బీజేపి... ఎస్పీల్ని 'వర్గీకరించి' పాలించాలనుకుంటోందా?
Publish Date:Nov 28, 2016
Advertisement
దేశ వ్యాప్తంగా బలంగా తయారవుతోన్న బీజేపి తెలుగు రాష్ట్రాల్లో స్వంత బలం పుంజుకోవాలనుకుంటోందా? అందు కోసం కులం కార్డు చూపించబోతోందా? ఆంధ్రాలో టీడీపీతో వుంటూనే దాని ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకునే ఆలోచనలో వుందా? జగన్ కు కూడా చెక్ పెట్టే వ్యూహాలు కమలనాథులు పన్నుతున్నారా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు తాజాగా జరిగిన ఒక్క పరిణామంతో వస్తున్నాయి! అదే... మంద కృష్ణ మాదిగ నిర్వహించిన ధర్మ యుద్ధం!
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు, ఇతర ఉప కులాలు చేస్తోన్న పోరాటం కొత్తది కాదు. రెండు దశాబ్దాలుగా నడుస్తూనే వుంది. అయితే, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అవసరం అయిన ఈ అంశం ఎప్పటికప్పుడు ఎన్నికల ఎజెండాలో భాగమైపోతోంది. అయినా రాష్ట్ర స్థాయిలో దాదాపూ అన్ని పార్టీలు దీన్ని వాడేసుకున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అటకెక్కించేస్తున్నాయి. అసెంబ్లీ స్థాయిలో కూడా ఎలాంటి ముందుడగూ వేయలేకపోతున్నాయి. ఇందుకు మూల కారణం మాలల్లో ఎదురయ్యే వ్యతిరేకత భయమే. వాళ్ల ఓట్లు కూడా పోకుండా చూసుకునే ప్రయత్నంలోనే వర్గీకరణ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగా మిగిలిపోతోంది....
ఎస్సీ వర్గీకరణను ఇప్పటి దాకా టచ్ చేయని బీజేపి కూడా ఈసారి రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారంలో వున్నారు కాబట్టి బీజేపి నేతలు మంద కృష్ణ మాదిగకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఎమ్మార్పీఎస్ నిర్వహించిన బహిరంగ సభకి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా రావటం. అంతే కాదు, మంద కృష్ణ వెంకయ్యే మా ఆశ అని గట్టి భరోసా కూడా వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టే వెంకయ్య నాయుడు కూడా వర్గీకరణ తప్పక జరుగుతుందన్నట్టు ఫీలింగ్ కలిగించారు. ఇదంతా తెరపైన కనిపిస్తున్న వ్యవహారం. కాని, తెర వెనుక బీజేపి పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు విశ్లేషకులు...
2019 కల్లా ఇటు తెలంగాణ , అటు ఆంధ్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలని అమిత్ షా ఆలోచన. తెలంగాణలో అయితే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. బలమైన ప్రతిపక్షం అంటూ ఒక్క పార్టీ కూడా లేదిక్కడ. వున్న కాంగ్రెస్ ధీటుగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం లేదు. అందుకే, బీజేపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారే ఆలోచనలో వుంది. టీడీపీ వదిలిన ఖాళీని పూడ్చాలనుకుంటోంది. అందుకు మాదిగల్ని ఆకర్షించటమే చక్కగా వర్కవుట్ అవుతుందని కూడా భావిస్తోంది. తెలంగాణ ఎస్పీల్లో అత్యధికులు మాదిగలు కాబట్టి వారిని వర్గీకరణ బిల్లుతో తన ఓటర్లుగా మార్చుకుంటే బాగా బలపడవచ్చు కూడా....
ఆంధ్రాలోనూ ఎస్సీల్లో మాదిగల ఓట్లు కీలకం. అత్యధిక జనాభ వున్నది మాలలే అయినా అక్కడా అనేక మంది వర్గీకరణను కోరుకుంటున్నారు. వాళ్లందర్నీ బీజేపి తనవైపు తిప్పుకుంటే చాలా లాభం చేకూరినట్టే. పైగా ఆంధ్రాలో ఎస్పీ జనాభా పెద్ద ఎత్తున్న క్రైస్తవం ఫాలో అవుతుంటారు. వీళ్లు మామూలుగా అయితే బీజేపిని నమ్మే చాన్సెస్ అస్సలు వుండవు. కాని, ఈ వర్గీకరణ హామీ ద్వారా కమలం వాళ్లని తన ఖాతాలో వేసుకోవచ్చు. అదే జరిగితే జగన్ కు క్రిస్టియన్ ఓటర్లు భారీగా తగ్గే ప్రమాదం వుంది. అలాగే, ప్రస్తుతానికి బీజేపి మిత్రపక్షం అయిన టీడీపికి కూడా ఎంతో కొంత ఎస్సీ ఓట్ల నష్టం తప్పక పోవచ్చు. అంటే, మొత్తం మీద ఆంద్రాలోనూ ఎస్పీల ఓట్లతో బీజేపి బలమైన శక్తిగా మారుతుందన్నమాట...
వర్గీకరణ కేంద్రం పరిధిలోనిది కావటం, వర్గీకరణకు అనుకూలంగా ఏ మాత్రం చర్యలు తీసుకున్నా మాదిగలు ఓటు బ్యాంకుగా మారే అవకాశం వుండటం, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ల లాగా మాలల ఓట్లు పోతాయేమో అనే భయం లేకపోవటం బీజేపికి ఈ విషయంలో కలిసి వచ్చే అంశాలు. అందుకే, నోట్ల కటకటతో బహిరంగ సభలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా ఎమ్మార్పీఎస్ మీటింగ్ పెట్టడం, వెంకయ్య పాల్గొని హామి ఇవ్వటం జరిగాయంటున్నారు క్రిటిక్స్. ఇందులో నిజం ఎంత వుందోగాని... వర్కవుట్ అయితే బీజేపికి లాభం మాత్రం వుంటుంది...
http://www.teluguone.com/news/content/-manda-krishna-45-69613.html





