ముగిసిన గ్రామ సభలు... రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీ దరఖాస్తులు
Publish Date:Jan 25, 2025
.webp)
Advertisement
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు నిన్నటితో ముగిసాయి. 16, 348 గ్రామసభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. శనివారం నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేటీంలు ఇంటింటికి వెళ్లనున్నాయి. గతంలో ప్రజాపాలనలో లబ్ది చేకూరని వారికి గ్రామసభలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్దిదారులకు అర్హత ఉందా లేదా అనేది ఈ రీ సర్వేలో చేయనున్నారు ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామసభల్లో పలువురు రాష్ట్రమంత్రులు , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి ప్రజలు దరఖాస్తులు అందజేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్దిదారులను కన్ఫర్మ్ చేయడానికి గ్రామసభలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుక జరిగింది. అన్నీ చోట్ల భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే లబ్దిదారుల ఎంపిక కాకపోవడం ప్రతికూలాశం. అనర్హులకు అవకాశాలు రావడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.
రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితాలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేరు ఉండటం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం, పచ్చల నడికుడి గ్రామ సభలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జాబితా నుంచి నా పేరు తొలగించాలని స్వయంగా అన్వేష్ రెడ్డి అధికారులను కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామకృష్ణాపురంలో అనర్హులుకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. తుంగతుర్తిలో కూడా అనర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు లభించింది. మెజారిటీ గ్రామసభలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతరేకత వచ్చింది. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది.
హన్మంకొండ జిల్లా కమలాపూర్ లో జరిగిన గ్రామసభలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ ఆయన వాకౌట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కోడి గుడ్లు, టమాటోలు, చెప్పులు విసిరారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లో ఆత్మీయ సభకు తమను సెలెక్ట్ చేయాలన్న డిమాండ్ స్థానిక కూలీల నుంచి వచ్చింది. బోథ్ మండలం సోనాలి గ్రామ సభలో బిజెపి, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చిన్నపాటియుద్దమే జరిగింది. రెబ్బన మండలంలో అనర్హులకు అవకాశం వచ్చిందని స్థానికులు ఉక్రోశం వెలిబుచ్చారు. రోడ్డుపై బైఠాయించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో కాంగ్రెస్, బిజెపి శ్రేణులు కొట్టుకున్నాయి. గద్వాలజిల్లా థరూర్ మండలంలో ప్రజలు గ్రామసభలను బహిష్కరించారు. నాగార్ కర్నూలు జిల్లా తెలకపల్లి గ్రామంలో కాంగ్రెస్, బిజెపి శ్రేణులమధ్య పెద్ద గొడవ జరిగింది. ఉమ్మడి ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయని చెప్పొచ్చు.
http://www.teluguone.com/news/content/ended-gram-sabhas-massive-applications-for-ration-cards-39-191840.html












