ప్రియాంకకు పార్టీ పగ్గాలు ?
Publish Date:May 15, 2022
Advertisement
వరస ఓటములతో కుదేలైపోయిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలానికి ఒక ముందడుగు వేసింది. మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘నవ సంకల్ప్ శివిర్’ వేదికగా మేధోమథనం సాగించింది.గతానికి కొంత భిన్నంగా సాగిన మేధోమథన సదస్సులో నాయకులు ఎంతో కొంత మనసు విప్పి మాట్లాడారు. బృందాలుగా ఏర్పడి, విభిన్న అంశాలను చర్చించారు. నివేదికలు తయారు చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదికలు సమర్పించారు. తీర్మానాలు చేశారు ఆ నివేదికల ఆధారంగా కార్యాచరణ రూపొందించారు. అదే వేదికగా సమావేసమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) ‘నవ సంకల్ప్ శివిర్’ తీర్మానాలకు ఆమోదముద్ర వేసింది. సో... ఇంచుమించుగా మూడేళ్ళుగా దిశా నిర్దేశం లేకుండా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో, ఉదయ్‌పూర్ ‘నవ సంకల్ప్ శివిర్’ వేదికగా కనిపించే స్థాయిలో కదలిక కనిపించింది.అందుకే, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కొంత క్రియాశీలంగా కనిపించిన సందర్భం ఏదైనా ఉందంటే, అది, ఇదే, అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. అయితే, అదే సమయంలో పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలను పక్కన పెట్టి, కాస్మెటిక్ పూతలతో మూడు రోజుల ముచ్చతాకు ముగింపు పలికారు అనే మాతా కూడా ఉందనుకోండి అది వేరే విషయం. అయితే ఇంత కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ, గత మూడేళ్ళుగా పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య, ‘నాయకత్వ’ సమస్యను ఏ కోణంలోనూ చర్చించిన దాఖలాలు అంతగా లేవు. కనిపించలేదు. బహుశా, తేనే తుట్టెను కదల్చడం ఎందుకని, ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక అంశాన్ని మేధోమథనం చర్చల్లో చేర్చి ఉండక పోవచ్చని అంటున్నారు. నిజానికి, మేధోమథన సదస్సులో నాయకత్వం మార్పు విషయంగా అధికారిక చర్చ జరగక పోయినా, సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలి అనే విషయంలో తమ తమ అభిప్రాయాలు వ్యక్త పరిచినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకుడు, దీపేంద్ర హుడా వంటి కొందరు ప్రియాంక గాంధీకి జాతీయస్థాయిలో ‘పెద్ద’ బాధ్యత ఇచ్చి ఆమె సేవలను సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని బహిరంగంగానే తమ అభిప్రయాన్ని వ్యక్త పరిచారు. అలాగే, మరి కొందరు కీలక నేతలు పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో మారు రాహుల్ గాంధీ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ప్రియాంక వాద్రా సన్నిహితుడు ఆచార్య ప్రమోద్ కృష్ణన్, ‘సోనియా గాంధీని రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా చేసేందుకు అంత సుముఖంగా లేరేమో, అదే నిజామా అయితే ప్రియాంక గాంధీకి జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించాలని’ చేసిన వ్యాఖ్య అధ్యక్ష పదవి రేసులో ప్రియాంక వాద్రాను నిలిపిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సోనియా, ప్రియాంక సమక్షంలోనే ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఈ సూచన చేసినా, సోనియా వాద్రా లేదా మరొకరు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అదే విధంగా ప్రియాంకా వాద్రాను ఉత్తర ప్రదేశ్’కు పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని దీపేంద్ర హుడా చేసిన ప్రతిపాదనకు ఇంచుమించుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కాని పక్షంలో ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రమోద్ కృష్ణన్ ప్రతిపాదనకు కూడా పార్టీ నాయకుల నుంచి గట్టి మద్దతు లభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రియాంక గాంధీని జాతీయ అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారా అని సచిన్ పైలట్‌ను ప్రశ్నించగా.. చింతన్ శిబిర్‌లో తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సచిన్ పైలట్ అన్నారు. అయితే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్న మల్లికార్జున ఖర్గే ఇతర సీనియర్ నేతలు మాత్రం, రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాల అప్పగించాలని పట్టుపడుతున్నారు. మరోవంక సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. అందుకే ఆమె రాహుల్ గాంధీ రైలులో దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలుస్తారని సంచలన ప్రకటన చేశారు. అంటే రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా కోరుకుంటున్నట్లు పార్టీ నేతలకు చెప్పకనే చెప్పారని అంటున్నారు. మరో వంక రాహుల్ గాంధీ మేధోమథన సదస్సు ముగింపు సమావేశంలో మాటల్డిన రాహుల్ గాంధీ, తను జీవితాంతం కాంగ్రెస్ కార్యకర్తలతోనే ఉంటానని, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావ జాలానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఏ హోదాలో ఆయన ఈ పోరాటం సాగిస్తారు అనేది మాత్రం చెప్పలేదు. సో.. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్డమయ్యరా లేదా అనేది స్పష్టం కాలేదు. అంటే, ఇతర సమస్యలు అన్నిటికంటే కీలకమైన నాయకత్వ సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలోనే ఉందని అనుకోవచ్చును. అదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య పరిష్కారం కాకుండా, ఇతర సమస్యలు పరిష్కారం కావని,పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబమే, కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత .. ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీనే పార్టీ ముందున్న ప్రధాన సమస్య, అనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.అందుకే ’చింతన్ శిబిర్ చివరాఖరుకు, ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడే ముగిసింది’ అనే ముక్తాయింపు ఇస్తున్నారు.
అయితే సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి తీవ్ర మార్పులు తీసుకురావాలని స్వయంగా సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పదవుల్లో ఎవరూ కూడా ఐదేళ్లకు మించి ఉండరాదని, సదస్సు తీర్మానం కూడా చేసింది. అంటే ఇప్పటికే 20 ఏళ్లకు పైగా (మధ్యలో స్వల్ప గ్యాప్ ఉన్నా) పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారని అనుకోవచ్చని అంటున్నారు. ఈ నేపద్యంలో సొనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు అనే విషయంలో ఇటు పార్టీ వర్గాల్లో అటు రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/congress-leadership-to-priyanka-25-135926.html





