ఏపీ మద్యం స్కాం.. విజయసాయికి ఈడీ నోటీసులు
Publish Date:Jan 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.
http://www.teluguone.com/news/content/enforcement-directorate-notice-vijayasai-39-212636.html





