తొలి సమన్వయ కమిటీలొ సీఎం ఫై సమర ధ్వనులు
Publish Date:Jan 5, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడానికి ఏర్పాటైన కాంగ్రెస్ సమన్వయ కమిటీ తొలి భేటీ సందర్భంలోనే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. "సీఎం కిరణ్ ఒంటెత్తు పోకడ పోతున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఎవరినీ సంప్రదించడం లేదు. రాష్ట్రంలో పాలన పూర్తిగా ఏకపక్షంగా సాగుతోంది. పాలన ఇలానే కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ బతకదు'' అంటూ కాంగ్రెస్ నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సమన్వయ కమిటీ చైర్మన్ గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.ముఖ్యంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సీఎం తీరుపై నిప్పులు చెరిగారు. లేక్‌వ్యూ అతిథిగృహంలోనూ, గాంధీభవన్లోనూ ఆజాద్‌ను కలిసిన మంత్రులు కొందరు, నేతలు కూడా సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.ఇదే సమయంలో ఆజాద్‌ను కలిసిన మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి కూడా సీఎం వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. "శాఖల పరంగా సీఎంను మేం గానీ ఆయన మమ్నల్ని గానీ సంప్రదించడం లేదు'' అని ఆజాద్‌తో డీఎల్ అన్నారు. ఇందుకు సమాధానంగా ఆజాద్ "అదేమిటి? కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రితో సంప్రదించకపోవడం ఏమిటి? మంత్రివర్గంలో చర్చించాక పథకాలను ప్రకటించడం లేదా? పథకాల అమలు తీరుపై కేబినెట్లో మంత్రులు చర్చించుకోవడం లేదా?.. అంతా ఆశ్చర్యంగా ఉందే'' అని విస్తుపోయినట్లు తెలిసింది.
దాంతో విస్తుపోయిన ఆజాద్ కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఎం కిరణ్ పనితీరుపై మరింత ఆరా తీశారు. సీఎం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇలాగైతే కష్టం. రాష్ట్ర కాంగ్రెస్‌లో జోడెద్దుల లాంటి వారైన సీఎం, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మధ్య సమన్వయం పెరగాలి'' అని ఆజాద్ స్పష్టం చేసినట్లు సమాచారం. శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగేలా రాష్ట్ర ముఖ్యనేతలు సమన్వయంతో పనిచేస్తున్న సంకేతాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.నేను కలసిన ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు ఇదే అంశాన్ని స్పష్టం చేశారని వివరించారు. పార్టీ నేతలను విశ్వాసంలోకి తీసుకుని కార్యక్రమాలను అమలు చేయాలని, పార్టీ, ప్రభుత్వం ఒక్కటేనన్న అభిప్రాయాన్ని కలుగ జేయాలని సీఎం కిరణ్‌కు సూచించారు. లేని పక్షంలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని తేల్చి చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెలా సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహించాల్సి ఉందని ఆజాద్ అభిప్రాయపడ్డారు. అందులోభాగంగా ఈ నెల 21న మళ్లీ సమావేశం కావాలని చెప్పారు. ఇకపై ప్రతి నెలకోసారి కోర్ కమిటీ సమావేశాన్ని జరపాలని సూచించారు.సమావేశంలో కిరణ్, బొత్సలతో పాటు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి, ఎంపీ కావూరి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ పాల్గొన్నారు.
అయితే దాదాపు రెండున్నర గంటల పాటు విస్తృతంగా జరిగిన సమావేశంలో ఏమేమీ చర్చించింది బయటకు పొక్కరాదని, అవసరమైన సమచారాన్ని బొత్స మాత్రమే మీడియాకు అందిస్తారని ఆజాద్ స్పష్టం చేశారు. అసమయంలో ఎస్సీ మాల వర్గానికి చెందిన వారికి కోర్ కమిటీలో స్థానం లేకపోవడం చర్చకు వచ్చింది. దీనిపై ఆజాద్ స్పందిస్తూ వచ్చే సమావేశం నాటికి ఈ వర్గానికి చెందిన వారిని సభ్యునిగా చేర్చాలన్న నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికలూ చర్చకు వచ్చాయి. జగన్‌వర్గానికి చెందిన 17 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. ముందుగా ఏడు శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నందున వాటిలో విజయం సాధించడంపై దృష్టి సారించాలని ఆజాద్ సూచించారు.అదేవిధంగా పార్టీ బలోపేతం అయ్యిందన్న అభిప్రాయానికి వచ్చేంత వరకూ స్థానిక సంస్థల జోలికి వెళ్లడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమయింది.అంతేగాకుండా 108 అంబులెన్సుల విషయంలో సీఎం కిరణ్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య ఉన్న విభేదాల గురించి కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు వాకబు చేసినట్లు తెలిసింది. కాగా తెలంగాణ అంశం, రాష్ట్రంలో జగన్ ప్రభావంపై కూడా కాంగ్రెస్ నేతల నుంచి ఆజాద్ సమాచారాన్ని సేకరించారు.
కాగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు, గడచిన రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షించామని బొత్స వివరించారు. కోర్ కమిటీ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. పార్టీ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యకమైందన్నారు. తొలి సమావేశమైనందున అజెండా లేదని చెప్పారు.
http://www.teluguone.com/news/content/congress-party-24-10652.html





