నోట్ల రద్దు సీక్రెట్ ఢిల్లీలో లీకైతే... బళ్లారిలో బాజా మోగిందా?
Publish Date:Nov 26, 2016
Advertisement
పెద్ద నోట్లు రద్దు చేశారు సరే... మరి వాటి స్థానంలో కొత్త నోట్లు ఎలా వస్తాయి? వెనక్కి వెళ్లేవి 500, 1000నోట్లైతే కొత్తగా అచ్చేసినవి 2వేలు! ఇదేం లాజిక్? సరే... 2వేల నోటుతో మరింత బ్లాక్ మనీ పోగేసే ఛాన్స్ వుందన్న వాదనలు పక్కన పెడదాం... అసలు కొత్తగా వచ్చిన పింక్ నోటుకి చిల్లర ఇచ్చేదేవరు? దేశంలో ఎన్ని వంద నోట్లు వున్నాయి? అవ్వి ఎంత మందికి సరిపోతాయి? ఇలాంటి ప్రశ్నలకి కూడా సమాధానం లేదు! దేశ ఆర్దిక వ్యవస్థని మొత్తాన్నీ రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల వరకూ ప్రభావితం చేసే ఒక భారీ నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు... కనీసం కొత్త నోట్లు ఏటీఎం మిషన్లలో సరిపోతాయా లేదా అని కూడా ఆలోచించకోలేదా? 2వేల సైజు సరిగ్గా లేదు, 500ల ప్రింటింగ్ అంతకన్నా అద్వాన్నంగా వుంది... ఇంత గందరగోళ స్థితికి కారణం ఎవరు? మోదీయేనా? ఆయనే అయితే... ఆయన తొందరపాటు నిర్ణయానికి కారణం ఎవరు? డీమానిటైజేషన్ ... వున్న నాలికకు మందేస్తే కొండనాలికకు ఏమో అయిందన్నట్టు కావటానికి.... అసలు కారణం ఎవరు?
కొన్ని వార్తలు గాసిప్పో, లేక నిజాలో అర్థం కాకుండా వుంటాయి. అలాంటిదే ఈ న్యూస్ కూడా! మోదీ మంత్రి వర్గంలో అత్యంత సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకున్న ఒక సీనియర్ మంత్రిగారు నోట్ల రద్దు నిర్ణయం జరగక ముందే సంగతంతా లీక్ చేసేశారంటున్నారు కొందరు పొలిటికల్ జీవులు. ఆమెకు దేశ గతినే మార్చేసే టాప్ సీక్రెట్ ఎలా తెలిసిందో ఎవ్వరికీ తెలియదు కాని .... సదరు మేడమ్ వారు మాత్రం దక్షిణాదిలోని తన దత్త పుత్రుడికి విషయం చేరవేసేశారట! వెంటనే ఆ బళ్లారి బాబుగారూ తన పాత 500, 1000నోట్లు కూతురి పెళ్లి పేరు చెప్పి మార్కెట్లోకి ఫ్లష్ చేసేశాడట! డిజిటల్ ఆహ్వానాలు పలికి మోదీ డిజిటల్ ఇండియా కలనైతే బాగానే సాకారం చేశాడు కాని... ఆయన నల్లధనం పై చేస్తున్న పోరుకు మాత్రం మన ఇనుప రాజావారు చాలానే చిలుము పట్టించారు! ఆయన వందల కోట్ల ఘనమైన పెళ్లిని అడ్డు పెట్టుకుని విపక్షాలు పార్లమెంట్లో కూడా నానా రచ్చ చేసేశాయి. ఇంతకీ దీనికంతటికీ కారణం ఎవరు? ప్రచారం అవుతోన్న గాసిప్సే నిజమైతే... చిన్మమ్మగారే మూల కారణం!
తన క్యాబినేట్లోని మంత్రికే సీక్రెట్ తెలిసిపోతే, ఆమె దాన్ని తన వారికి చేరవేస్తుంటే.... అది ప్రధాని అయిన మోదీకి తెలియదా? ఈ డౌట్ ఎవరికైనా రావటం సహజమే! కనీసం ఆర్దిక మంత్రికి కూడా చెప్పలేదని అంటోన్న నోట్ల రద్దు నిర్ణయం మరేదో శాఖ నిర్వహిస్తోన్న ఆమెకు తెలిసిందని నమోకి కూడా తెలిసింది. కాని, కాస్త లేట్ గా! అదే ఇప్పుడు జరుగుతోన్న గందరగోళానికి కారణమంటున్నారు! ఆమె తన దత్తపుత్రుడికి లీకిచ్చేసిందని గ్రహించిన నరేంద్ర మోదీ అమాంతం అలెర్ట్ అయ్యారట. దేశంలోని భారీ నల్ల మారాజులందరూ ఒక్కొక్కరుగా జాగ్రత్తపడిపోయి వేల కోట్లు వైట్ చేసుకోక ముందే నోట్లు రద్దు ప్రకటన చేయాలని ... నవంబర్ 8న మోదీ బాంబు పేల్చేశారు. దీని వల్లే ఆర్బీఐ టీమ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేసుకునే ఛాన్స్ దక్కలేదంటున్నారు కొందరు. అదే ఇప్పుడు చిల్లర కష్టాలకు, పేదలు చితికిపోయేటంతటి నష్టాలకు కారణమైందంటున్నారు.
సాధారణంగా ఆర్బీఐలో అత్యంత తెలివైన , సీనియర్ బ్యూరోక్రాట్స్ వుంటారు. వారు కనీసం కొత్త నోట్లు ఏటీఎంలలో సరిగ్గా దూరతాయా? బయటకు వస్తాయా? అని కూడా ఆలోచించుకోకుండా నోట్ల రద్దుకు సై అంటారా? ఛాన్సే లేదు. అలాగే, వంద నోట్లు మరీ తక్కువగా వున్నాయన్న సంగతి ఆర్బీఐ గవర్నర్ తో సహా అందరికీ తెలియదా? పెద్ద నోట్లు రద్దైతే జనం డబ్బులకి కటకటలాడిపోతారని వారు మోదీకి చెప్పలేదంటారా? చెప్పే వుంటారు! ఎందుకంటే, జనానికి కేవలం రెండు రోజుల్లో కొత్త నోట్లు అందించేయవచ్చు అని అబద్ధం చెప్పటం వల్ల ఆర్బీఐ ఆపీసర్స్ కి వచ్చే లాభం ఏమీ వుండదు. పైగా అది చాలా పెద్ద రిస్క్ ! కాబట్టి వాళ్లు మోదీని తప్పుదారి పట్టించి వుండకపోవచ్చు. ఇక మిగిలిందల్లా క్యాబినేట్ లోని మేడమ్ గారి నిర్వాకమే! ఆమె ఇచ్చిన లీక్ మోదీని షేక్ చేసి వుంటుంది. ఆ షేక్ లో ఆయన వీక్ డిసీషన్ చేసి వుంటారు. అదే ఇప్పుడు సామాన్యుడ్ని బ్యాంకులు, ఏటీఎంల ముందు రోడ్డున పడేసింది! రాబోయే కొన్ని నెలల పాటూ భారతదేశం టైపాయిడ్ వచ్చి తగ్గిన పేషంట్ లా డీలాగా ముందుకు సాగాల్సిందే...
http://www.teluguone.com/news/content/demonetization-45-69534.html





