ముందస్తుపై సవాళ్ల పర్వం.. బీజేపీ,టిఆర్ఎస్ వార్ ఆఫ్ వర్డ్స్
Publish Date:May 15, 2022
Advertisement
తెలంగాణలో ‘ముందస్తు’ సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పరస్పర విమర్శల వేడి పెరిగింది. ఆరోపణల దూకుడు మరో లెవెల్ కు చేరింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై చేసిన విమర్శలు వ్యాఖ్యలు ఇందుకు ఆజ్యం పోశాయి. ఈ మాటల యుద్ధానికి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెర తీశారు. అమిత్ షా ప్రసంగంపై ఆయన ఘాటు విమర్శలతో విరుచుకు పడుతూ అమిత్ షాను అబద్ధాల షాగా అభివర్ణించారు. మోడీని అసమర్థ ప్రధాని అంటూ బీజేపీ క్యాడర్ ను రెచ్చ గొట్టారు. తెలంగాణలో ముందస్తుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం తెరమీదకు వచ్చింది. మరోసారి సవాళ్ల పర్వానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సారి ‘ముందస్తు’ చాలెంజ్ ని కేటీఆర్ మోడీ సర్కార్ కు విసిరారు. ధరల పెరుగుదల, ప్రజల మధ్య విద్వేషాలు, ఆర్థిక అస్తవ్యస్త నిర్వహణలను ఎత్తి చూపుతూ కేంద్రం ముంస్తుకు ముందుకు వస్తే తెలంగాణలో ఆ పని చేయడానికి తాము రెఢీ అన్నారు. ముందుగా కేంద్రం ప్రజా తీర్పు కోరుతూ ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. బీజేపీ వైఫల్యాలు, అవినీతి దేశమంతటా వ్యాపించాయన్నారు. ముఖ్యమంత్రులను ఇష్టారీతిన మార్చడం, సీఎం పోస్టులను అమ్మకానికి పెట్టడం వంటి అంశాలను కేటీఆర్ ఎత్తి చూపారు. కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే సీఎం పదవి కోసం రూ.పాతిక వందల కోట్ల వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అలాగే త్రిపుర సీఎం మార్పునూ ఎత్తి చూపారు. అందుకు భిన్నంగా తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందంటూ స్వాత్కర్ష చేసుకున్నారు. తెలంగాణ అప్పుల కుప్పలా మారిందని అమిత్ షా అంటే.. మోడీ హయాంలో దేశంలో అప్పుల లెక్కలు వందల లక్షల కోట్లకు చేరిన సంగతేంటని నిలదీశారు. మొత్తంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రెండు పార్టీలలోని లొసుగులనూ బయటపెట్టాయి. ఇరు పార్టీల అవినీతిపై ప్రజలలో చర్చకు తెరతీశాయి. దొందూ దొందే అన్న భావనను కలిగించాయి. ఎన్నికల హీట్ సంగతి పక్కన పెడితే.. ఈ మాటల యుద్ధం ప్రజలలో రెండు పార్టీల ప్రతిష్టనూ పలుచన చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణలో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అంటూ అమిత్ షా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింసు సభలో చేసిన సవాల్ ను కేటీఆర్ స్వీకరించి, కేంద్రం కూడా ముందస్తుకు సిద్ధం కావాలని ప్రతి సవాల్ విసిరారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై అమిత్ షా ఆరోపణలు గుప్పిస్తే.. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో అవితీని సంగతేంటని ప్రతి సవాల్ విసిరారు.
http://www.teluguone.com/news/content/challanges-on-early-elections-war-of-words-between-bjp-and-trs-25-135924.html





