దేశంలో కొవిడ్ కల్లోలం.. ఇలా చేస్తే సరిపోతుందన్న సర్కార్
Publish Date:Jan 6, 2022
Advertisement
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలతో బాధపడే కొవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతంలో 10 రోజులుగా ఉన్న హోం ఐసోలేషన్ కాల వ్యవధిని వారం రోజులకు తగ్గించింది. కరోనా లక్షణాలు లేని వారు, లేదా కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నా వారు పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా 3 రోజులు జ్వరం లేకపోతే 7 రోజులు పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. హోం ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదని కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్‌గా చెప్పింది. కేంద్రం తాజాగా సవరించి జారీ చేసిన కొత్త మార్గదర్శకాలివే.. లక్షణాలు లేని లేదా స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ బాధితులు .. కుటుంబ సభ్యులకు దూరంగా ఇంట్లో ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండాలని... ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. నిత్యం మూడు పొరల మాస్క్ వినియోగించాలని.. . ప్రతి 8 గంటలకోసారి మాస్క్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని... కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలని సూచించింది. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్ 95 మాస్క్‌ను ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్పింది. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని.. అలాగే ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవడంతోపాటు ఆవిరి పట్టడం వంటివి కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పింది. శ్వాస తీసుకునే స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని... జర్వంతోపాటు ఆక్సిజన్ లెవల్స్‌ను తరచు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో తరచు శుభ్రం చేసుకోవాలని.. అలాగే తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదని.. కరోనా బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలని సూచించింది. కరోనా బాధితులు ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో వారు ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడకూడదని పేర్కొంది. కరోనా బాధితుల అవసరాలను చూసుకునే కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని... బాధితుల గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలంది. కరోనా బాధితుల వస్తువులను ఓ వేళ ముట్టుకుంటే.. చేతులకు గ్లౌజులు వేసుకోన్న తర్వాతే అలా చేయాలని సూచించింది. అవసరమైతే వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి కూడా పేర్కొంది. హోం ఐసోలేషన్‌లోని బాధితులు వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే 7 రోజుల తర్వాత ఐసోలేషన్ నుంచి బయటకు రావోచ్చునని.. ఆ తర్వాత మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని... ఇక హోం ఐసోలేషన్ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తాజాగా సవరించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/center-new-guidelines-to-covid-control-39-129770.html





