జగన్ కు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం.. విజయసాయి భయమేంటి?
Publish Date:Jan 25, 2025

Advertisement
విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన.. ఇక తన భవిష్యత్ వ్యాపకం వ్యవసాయమే అంటూ చేసిన రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అయితే పూర్తిగా డీలా పడిపోయింది. జగన్ పై పార్టీలో విశ్వాసరాహిత్యం పెచ్చరిల్లిందనడానికి విజయసారి రాజీనామాయే ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు. తన రాజీనామా విషయంలో విజయసాయి ఎంత చెప్పినా, ఎంతగా తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నా, వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని ఎంతగా నమ్మబలికినా ఎవరూ నమ్మడం లేదు. ఎవరిదాకానో ఎందుకు వైసీపీ వర్గాలే ఆయన మాటలను విశ్వసించడం లేదు. జగన్ కు పట్ల అంత విధేయత ఉంటే.. కనీసం ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకైనా రాజీనామా ప్రకటన చేయకుండా ఉండాలి కదా అంటున్నారు. వాస్తవానికి విజయసాయి రాజీనామా ప్రకటన కంటే.. ఆ ప్రకటన ఆయన చేయడానికి ఎంచుకున్న సమయం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీ శ్రేణులకు పార్టీకి ఇక భవిష్యత్ లేదన్న సంకేతాన్ని పంపించిందనడంలో సందేహం లేదు. అన్నీ జగన్ కు చెప్పాను, ఆ తరువాతే రాజీనామా నిర్ణయం ప్రకటించాను అని విజయసాయిరెడ్డి చెప్పుకున్నా.. పార్టీలో ఎవరూ నమ్మడం లేదు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో విజయసాయి తన రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేయడం పార్టీ నేతలు, కేడర్ ను షాక్ కు గురి చేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని విజయసాయి జగన్ ఆబ్సెన్స్ లో ఆయనతో చర్చించకుండా తీసుకోవడం నిజంగా అందరినీ షాక్ కు గురి చేసింది. అదును చూసి దెబ్బకొట్టాడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది. ఒక వేళ విజయసాయి తాను చెబుతున్నట్లుగా జగన్ తో తన రాజీనామా విషయం చర్చించి ఉంటే కచ్చితంగా ఆయన వద్దని వారించేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం తాను విదేశీ పర్యటన నుంచి వచ్చే వరకైనా రాజీనామా నిర్ణయం ప్రకటనను ఆపేవారని చెబుతున్నారు. అది జరగలేదంటే విజయసాయి తన నిర్ణయాన్ని జగన్ కు సూచన ప్రాయంగానైనా తెలియజేయలేదనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలా జగన్ కు కూడా చెప్పాపెట్టకుండా విజయసాయి రాజీనామా చేశారంటే..విజయసాయి ఏ స్థాయి ఒత్తిడిలో ఉన్నారో అవగతమౌతుంది. కేసులు, అరెస్టు నుంచి తనను తాను కాపాడుకోవడానికే విజయసాయి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/what-threatened-vijayasai-39-191837.html












