పచ్చ నోట్ల ప్రయోగంతో... పిచ్చెక్కిన దేశాలివ్వే!
Publish Date:Nov 25, 2016
Advertisement
నవంబర్ 8 నుంచీ ఇవాళ్టికి... మూడు వారాలు గడిచిపోయాయి! అయినా కరెన్సీ కటకట అలానే వుంటోంది! కొందరు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు క్యూలలో నిలబడే వారి కష్టాల గురించి చెబుతోంటే... మరి కొందరు బయటకి రాబోయే నల్లదనం గురించి , బాగుపడబోయే దేశం గురించి చెబుతున్నారు! మొత్తానికి దేశం అంతా మోదీ అనుకూలం, వ్యతిరేకం అన్నట్టు విడిపోయింది! కాని, అసలు ఇలా పెద్ద ఎత్తున పెద్ద నోట్లు రద్దు చేసిన దేశాలు ఇంకా ఏవైనా వున్నాయా? అక్కడ ఏం జరిగింది? రండి... తెలుసుకుందాం...
ఇంతకు ముందు మన దేశంలోనే రెండు సార్లు భారీ ఎత్తున నోట్ల రద్దు జరిగింది. ఒక సారి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో అయితే మరో సారి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు. అయితే, ఈ మధ్య కాలంలో కూడా అనేక దేశాలు డీమానిటైజేషన్ ను ప్రయోగించాయి. లాభాలు, నష్టాలు పక్కన పెడితే నోట్లు రద్దైన ప్రతీ దేశంలోనూ ఒక అలజడి మాత్రం తప్పక చోటు చేసుకుంది. అలా ఒక కుదుపుకు లోనైన ఆఫ్రికన్ కంట్రీ ... నైజీరియా!
1984లో నైజీరియా కరెన్సీనంతా రద్దు చేసేసింది. అయితే, జనం ఈ మార్పుని పాజిటివ్ గా తీసుకోలేదు. అప్పటికే తీవ్రమైన అప్పులు, ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ఆ దేశం అంతంత మాత్రంగానే బండి నెట్టుకొస్తోంది...
ఆఫ్రికాలోనే మరో దేశమైన గనా కూడా నోట్ల రద్దు ట్రై చేసింది. అయితే, కేవలం 50 సిడీస్ విలువ గల పెద్ద నోటును మాత్రమే రద్దు చేసింది. 1982లో చేసిన ఈ పనితో ట్యాక్స్ ఎగొట్టేవారు తగ్గుతారని భావించారు. కాని, గనా ప్రజలు మరింతగా బ్లాక్ మార్కెట్ ను ఎంకరేజ్ చేసి కొంపలు ముంచారు. ప్రభుత్వ ప్రయత్నం వృథా అయిపోయింది...
మన దేశంలో వందల కోట్ల దొంగ డబ్బుకి కారణం పాకిస్తాన్. కాని, అదే పాకిస్తాన్ రానున్న డిసెంబర్లో తన పాత నోట్లను మార్చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రకటన... సంవత్సరమున్నర ముందే వెలువరించింది. అందుకే, నింపాదిగా బ్యాకులకి వెళ్లి తమ నోట్లు మార్చుకుంటున్నారు పాకిస్తానీలు! కాని, ఇలా చేస్తే నోట్లపై డిజైన్ మారటం తప్ప జనం వద్ద నుంచి బ్లాక్ మనీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు. తీసుకు రావాలన్న ఉద్దేశ్యం అక్కడి పాలకులకు వున్నట్టు కూడా లేదు!
కరెన్సీ నోట్ల విషయంలో అన్ని రకాల కలగాపులగాలకీ లోనైన దేశం జింబాబ్వే. రాబర్ట్ ముగాబే అనే నియంత పాలనలో దశాబ్దాలు మగ్గిన ఆ దేశం ఒక దశలో తీవ్రమైన ద్రవ్యోల్బణం ఎదుర్కొంది! ఎంతగా అంటే జింబాబ్వే డాలర్ కి అసలు విలువే లేకుండా పోయింది! ఒక ట్రిలియన్ జింబాబ్వే డాలర్ నోటు కూడా అచ్చేశారు! ఏం చేసినా జింబాబ్వే నోట్లకి విలువ రాకపోవటంతో ఆ దేశం కొత్త నోట్లు అచ్చేయటమే మానేసింది. ఇప్పుడు అమెరికన్ డాలర్లనే ఆ దేశంలో అధికారికంగా ఉపయోగిస్తున్నారు!
నియంత చేతుల్లో వున్న మరో దేశం ఉత్తర కొరియా. ఈ దేశంలో 2010లో నోట్లు రద్దు చేశారు. బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి కిమ్ జాంగ్ II అంతకు ముందు వున్న నోట్ల విలువలో రెండు సున్నాలు తగ్గించేశాడు. అంత విలువ తగ్గిపోయే సరికి ఆ నోట్లు దేనికీ పనికి రాక సామాన్యులు రోడ్డున పడాల్సి వచ్చింది. ఆకలితో అలమటించాల్సి వచ్చింది.
ఒకప్పటి సోవియట్ రష్యాలో కూడా నోట్ల రద్దు ప్రయత్నం జరిగింది. గోర్బచేవ్ తన హయాంలో బ్లాక్ మార్కెట్ ను తుడిచి పెట్టేయటానికి నోట్లు రద్దు చేశాడు. కాని, కరెన్సీ రద్దవ్వటం వల్ల జనంలో పుట్టిన కోపం మొత్తానికే కొంప ముంచింది! మెల్ల మెల్లగా వేడి రాజుకుని సోవియట్ ముక్కలైపోయింది!
ఆస్ట్రేలియా నోట్ల రద్దు కాకుండా నోట్ల మార్పిడి చేసింది. అంటే అప్పటిదాకా పేపర్ నోట్స్ వుంటే ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టింది. పాలిమర్ అనే పదార్థంతో తయారు చేసిన కొత్త నోట్లు పాత వాటికి బదులు చెలామణిలోకి వచ్చాయి. దీని వల్ల ఆ దేశ ఆర్దిక వ్యవస్థకి ఎలాంటి మంచి, చెడూ రెండూ జరగలేదు...
1987లో మయన్మార్ దేశం కూడా నోట్ల విలువ తగ్గించటం ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టే ప్రయత్నం చేసింది. అక్కడి మిలటరీ పాలకులు అమాంతం 80శాతం విలువ తగ్గించేశారు. జనం ఆగ్రహంతో రోడ్ల మీదకు వచ్చారు. దారుణంగా వార్ని అణిచి వేయటంతో భీకర హింస చోటు చేసుకుంది!
http://www.teluguone.com/news/content/demonitization-45-69507.html





