రాజధాని రైతులతో చంద్రబాబు భేటీ..పదేళ్ల పాటు కౌలు.. లక్షన్నర రుణమాఫీ హామీ
Publish Date:Apr 18, 2026
Advertisement
రెండో విడత భూసమీకరణపై తొలగిన అనిశ్చితి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియకోసం భూములిచ్చిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అండగా నిలిచారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో కీలక భాగస్వాములైన రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ఆయన తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలోని 10 గ్రామాల రైతులతో శనివారం (ఏప్రిల్ 18) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండో విడత భూ సమీకరణ ప్రక్రియపై ఈ భేటీలో చంద్రబాబు రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం.. వారికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు. ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామన్నారు. ఒక్కో రైతు కుటుంబానికి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకూ రుణాలను మాఫీ చేసేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యతన్న ఆయన.. ప్రతి ఏటా కౌలు మొత్తాన్ని రూ. 3,000 చొప్పున పెంచేందుకు అంగీకరించారు. ధరల పెరుగుదల, రైతుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపుదల వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల వల్ల పది గ్రామాల పరిధిలోని వందలాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
http://www.teluguone.com/news/content/chandrababu-meets-with-capital-region-farmers-36-217640.html





