పేరెంట్స్ ఇంట్లో పిల్లలుండాలంటే... 'పర్మిషన్' వుండాల్సిందేనట!
Publish Date:Nov 30, 2016
Advertisement
రెంట్ కట్టకున్నా తమ ఇంట్లో వుండనిచ్చే ఉదార హృదయులు ఎవరు? పే'రెంట్స్'! ఇదేదో రైమింగ్ కోసమో, శ్లేష కోసమో చెబుతోన్న మాట కాదు! నిజంగానే పేరెంట్స్ రెంట్ తీసుకోరు కదా పిల్లల దగ్గర! అయినా అసలు ఇదేం చర్చ అని ముక్కున వేలేసుకుంటున్నారా? అయితే ఆగండి... ఈ విచిత్రమైన కేస్ సంగతి తెలుసుకుంటే మీకు అంతా అర్థమవుతుంది...
దేశ రాజధాని ఢిల్లీలో ఒక వృద్ధ దంపతుల జంట కోర్టు నాశ్రయించింది. వాళ్లు తమని హింసిస్తున్నారంటూ స్వంత పిల్లలపైనే కేసు వేశారు. అందుకే, తమ కొడుకులిద్దర్నీ తాము కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్ల లోంచి ఖాళీ చేయించాలని మొరపెట్టుకున్నారు. ఇది వినటానికే బాధగా వున్నా... నిజం! ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అటువంటి కాలంలో ఈ తల్లిదండ్రుల పిల్లలు మరింత ముదుర్లు. తాము కన్నవాళ్లని చూసుకోవటం కాకుండా... వారు కట్టుకున్న ఇళ్లలో తిష్టవేసి వార్నీ హింసించసాగారట! గత్యంతరం లేక కోర్టునాశ్రయించిన వృద్ధులు కొడుకుల్ని, కొడళ్లని బయటకు పంపాలని వేడుకున్నారట!
వరుసగా కింది కోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా తల్లిదండ్రులకి అనుకూలంగా తీర్పునిచ్చాయి! వాళ్లు తమ కష్టంతో కట్టుకున్న ఇళ్లలో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వుండరాదని తేల్చి చెప్పాయి. తల్లిదండ్రులు దయతలచి వుండనిస్తేనే మెజారిటీ నిండిన సంతానం వాళ్లతో పాటూ వుండాలి. అంతే కాని, పేరెంట్స్ ఇంట్లో రెంట్ పే చేయనక్కర్లేదన్నట్టు... ఫ్రీగా తిష్టవేసే హక్కు లేదని తేల్చి చెప్పింది హై కోర్టు! నిజానికి భారతదేశంలో ఇప్పటికీ పేరెంట్స్ పిల్లల్ని బయటకి వెళ్లగొట్టే దారుణమైన స్థితి రాలేదు. కాని, చాలా సార్లు పిల్లలు తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి పంపించేసి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. అలాంటి అమానుషత్వం నిండిన సంతానం పెరిగిపోతున్న సమయంలో ఈ తీర్పు నిజంగా అభినందనీయమే! వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమ వారి నుంచి ప్రేమా, ఆప్యాయత పొందక పోయినా... కనీసం స్వంత ఇంట్లో ప్రశాంతంగానైనా కాలం వెళ్లదీస్తారు! అయితే, అసలు... తండ్రి మాట కోసం అడవులకు పోయిన రాముడు తిరిగిన మన భూమిలో... తల్లిదండ్రులు, పిల్లలకి మధ్య కోర్టులు రావటమే పెద్ద విషాదం!
http://www.teluguone.com/news/content/delhi-high-court-45-69660.html





