ఇకనయినా జగన్ ఆత్మవిమర్శ చేసుకొంటారా?
Publish Date:Jun 12, 2014
Advertisement
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమికి కారణాలు కనుగొనేందుకు, విశాఖపట్నంలో నిన్న ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే, అదే జిల్లాకు చెందిన వైకాపా నేత దాడి వీరభద్రరావు, పార్టీ ఓటమికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారకుడని, ఆయన నిరంకుశ ధోరణి వలననే పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని ఆరోపించడం విశేషం. జగన్ పార్టీలో ఎవరినీ ఖాతరు చేయడని, తనకు తోచినట్లే చేస్తాడు తప్ప పార్టీలో ఎవరి సలహాలు స్వీకరించేందుకు కూడా ఇష్టపడడని, ఆయనొక డిక్టేటర్ అని ఆరోపించారు. షర్మిలకు టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆమె పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారుతుందనే భయంతోనే ఆమెకు బదులు తల్లిని వైజాగ్ నుండి నిలబెట్టారని ఆరోపించారు. జగన్ తన తండ్రి చేప్పట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాక, కేవలం తనను చూసే ప్రజలు ఓటేయాలని కోడరడం అతని అహంకారానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. సాధారణంగా పార్టీని వీడేవారు ఇటువంటి ఆరోపణలు చేయడం మామూలే. కానీ, వైకాపాను వీడుతున్నవారిలో చాలా మంది జగన్ తమకు పార్టీ టికెట్ ఇవ్వలేదనో లేకపోతే పార్టీ పదవులు దక్కలేదనో వీడినవారు చాలా తక్కువ. పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది జగన్మోహన్ రెడ్డిపై ఇటువంటి ఆరోపణలే చేయడం గమనిస్తే, నిన్న దాడి వీరభద్ర రావు చేసిన ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది. దాడి పచ్చి అవకాశవాదే కావచ్చును. కానీ ఆయన మంచి విద్యావేత్త కూడా. ఆయన గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గర నుండి చూసిన కారణంగా ఆయన ఆరోపణలలో 50 శాతం అయినా వాస్తవం ఉండకపోదు. అయితే లోపం తనలో ఉంచుకొని జగన్ పార్టీ ఓటమికి సమీక్షా సమావేశాలు నిర్వహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా మనుషులకు పుట్టుకతో వచ్చిన అవలక్షణాలను వదిలించుకోవడం అంత తేలిక కాదు. వాటిని గుర్తించి, వదిలించుకోవడానికి నిరంతరంగా గట్టి ప్రయత్నం చేసినప్పుడే వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ పార్టీ ఓటమికి కారణాలు కళ్ళెదుట సపష్టంగా కనబడుతున్నప్పటికీ, కారణాలు కనుగొనేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహించడం చూస్తే, ఆయన మారలేదని, మారబోరని దాడి వీరభద్రరావు అన్నమాటలను నమ్మవలసి వస్తుంది. గత ఐదేళ్ళుగా అధికారం కోసం అలమటించిపోయిన జగన్మోహన్ రెడ్డి, మరో ఐదేళ్ళ వరకు ప్రతిపక్ష బెంచీలకే పరిమితమవవలసి వచ్చినపుడు, ఆయన తీవ్ర అసహనానికి గురవడం ఖాయం. అది పార్టీ నేతలపైనే ప్రదర్శించడం కూడా ఖాయం. పార్టీ నేతలు అది భరించలేనప్పుడు దాడి వీరభద్రరావులాగే బయటపడే ప్రయత్నం చేయడం కూడా తధ్యం. అటువంటప్పుడు ఆయన చెప్పినట్లు వైకాపా ఎంతకాలం మనుగడ సాగించగలదో అనుమానమే. అందువల్ల దాడి వీరభద్ర రావు తనపై చేసిన ఆరోపణలను వైకాపా నేతలందరూ ముక్తకంటంతో ఖండించినప్పటికీ, వాటిని జగన్ సానుకూల దృక్పధంతో స్వీకరించి, ఆయన ఎత్తి చూపిన లోపాలను సవరించుకొనే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి, వైకాపాకు కూడా చాల మేలు కలుగుతుంది.
http://www.teluguone.com/news/content/dadi-veerabhadra-rao-37-34735.html





