సంచలనానికి తెర తీయబోతున్న దాసరి
Publish Date:Feb 6, 2012
Advertisement
హైదరాబాద్: సొంతపార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ద్వారా దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలనానికి తెరదీయబోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాసరి మరో సినిమా అస్త్రాన్ని ప్రయోగించనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షాలపై వ్యంగ్య చిత్రాలు తీసిన దాసరి ఈసారి మాత్రం సొంత పార్టీ నేతల పైనే తీయనున్నారని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో నమోదు చేసినట్లుగా సమాచారం. త్వరలో తన పదవి ముగుస్తుండటం, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం, చిరుకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండటం వంటి ఇలాంటి సమయంలో దాసరి అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ నమోదు చేయించారనే వార్త చర్చకు దారి తీసింది. గత సాధారణ ఎన్నికలకు ముందు ఆయన మేస్త్రీ అనే చిత్రాన్ని తీశారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని లక్ష్యంగా చేసుకొనే ఆయన ఈ సినిమా తీసినట్టు ప్రచారం జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై సినిమా ద్వారా వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టడంలో దాసరికి ఎవరూ సాటి లేరనే చెప్పవచ్చు. ఆయన తాజాగా తలపెట్టిన చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో దాసరి తన ఉదయం పత్రిక ద్వారా ఆయనను టార్గెట్ చేశారు. అయితే అప్పుడు కాంగ్రెసులో ఉండటంతో టిడిపి, ఆ తర్వాత మేస్త్రీ ద్వారా చిరంజీవిని టార్గెట్ చేశారు. మారిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకోవడం విశేషం.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11643.html





