ఉద్యోగులకు డబ్బులివ్వలేక రిటైర్మెంట్ వయసు పెంపు?
Publish Date:Jan 7, 2022
Advertisement
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇది ఊహించలేందటూ సంబరాలు చేసుకున్నాయి. సీఎం జగన్ కు పోటీపడి మరీ కృతజ్ఞతలు చెప్పారు జేఏసీ నేతలు. అయితే రిటైర్మెంట్ ఏజ్ పెంపు వెనుక పెద్ద తతంగమే ఉందంటున్నారు. ఇందులో ఉద్యోగులకంటే ప్రభుత్వ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రతినెలా జీతాలు, పెన్షన్ల చెల్లింపునకు సర్కారు సతమతమవుతోంది. ఈ క్రమంలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలనూ అందించలేకపోతోంది. ఒక్కో ఉద్యోగికి రిటైర్మెంట్ ప్రయోజనాలు లక్షల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా వారు సర్వీసులో పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఈఎల్స్ రూపంలో దాచుకున్న సొమ్మే. ప్రభుత్వం వైపు నుంచి గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయసు పెంపుద్వారా... రెండేళ్లపాటు ఈ చెల్లింపులను వాయిదా వేసిందని ఉద్యోగులు చెబుతున్నారు. 2024లోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంది. వారందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందించలేని దిక్కుతోచని స్థితిలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ రెండేళ్లు ఉద్యోగులకు పైసా ఇవ్వకుండా నెట్టుకొచ్చేందుకు వేసిన ప్లాన్ అనే విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు వాడేసిందని, ఇప్పుడు వాటిని వెనక్కి తిరిగిచ్చే శక్తిలేక... మళ్లీ ఎన్నికల వరకు తప్పించుకునే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచిందని అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే... రిటైర్‌ర్మెంట్ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ దీనిని స్వాగతించారు. అయితే... ఇప్పుడు జగన్ సర్కారు ఎలాంటి సంకేతాలు పంపించకుండానే, ఎవరూ అడక్కుండానే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేసింది. తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు. డాక్టర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉందని చెబుతున్నారు. ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారని, వారిని మచ్చిక చేసుకుని, గుప్పిట్లో ఉంచుకుని వారి ద్వారా 13 లక్షల మంది ఉద్యోగులను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం వేసిన ట్రాప్‌లో ఆ నేతలు పడ్డారని ఉద్యోగులు విశ్లేషించారు. అందుకే రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్టు సీఎం చెప్పగానే ఆ నాయకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారని విమర్శించారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్ల సమస్యను గాలికొదిలేసి బయటకు వచ్చి మీడియా ముందు సంతృప్తి వ్యక్తం చేయడం చూస్తుంటే ఇన్నాళ్లు తాము నమ్మిన నాయకులు ప్రభుత్వంతో రాజీపడ్డారా? లేక అమ్ముడుబోయారా? అని సందేహాలు కలుగుతున్నాయన్నారు. కొత్త కొలువులు క్లోజ్ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని... ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జగన్ సర్కారు గతంలో హామీ ఇచ్చింది. ‘62 ఏళ్ల’తో దీనినీ అటకెక్కించినట్లేనని చెబుతున్నారు. కొలువులు ఖాళీ కావు కాబట్టి... కొత్తగా ఉద్యోగాలూ రావు. గ్రూప్స్ ఉద్యోగాలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు మళ్లీ ఎన్నికల వరకు చేపట్టబోయేది లేదంటూ చెప్పకనే చెప్పినట్లే. మరోవైపు... ఉద్యోగుల పదోన్నతులపైనా దీని ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏళ్లతరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశ తప్పదు.
http://www.teluguone.com/news/content/employees-unhappy-on-retirement-age-hike-39-129843.html





