అయోధ్యరామిరెడ్డి ఖండించినా.. అగని రాజీనామా ప్రచారం
Publish Date:Jan 25, 2025
.webp)
Advertisement
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు శుక్రవారం (జనవరి 24) సాయంత్రం నుంచీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కూడా విజయసాయి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాననీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అయోధ్యరామిరెడ్డి రాజీనామా వార్త ప్రచారంలోకి రావడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ వార్త బయటకు పొక్కిన క్షణాల్లో పలువురు వైసీపీ మాజీ నేతలు అయోధ్యరామిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారంటూ విశ్లేషణలు చేశారు. వైసీపీ వర్గాలు కూడా గత కొంత కాలంగా అయోధ్యరామిరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, ఆయన ఎప్పుడో అప్పుడు పార్టీ మారుతారని అనుకుంటూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. వైసీపీలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నలుగురైదుగురు నేతలలో కచ్చితంగా అయోధ్యరామిరెడ్డి ఒకరు. రాంకీ అధినేత అయిన అయోధ్యరామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా గుర్తింపు పొందారు. అటువంటి అయోధ్యరామిరెడ్డి రాజీనామా వార్తలు వైసీపీలో కలవరం రేపాయి. అయితే ఒకింత ఆలస్యంగానైనా అయోధ్యరామిరడ్డి తన రాజీనామా వార్తలను ఖండించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాననీ, వారం రోజుల్లో తిరిగి వస్తాననీ, అప్పుడు మీడియాతో వివరంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అయోధ్యరామిరెడ్డి తాను వైసీపీలోనే ఉన్నానని కరాఖండీగా చెప్పినప్పటికీ ఆయన మాటలను సొంత పార్టీ శ్రేణులే విశ్వసించడం లేదు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత నుంచీ అయోధ్యరామిరెడ్డి పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించింది లేదు. ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లారనీ, కమలం కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారనీ గత కొంత కాలంగా వార్తలు వినవస్తూనే ఉన్నాయి. బీజేపీ కూడా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కమలం వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/no-stop-of-ayodhyaramireddy-resignation-propaganda-even-after-he-condemn-39-191842.html












