ససేమిరా: జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి
Publish Date:Feb 12, 2012
Advertisement
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచేందుకు మంత్రి మండలి ఉపసంఘం విముఖత వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీనియర్లు, ప్రొఫెసర్లు, పదవీవిరమణ చేసినవారి సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. అనంతరం మంత్రి కొండ్రు మురళి, శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. స్టైఫండ్ విషయంలో జుడాలు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా స్టైఫండ్ ఇస్తున్నామని ఇక పెంచకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని కొండ్రు మురళి చెప్పారు. జూనియర్ డాక్టర్ల 11 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి శైలజానాథ్ చెప్పారు. వారు మొండి పట్టుదలకు పోవడం మంచిదికాదన్నారు. వైద్య విద్యార్థుల డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నప్పటికీ వారు బెట్టుకు పోతున్నారని విమర్శించారు. గొంతెమ్మ కోర్కెలు సరికాదన్నారు. కొత్తగా 108 వాహనాలు కొనుగోలు చేసేందుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా, గ్రామాలలో మూడేళ్లు పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. స్టైఫండ్ పెంచితేనే సమ్మె విరమిస్తామని వారు తెగేసి చెప్పారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11845.html





