సీఎంకు టెస్ట్..మునిసిపల్ కి వెళ్ళాలని అధిష్ఠానం ఆర్డర్!
Publish Date:Jan 10, 2012
Advertisement
హైదరాబాద్ : సీఎం కిరణ్కు అధిష్ఠానం పరీక్ష పెట్టబోతోంది. ఏడాది కాలంలో సీఎంగా కిరణ్ కొన్ని అవాంతరాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అవేమీ ఆయన సొంత శక్తిసామర్థ్యాలతో కాదన్నది కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయం. అందుకే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను కిరణ్కు పరీక్షగా పెట్టబోతోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఉన్నత శ్రేణులకు సంకేతాలు వచ్చాయి. ఉప ఎన్నికలతోపాటు మునిసిపల్ ఎన్నికలను కూడా సత్వరం జరపాలని, అవి ప్రభుత్వ పనితీరుకు గీటురాళ్లుగా నిలుస్తాయని, వాటి ఆధారంగానే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కగా అంచనా వేసుకోవచ్చని అధిష్ఠానం భావిస్తోంది. "ఎప్పటికప్పుడు ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతే ప్రజల నాడి తెలిసేదెలా? అలా వద్దు. ఎన్నికలకు వెళ్లాలి'' అని అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర ముఖ్యులకు హితబోధ చేస్తున్నారు. వాస్తవానికి 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికలు మినహా శాసనసభ ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెఫరెండమ్ కానే కావని సీఎం కిరణ్ స్పష్టం చేస్తున్నారు.ఉ కానీ, అధిష్ఠానం పెద్దలు ఆ వాదనను తోసిపుచ్చుతున్నారు. వీటి ఫలితాలు కచ్చితంగా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని స్పష్టం చేస్తున్నారు.సాధారణంగా ఉప ఎన్నికల ఫలితాలు అధికార పక్షానికి సానుకూలంగా ఉంటాయని, స్థానిక ఎన్నికలు కూడా ప్రభుత్వ పాలనకు గీటురాయిగా నిలుస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులతోపాటు రాజీవ్ యువ కిరణాలు, కిలో రూపాయి బియ్యం, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వంటి పలు పథకాలు అమలు చేస్తున్నందున ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7, ఖాళీ కానున్న మరో 17 శాసనసభ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల ఫలితాలను తేలిగ్గా కొట్టి పారేసేందుకు వీల్లేదని అధిష్ఠానం భావిస్తోంది.
ప్రధానంగా సీఎంగా కిరణ్ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ జగన్ వర్గ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అభ్యర్థి మహమ్మద్ జానీకి చుక్కలు చూపించారు. చివరి నిమిషంలో జానీ విజయం సాధించడంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. మధ్యలో జరిగిన బాన్సువాడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కడంతో గౌరవాన్ని దక్కించుకుంది.
ఇప్పుడు మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ చెందిన 14 జిల్లాల్లో 24 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర వాదం, సీమాంధ్రలో జగన్ గాలి వీస్తే వాటి ప్రభావం కచ్చితంగా పార్టీపై పడుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో కీలకమైన సర్పంచ్, జడ్పీ ఎన్నికలు జరపాలంటే ప్రస్తుతం న్యాయపరమైన ప్రతిబంధకాలు ఉన్నాయని, అలాంటివేమీ లేని మునిసిపల్ ఎన్నికలు జరిపితే పట్టణ ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకునే వీలుందని అభిప్రాయపడుతున్నారు.అయితే, ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా ఆ పార్టీలో కనిపించడం లేదు. కేబినెట్లో కీలక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కష్టమేనని అంతర్గతంగా అంగీకరిస్తూ ముందస్తుగానే చేతులు ఎత్తేస్తున్నారు. దీనిని అధిష్ఠానం పసిగట్టిందని, అందుకే, ముఖ్యమంత్రి, మంత్రుల పనితీరుకు మునిసిపల్ ఎన్నికలను పరీక్షగా ఉంచాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/cm-kiran-kumar-reddy-24-10809.html





