బాబుగారూ ... ప్రతీ 'చిల్లర' కష్టానికీ టెక్నాలజీయేనా!
Publish Date:Nov 24, 2016
Advertisement
ఉచితంగా మొబైల్ ఫోన్! ఇదేదో ముఖేష్ అంబానీ జియో నెట్ వర్క్ వాళ్లు ఇస్తున్న బంపర్ ఆఫర్ కాదు! ఏపీ సీఎం చంద్రబాబు మెదడులో మెరిసిన ఐడియా! ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జనానికి ఫ్రీ మొబైల్స్ ఎందుకు ఇస్తానంటారు? అర్థం కావటం లేదా? అయితే, మనం మరోసారి మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావించుకోవాలి!
అమాంతం 500, 1000 నోట్లు నిషేధించే సరికి పరిస్థితి ఎలా వుందో అందరికీ తెలిసిందేగా! జనం నానా తంటాలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే, చంద్రబాబు ఆంధ్ర ప్రజల చిల్లర ఇబ్బందులకి ఒకింత వింత పరిష్కారం సూచించారు. అదీ ఏకంగా ఆర్బీఐ అధికారులకే తన మనసులో మాట చెప్పారు. అదేంటంటే... రాష్ట్రంలోని ఆర్దికంగా వెనుకబడిన ప్రజలకి ఉచితంగా మొబైల్ ఫోన్స్ అందించటం! దీని వల్ల వంద నోట్ల కోసం జనం పడుతున్న వందల కష్టాలు ఎలా తీరుతాయంటారా? మొబైల్ బ్యాంకింగ్ ద్వారానట!
చంద్రబాబు టెక్నాలజీ క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన టెక్ బాబు అని గతంలోనే సీఎంగా వుండగా నిరూపించుకున్నారు. కాని, రాను రాను ఈ టెక్నాలజీ మోజు లాభం కంటే నష్టం ఎక్కువ చేసేలా కనిపిస్తోంది. ఉదాహరణకి ఆయన తీసుకున్న తాజా ఉచిత మొబైల్ ఫోన్ల నిర్ణయమే తీసుకోండి... దీని వల్ల ఆర్దికంగా వెనుకబడిన వారికి నిజంగా లాభమా? ఆర్దికంగా వెనుకబడి ఇప్పటికీ మొబైల్ ఫోన్ లేని వారంటే ... సహజంగానే వాళ్లు నిరక్షరాస్యులని అర్థం కదా! మరి వారికి మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోను చేతిలో పెట్టి పేటీఎం లాంటివి వాడుకోమంటే ఎలా వాడతారు? తమ బేసిక్ ఫోన్లో కాంటాక్ట్స్ లోని తెలిసిన వారి పేర్లే వాళ్లకు చదువుకోవటం రాదు. అలాంటి వారు జేబులో చిల్లర లేక కష్టాలు పడుతున్నారు. పైగా వారికి ఇప్పుడు మొబైల్ ఉచితంగా ఇచ్చి కరెన్సీ కష్టాల నుంచి ఉద్ధరిస్తామంటే ఎలా? వాళ్లకు కావాల్సిన వంద నోటో, పది నోటో త్వరగా వారి చేతిలో పడేలా చూస్తే సరిపోతుంది కదా!
ఉచితంగా మొబైల్ ఫోన్ల పంపిణీ ఎంత వరకూ కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పలేం కాని... దీని వల్ల అత్యంత దిగువ స్థాయి నిరక్షరాస్యులకు జరిగే మేలు సున్నా! కాని, మధ్యలో ఎంటరయ్యే సదరు మొబైల్ ఫోన్ల సప్లయర్ కి మాత్రం కాసుల పంట పండుతుంది! ఇలాంటివన్నీ చంద్రబాబు ఆలోచించుకుని జనానికి నిజంగా మేలు చేసే నిర్ణయం తీసుకుంటే బావుంటుంది!
http://www.teluguone.com/news/content/chandrababu-45-69472.html





