ఆలోచన కాంగ్రెస్ ది..ఆచరణ సిబిఐది :జగన్
Publish Date:Jan 4, 2012
Advertisement
ఒంగోలు: కాంగ్రెసు ఆలోచనలను సిబిఐ అమలు పరుస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోందని ,సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో పాల్గొన్న అయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్స్పై అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని ఆరోపించారు.ఫీజు రీయింబర్సుమెంట్స్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ చదవుకోవాలని, కానీ ప్రభుత్వం మాత్రం రీయింబర్సుమెంట్స్ చెల్లించడం లేదన్నారు. కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత చదువులు చదివితేనే పేదరికం పోతుందన్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కాంగ్రెసు తనపై రాజకీయ కక్ష సాధిస్తోందని పార్టీ వదిలి పెట్టాకనే తనపై సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. కాంగ్రెసు ఆలోచనలను సిబిఐ అమలు పరుస్తోందన్నారు. తనను నేరస్థుడిగా చూపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన సాక్షిలో పెట్టుబడులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.
అయితే ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో జగన్తో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, శాసనసభ్యుడు పిన్నెల్లి, మాజీ ఎమ్మెల్సీ రెహ్నాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఫీజు ధర్నా జరుగుతోంది. కొన్నిచోట్ల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీగా విద్యార్థులు తరలి వచ్చారు. అక్కడ రోడ్డు ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
http://www.teluguone.com/news/content/cbi-24-10600.html





