ఏపీలో సింగపూర్ తరహా పాలన... 90 రోజుల యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
Publish Date:May 7, 2026
Advertisement
ఏపీ అభివృద్ధికి సింగపూర్ మంత్రం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు దిశానిర్దేశం.. లక్ష్యం 2047 సరికొత్త పాలనా సంస్కరణలకు సీఎం శ్రీకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. అమరావతి వేదికగా జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. అభివృద్ధిలో కేవలం మాటలు కాకుండా, చేతల్లో వేగం చూపించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సింగపూర్ వంటి దేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ పాలనా విధానాలను ఏపీలో ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సదస్సులో భాగంగా మంత్రుల బృందం ఇటీవల తమ సింగపూర్ పర్యటనపై రూపొందించిన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. సింగపూర్‌లో ప్రజల విశ్వాసాన్ని పొందిన పాలనా పద్ధతులను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం తక్షణమే 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, దీని అమలును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సింగపూర్ తరహా విధానాలను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ఒక జిల్లాను ‘మోడల్ జిల్లా’గా ఎంపిక చేయాలని సీఎం నిర్ణయించారు. అక్కడ సక్సెస్ అయిన విధానాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. "నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ.. ప్రపంచంలో ఎక్కడ మంచి విధానాలు ఉన్నా వాటిని స్వీకరించడంలో తప్పు లేదు" అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేవలం "నేను" అనే భావన వీడి, "మనం" అనే టీమ్ వర్క్‌తో ముందుకు సాగాలని అధికారులకు పిలుపునిచ్చారు. పాలనలో వేగం అనేది కేవలం నినాదానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే సేవల్లో కనిపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో, పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోందని, ప్రతిరోజూ ఒక ఎంఓయూ లేదా వారానికో శంకుస్థాపన జరిగేలా అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కాలేజీ రోజుల్లో తాను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపానని, ఇప్పుడు అదే దిగ్గజ సంస్థను ఏపీకి తీసుకువచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించేలా చేశామని చెప్పడం విశేషం. నిధుల కొరత సాకుగా చూపకుండా వినూత్నంగా ఆలోచించి అభివృద్ధికి బాటలు వేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల మధ్య అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆకాంక్షించారు. మొత్తానికి 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్‌ను సాకారం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే 90 రోజుల్లో కలెక్టర్లు ఏ మేరకు సింగపూర్ తరహా ఫలితాలను చూపిస్తారో వేచి చూడాలి. అధికారుల పనితీరుపై రేటింగ్స్ కూడా ఉంటాయని సీఎం హెచ్చరించడంతో, ఇప్పుడు యంత్రాంగమంతా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-36-219179.html





