సీఎం చంద్రబాబైనా సరే.. అంతేగా.. అంతేగా!
Publish Date:Jun 20, 2026
Advertisement
ఎంతటి వారైనా సరే ఇంట్లో భార్య మాట వినాల్సిందే. ఆ విషయంలో సీఎం అయినా సరే.. అంతేగా, అంతేగా అనాల్సిందే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు. ఈ సంఘటన అక్కడున్న వారందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. విషయమేంటంటే.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని లింగంగుంట్లలో శనివారం (జూన్ 20) పర్యటించారు. అక్కడ ఓ రైతు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శించిన సందర్భంగా ఆ రైతు తన స్వంత గానుగ ద్వారా రసాయనరహితంగా తయారు చేస్తున్న ఆర్గానిక్ వేరుశనగ నూనె విశేషాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆ నూనెను ఒకసారి వాడి చూడాలని రైతు కోరడంతో చంద్రబాబు సరే అంటూ.. తన జేబులోంచి ఫోన్ తీసి భార్య భువనేశ్వరికి కాల్ చేసి పర్మిషన్ తీసుకున్నారు. . ఆ తరువాత.. అక్కడున్న వారితో.. ఇంట్లోకి ఏ వస్తువు కొనాలన్నా ముందు భార్య పర్మిషన్ తీసుకోవాలి కదా.. అని వ్యాఖ్యానించారు. తన సతీమణి భువనేశ్వరితో ఫోన్ లో మాట్లాడి, ఆమె అనుమతి తీసుకున్న తర్వాతే చంద్రబాబు ఒక లీటరు కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనె బాటిల్‌ను కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ గృహ విషయాల్లో భార్య అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వడం చూసి అక్కడి రైతులు, అధికారులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. ఇక రైతు నాగభూషణం.. తాను గత నాలుగేళ్లుగా ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా కేవలం ప్రకృతి సేద్యం చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడి వస్తోందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు. దీనిపై ఆ రైతును ముఖ్యమంత్రి అభినందించారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు అక్కడి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని కూడా పరిశీలించారు. పంటలకు అవసరమైన జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజసిద్ధ ఎరువులను ఎలా సిద్ధం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే క్షేత్రంలో సాగవుతున్న బొప్పాయి తోటను సందర్శించి సహజసిద్ధమైన బొప్పాయి పండును రుచి చూశారు. రాష్ట్రవ్యాప్తంగా రసాయన రహిత వ్యవసాయాన్ని, ప్రకృతి సాగు పద్ధతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు.
http://www.teluguone.com/news/content/cm-cbn-takes-permission-from-wife-bhuwaneswai-36-223659.html





