2014 నాటికి జగన్ వెనక్కి: జేసీ జోస్యం
Publish Date:Jan 1, 2012
Advertisement
హైదరాబాద్: వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్కు దూరమైన వారంతా తిరిగి సొంత గూటికి రావాల్సిందేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికలలోపు పార్టీని వీడిన వారు అందరూ స్వగృహానికి వస్తారని ఆయన ఆశాభావం వ్య్తక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న జగన్ నిర్ణయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని సిఎం చెప్పడం శుభ పరిణామం అన్నారు. కాగా సంక్షేమ పథకాల ప్రచారంతోనే తాము ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళతామని ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఈ ఏడాది పూర్వ వైభవం పొందుతుందన్నారు.
ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య అవగాహన వాస్తవమైనా అందులో ఆశ్చర్యపడాల్సిన అంశమేమీ లేదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లాలో అన్నారు. పాలనలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావడం సహజమేనని వాటిని అధిగమిస్తామన్నారు. కొత్త సంవత్సరంలో తమ శాఖ మరింత సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏవీ ప్రజల బాగోగులు పట్టించుకోవని, కేవలం అధికారం కోసమే పాకులాడతాయన్నారు.
http://www.teluguone.com/news/content/elections-24-10471.html





