనా సీనియర్లు సహాయ నిరాకరణతో డీలాపడిన రామచంద్రారెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతోనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-12562.html





