రూ.547 కోట్ల సైబర్ మోసాలు... చేధించిన ఖమ్మం పోలీసులు
Publish Date:Jan 12, 2026
Advertisement
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల మాయలో పడి రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతేడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.372 కోట్లు కాజేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. అయినా కూడా కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేయగా కేవలం ఆరుగురి ఖాతాల్లోనే రూ.547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సైబర్ క్రైమ్ ద్వారా వీళ్లంతా రూ. 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు తేల్చారు. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌కళ్యాణ్, ఉడతనేని వికాస్ ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడిచిందని గుర్తించారు.కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అలాగే.. మాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్.. ఇలా పలు రకాలుగా బాధితుల నుంచి ఈ డబ్బును కొల్లగొట్టినట్టు స్పష్టం అవుతోంది. గతేడాది డిసెంబర్ లో విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి .. తాను సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. దాంతో వీరి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీళ్లంతా అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇక ఇటీవల హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా వేసిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో కేవలం పది రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు.
http://www.teluguone.com/news/content/cyber-fraud-worth-rs-547-crore-36-212420.html





