రంగంలోకి దిగిన నరసింహన్
Publish Date:Jul 4, 2015
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని సరిదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తాజాగా జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూలులో వున్న సంస్థల మీద తెలంగాణ ప్రభుత్వం గుత్తాధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోందన్న విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. మిగతా సంస్థల విషయం అలా వుంచితే, తెలుగు విశ్వవిద్యాలయం, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరీ అడ్వాన్స్ అయిపోయింది. ఈ రెండు యూనివర్సిటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించడం మాత్రమే కాకుండా, ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ఇవ్వలేదు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను కూడా ఏపీ విద్యార్థులవి ప్రకటించలేదు. దాంతో వేలాదిమంది ఏపీ విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా తెలంగాణ ప్రభుత్వం మెట్టు దిగలేదు. తమకు డబ్బులు చెల్లించి ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు పొందాలని తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గవర్నర్‌కి ఫిర్యాదు చేసింది. మిగతా విషయాల్లో ఎలా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో విశ్వవిద్యాలయాల విషయంలో గవర్నర్ వెంటనే స్పందించారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ప్రవేశాలు గతంలో మాదిరిగానే నిర్వహించాలని తెలంగాణ సీఎస్‌కి లేఖ రాశారు. ఇది అందరూ హర్షించదగ్గ పరిణామం. దీనినిబట్టి ఇక రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి గవర్నర్ రంగంలోకి దిగినట్టుగా భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ap-governor-narasimhan-45-48044.html





