సామ్రాజ్యవాద విస్తరణ.. అమెరికా పెడధోరణులపై ప్రపంచ దేశాల ఆగ్రహం
Publish Date:Jan 12, 2026
Advertisement
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విపరీత పోకడలు పోతున్నారు. తాను ఒక్క అమెరికాకే కాదనీ, ప్రపంచదేశాలకూ అధినేతనేనన్న అహంకారంతో విర్రవీగుతున్నట్లు కనిపిస్తున్నది. సామ్రాజ్యవాద, ఆక్రమణ ధోరణులను ఇష్టారీతిగా ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడాయన చూపు గ్రీన్ ల్యాండ్ పై పడింది. ఇప్పటికే వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనని తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్ ఇక గ్రీన్ ల్యాండ్ కు కూడా తానే అధిపతిని అని ప్రకటించడానికి రెడీ అయిపోతున్నారు. ఇది మన్రో సిద్ధాంతానికి అనుగుణంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం రెండు అమెరికా ఖండాల పై ఏ దేశం కూడా తమ వలసలను విస్తరించడానికి అనుమతించబోదు. ఈ సిద్ధాంతాన్ని 1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో ప్రకటించి అమలు చేశారు. కాలం చెల్లిన ఆ సిద్ధాంతాన్నే ఇప్పుడు ట్రంప్ మన్రో సిద్దాంతం కాదు.. టన్రో సిద్దాంతం అంటూ ఆక్రమణ కు తెరతీశారు. గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించి తీరుతామని ట్రంప్ చేసిన ప్రకటనపై డెన్మార్క్,గ్రీన్ ల్యాండ్ లు రగిలిపోతున్నాయి. డెన్మార్క్ ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ఇప్పుడు డెన్మార్ పాక్షిక ఏలుబడిలో ఉంది. ఇలా ఉండగా అమెరికా తాటాకు చప్పుళ్లకు బెదరమని, పోరాటానికి సిద్ధమని గ్రీన్ లాండ్ తెగేసి చెప్పింది. తాముగ్రీన్ లాండర్లు..డానిష్ పౌరులుగా నే కొనసాగుతామని కుండబద్దలు కొట్టేసింది. అది పక్కన పెడితే నాటో కూటమి లో భాగమైన డెన్మార్క్ అమెరికా దాడిచేస్తే నాటో నాశనం ఖాయమని తేల్చిచెప్పింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన రక్షణ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని హెచ్చరించింది. 500 ఏళ్లుగా డెన్మార్క్ గ్రీన్ లాండ్ లు కలిసి ఉంటున్నాయి. అయితే అంత మాత్రాన గ్రీన్ లాండ్ డెన్మార్క్ భూ భాగం ఎలా అవుతుందని ట్రంప్ అంటున్నారు. అమెరికా రక్షణ కోసం తమకు గ్రీన్ ల్యాండ్ అవసరమని ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ ఏం చెప్పినా ఆయా దేశాలలోని సహజ వనరులపై గుత్తాధిపత్యం కోసమే అమెరికా తన సామ్రాజ్య విస్తరణకు మన్రో, టన్రో అంటూ కొత్త కొత్త పేర్లు, ఎత్తుగడలతో సాగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత సోవియట్ పతనంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యం గా ఆవిర్భవించింది. ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు పుతిన్ వ్యూహాత్మక అడుగుల కారణంగా రష్యా కూడా శక్తిమంతమైన దేశంగా ఏర్పడింది. అలాగే బలీయమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఇప్పుడు రష్యా, చైనాలు కలిస్తే.. తన ఆధిపత్యానికి గండి పడటం ఖాయమన్న భయంతోనే అమెరికా అడ్డగోలుగా దేశాలలో అశాంతిని రగిల్చి ఆక్రమణల బాట పట్టిందంటున్నారు. అత్యధిక వనరులున్న ప్రాంతాలను, దేశాలను కైవసం చేసుకుని తిరుగులేని శక్తి అమెరికా అని చాటాలని చూస్తోంది. అయితే అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ధోరణులను ప్రపంచదేశాలు గర్హిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే అమెరికాకు పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/america-imperial-expanssion-trump-36-212436.html





