ఇంజనీర్లతో పోటీపడుతున్న కృష్ణదాస్
Publish Date:Mar 29, 2012
Advertisement
శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఈ ఎన్నికల్లో తాజా మాజీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు ఇంజనీర్లతో తలపడబోతున్నారు. ఒక ఇంజనీరింగ్ అభ్యర్ధి స్వయాన సోదరుడు ధర్మాన రామ్ దాస్ కావడం విశేషం. ధర్మాన రామ్ దాస్ కాంగ్రెస్ పార్టీ తరపున తన అన్నగారైన కృష్ణదాస్ తో పోటీపడుతున్నారు. మరోవైపు టిడిపి అభ్యర్ధిగా ఎంపికయిన శిమ్మ స్వామిబాబు (బాబ్జి) కూడా ఇంజనీరే కావడం విశేషం. ధర్మాన కృష్ణదాస్ కు ఉన్న అనుభవంతో పోలిస్తే ఈ ఇద్దరు యువ ఇంజనీర్ల అనుభవం చాలా తక్కువే. అయితే వీరిద్దరూ వ్యూహాల్లో దిట్ట అనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు ధర్మాన కృష్ణదాస్ తన ప్రత్యర్థి రామ్ దాస్ ను ఎక్కడా విమర్శించడం లేదు, కాని మరో సోదరుడు రాష్ట్ర మంత్రి అయిన ధర్మాన్ ప్రసాద్ ను మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఎన్నికల్లో ధర్మాన్ ప్రసాద్ కుట్రలు కుతంత్రాలతో తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన కార్యకర్తలను, సానుభూతిపరులను వేధిస్తున్నారని వారిపై అక్రమ కేసులు కూడా పెడుతున్నారని కృష్ణదాస్ అంటున్నారు. ధర్మాన్ సోదరుల మధ్య నెలకొన్న ఈ పోరులో లాభం పొందడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
http://www.teluguone.com/news/content/dharmana-krishna-das-24-13000.html





