నో డౌట్.. తెలంగాణలో కింగ్ మేకర్ టీడీపీయే!
Publish Date:Nov 8, 2025
Advertisement
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇదేంటి.. జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేదుగా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. తెలంగాణలో ఎక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం ఎంత ప్రబలంగా ప్రభావం చూపుతుందన్న విషయం తేటతెల్లమౌతూ వస్తోంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండా పట్టని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, రాష్ట్ర పురోభివృద్ధిని చూసిన జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ కే ఓటేస్తారన్న ధీమాను కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. అయితే దీనిపై రేవంత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నందుకు తెలుగుదేశం మద్దతు దారులు బీఆర్ఎస్ కు ఓటేస్తారా? లేక బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ ఘాట్ ను తొలగించడానికి ప్రయత్నించినందుకు ఓటేస్తారా? అంటూ నిలదీశారు. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ తెలుగుదేశం జపంతో జూబ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి ఈ రోజుకూ తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు, ప్రాబల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమికబుల్ గాజూబ్లీ ఉప ఎన్నికలో పార్టీని పోటీకి దూరంగా ఉంచి ఉండొచ్చు కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ కూడా పోటాపోటీగా తెలుగుదేశం మద్దతుదారుల సపోర్ట్ కోసం పోటీపడుతున్న తీరు గమనించిన ఎవరికైనా తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం, పట్టు ఎంత బలంగా ఉన్నాయో అవగతమౌతుంది.
http://www.teluguone.com/news/content/congress-and-brs-try-to-woo-tdp-supportes-39-209195.html





