కాంగ్రెస్, టిడిపిలకు ద్వితీయ, తృతీయ స్థానాలేనా?
Publish Date:Mar 20, 2012
Advertisement
రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలు ఒక్కదాంట్లో కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. ఈ ఉప ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీలు ద్వితీయ లేదా తృతీయ స్థానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుంది. కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ తో పాటు పార్లమెంట్ సభ్యులు రాజగోపాల్ రాజమండ్రికి చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ సహాయంతో నిర్వహించిన సర్వేలో కూడా ఈ రెండు పార్టీలకు ఓటమి ఖాయమని తేలింది. నెల్లూరుజిల్లా కోవూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 20 వేల ఓట్లకుపైగా మెజారిటితో గెలుపొందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నాగర్ కర్నూల్ లో టిఆర్ ఎస్ మద్దతుతో రంగంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే పాలమూరు మినహా మిగిలిన నాలుగుచోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయనున్నారు. పాలమూరులో మాత్రం బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య పోటీ ప్రధానంగా సాగింది. దీంతో ఇక్కడ ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీకి చెందిన అభ్యర్ధి విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్, టిడిపిలకు మూడు, లేదా నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో జరిగిన ఆరు ఉపఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్, కామారెడ్డి స్థానాల్లో తమకు రెండవ స్థానం దక్కుతుందని టిడిపి నమ్ముతుంది. ఆదిలాబాద్ లో కూడా తమ అభ్యర్ధే టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉండవచ్చునని అంచనా వేస్తోంది. కొల్లాపూర్ లో కాంగ్రెస్ రెండవస్థానంలో ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. పాలమూరు, నాగర్ కర్నూల్ స్థానాల్లో ఎవరు రెండు, మూడు స్థానాల్లో ఉంటారో అంచనాలకు అందడం లేదు.
http://www.teluguone.com/news/content/congress-second-place-24-12766.html





