తగ్గేదేలే.. కేసీఆర్‌తో చినజీయర్ ఢీ అంటే ఢీ..!
Publish Date:Mar 19, 2022
Advertisement
చిన్నజీయర్ స్వామి చుట్టూ పెద్ద రాజకీయమే నడుస్తోంది. ఇటీవల ఆయన మేడారం సమ్మక్క-సారలమ్మలను తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. స్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నుంచి.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరకూ అంతా మండిపడ్డారు. గిరిజన దేవతలను అవమానిస్తారా అంటూ అడవి బిడ్డలు నిరసనలు తెలిపారు. సమతామూర్తి దర్శనానికి రూ.150 టికెట్ పెట్టి మీరే వ్యాపారం చేస్తున్నారంటూ విమర్శించారు. ఇంత రచ్చ జరుగుతుంటే.. ఇక తప్పేలా లేదని స్వయంగా చినజీయర్ స్వామినే మీడియా ముందుకొచ్చారు. తన మాటలకు వివరణ ఇస్తూనే.. విమర్శకులకు గట్టి సందేశమే ఇచ్చారు. కేసీఆర్‌కూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం.. మీడియానూ చెడుగుడు ఆడుకోవడం ఆసక్తికరం. లేటెస్ట్ ప్రెస్‌మీట్‌లో చినజీయర్ స్వామి తన సహజ స్వభావానికి భిన్నంగా.. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ధీటుగా అందరికీ జవాబిచ్చారు. సమ్మక్క-సారలమ్మలు స్వర్గం నుంచి దిగిరాలేదు.. గ్రామదేవతలు.. మేడారం జాతర వ్యాపారం అయింది.. అనే వ్యాఖ్యలు చిన్నజీయర్ స్వామి ఇప్పుడు చేసింది కాదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అన్న మాటలవి. ఈ విషయం స్వయంగా స్వామీజీనే సెలవిచ్చారు. అదికూడా ఆయన వ్యాఖ్యలకు ముందూవెనకా ఎడిట్ చేసి.. నెగటివ్ మీనింగ్ వచ్చేలా వీడియోలు రిలీజ్ చేశారని స్వామి మండిపడుతున్నారు. అదే నిజమైతే.. 20 ఏళ్ల క్రితం వీడియోను ఇప్పుడు కావాలనే వైరల్ చేసిన ఆ తెరవెనుక శక్తులు ఎవరు? అంటే.. అంతా కేసీఆర్ అండ్ కో వైపే చూస్తున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియానే ఈ వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు. పాపం.. ఈ విషయం తెలీక.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెగ రెచ్చిపోయారు. రేవంత్‌రెడ్డి సైతం ఆ ట్రాప్‌లో చిక్కుకున్నారు. బీజేపీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించింది. అంతా చిన్నజీయర్‌ను నెగటివ్‌గా చూడటంతో.. కేసీఆర్ స్కెచ్ బాగానే వర్కవుట్ అయిందంటున్నారు. సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ, అమిత్‌షాలను బాగా పొగడటంతో జీయర్ స్వామికి, కేసీఆర్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని అంతా అంటున్నారు. చినజీయర్ స్వామి లేకుండానే యాదాద్రి పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయం చినజీయర్ సైతం పరోక్షంగా ఒప్పుకున్నారు. గ్యాప్ లేదంటూనే.. తామెవరి వెంటా పడమని.. పిలిస్తే వెళ్తామని.. లేదంటే చూసి ఆనందిస్తామని అన్నారు. ఇలా.. కేసీఆర్ ఢీ అంటే.. తానూ ఢీ అన్నట్టుగా మాట్లాడారు చినజీయర్. ఇప్పటికే బీజేపీ స్వామిగా ముద్ర పడిపోగా.. మోదీ-అమిత్‌షాలతో క్లోజ్‌నెస్ పెరగ్గా.. ఇక కేసీఆర్‌ను ఏం లెక్క చేస్తారు చినజీయర్ స్వామి అని కూడా అంటున్నారు.
http://www.teluguone.com/news/content/chinna-jeeyar-swamy-counter-39-133218.html





