తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-1
Publish Date:Jan 21, 2014
Advertisement
కాంగ్రెస్ వ్యూహం: కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణా అంశంతో చాలా కాలంగా దాగుడు మూతలు ఆడుతున్నాయి. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నపటికీ, సకాలంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దానిని ఆమోదింపజేస్తుందో లేదో అనుమానమే. ఇక, బీజేపీ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని చెపుతున్నపటికీ, దాని మాటలకి చేతలకి ఎక్కడా పొంతన కనబడటం లేదు. రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్ధులను చావుదెబ్బతీసి, అధికారం చేజిక్కించుకోవాలని కలలుగంటున్నకాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా రాష్ట్ర విభజన చేస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే, విభజన చేసినా, చేయకపోయినా తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఇంతవరకు వెలువడిన సర్వేలలో తెరాసకే విజయావకాశాలు ఎక్కువని తేలడంతో, కేసీఆర్ విలీనానికి ఇష్టపడటం లేదు. తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోయినట్లయితే తెరాసను తట్టుకొని కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ సీమాంధ్రలో చాలా వ్యతిరేఖత మూటకట్టుకొంది. అందుకే ఆ వ్యతిరేఖతను కూడా తెలివిగా సొమ్ము చేసుకొని రానున్నఎన్నికలలో గెలిచేందుకు కిరణ్ కుమార్ రెడ్డితో మరో ‘కాపీ కాంగ్రెస్ పార్టీ’ స్థాపనకు కూడా రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తున్నవ్యూహం ప్రకారం సీమాంధ్రలో సమైక్యవాదంతో కిరణ్, జగన్ ఇద్దరు గెలవాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర విభజన చేయడం కంటే, అంతవరకు తీసుకువెళ్ళగలిగితేనే వారిరువురూ ఎన్నికలలో పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలలోగా తెలంగాణా కూడా ఏర్పాటయిపోయినట్లయితే, ఇక వారు చేసే సమైక్యవాదానికి అర్ధం ఉండదు గనుక కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను కడదాకా తీసుకు వెళ్లి బీజేపీ మీద నెపం నెట్టి బయటపడవచ్చును. లేదా బిల్లుని రాష్ట్రపతి వద్ద త్రొక్కిపెట్టించయినా తప్పుకోవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చేఎన్నికలలో గెలిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణా సమస్యను తాపీగా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది. ఓడిపోయేట్లు ఉంటే, తెలంగాణా సమస్యను మరింత జటిలం చేసి వదిలిపెట్టవచ్చును.
http://www.teluguone.com/news/content/congress-45-29390.html





