రామ రామ.. ఇదేం పని!?
Publish Date:Jun 8, 2023
Advertisement
వివాదాలు సృష్టించి సినిమా సక్సెస్ కు బాటలు వేసుకోవడమన్నది కొత్త విషయమేమీ కాదు. ఈ విషయంలో ఆర్జీవీగా పిలవబడే రామగోపాల్ వర్మ అందరి కంటే రెండాకులు ఎక్కువే చదివాడని అంతా అనుకుంటారు. కానీ ఆదిపురుష్ బృందం తిరుమలలో చేసిన హంగామా చూస్తుంటే.. వారి నుంచి రామ్ గోపాల్ వర్మ ఇంకా నేర్చుకోవాలేమో అనిపించకమానదు. మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ, సినిమా ఫంక్షన్లలోనూ సినిమావాళ్లు హగ్గులు, కిస్సులూ మామూలే అన్నట్లుగా అయిపోయాయి. వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సీరియస్ గా తీసుకోరు. కానీ ఎంత సినిమావాళ్లైనా వాళ్లు ఉన్నది ఎక్కడ, చేస్తున్నది ఏమిటి అన్న విచక్షణ ఉండాలి. ఉద్దేశ పూర్వకంగా వివాదం చేయడానికి జరిగిందో కాదో చెప్పలేము కానీ తిరుమలలో ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్, ఆ సినిమాలో సీత పాత్రధారిణి కృతి సనన్ ల ఆలింగనాలు, చుంబనాల వ్యవహారం అందరి విమర్శలనూ ఎదుర్కొంటోంది. తీసిందేమో రాముడి సినిమా.. ఉన్నదేమో కలియుగ వైకుంఠం అయిన తిరుమలో. అటువంటి చోట పవిత్రతకు, ఆధ్యాత్మికతకు తిలోదకాలిచ్చి ఆలింగనాలు, చుంబనాలతో రెచ్చిపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. సినిమా ప్రచారానికి ఇంకా చాలా మార్గాలున్నా ఇలాంటి జుగుప్సాకర, అభ్యంతరకర మార్గాన్ని ఎంచుకోవడాన్ని సర్వులూ తప్పుపడుతున్నారు. వారు వ్యవహరించిన తీరు హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయంటున్నారు. హిందూ సంఘాలు క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి దర్శకుడినా ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలు కురిపించారంటూ ఆయనపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో రాముడి ఔన్నత్యాన్ని ఎలా చూపారు? సినిమా ఎలా ఉంది అన్నది ఆ సినిమా విడుదలైతే తప్ప తెలిసే అవకాశం లేదు. కానీ అంతకంటే ముందే తిరుమల కొండపై తమ విన్యాసాల ద్వారా వారికి తమ సినిమా వ్యాపారం తప్ప శ్రీరామ చంద్రుడిపై కానీ, తిరుమలేశునిపై కానీ గౌరవం, భక్తి లేవని విస్పష్టంగా చెప్పేశారని జనం దుయ్యబడుతున్నారు. రాముడి సినిమా తీసేస్తే గొప్పవారు అయిపోరనీ, కనీస సంస్కారం ఉండాలని అంటున్నారు. భక్తి సినిమాలో చూపించేసి మీ భుజాలు మీరు చరిచేసుకుని కాలరెగరేస్తే ఊరుకోమని హిందుత్వ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇక నెటిజన్లు కూడా ఆదిపురుష్ డైరెక్టర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/criticism-from-every-were-on-adipurush-team-39-156531.html