బండి భేష్.. తెలంగాణలో కమలం వికసిస్తే ఆయనే సీఎం!
Publish Date:Jun 10, 2022
Advertisement
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అధిష్టానం మొప్పు పొందారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించడానికి ఆయన ఒక్కరే చాలన్నంతగా బండి అధిష్టానం విశ్వాసాన్ని చూరగొన్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఆయనే అని ఇప్పటికే బీజేపీ హై కమాండ్ సంకేతాలిచ్చేసింది. అందులో భాగంగానే ఆయనకు లైన్ క్లియర్ చేయడానికి చర్యలకూ ఉపక్రమించేసింది. మా కంటే బండి చాలా జూనియర్ అంటూ తమ సీనియారిటీని ప్రదర్శిస్తారన్న అనుమానం ఉన్న నాయకులందరినీ ఏదో నెపంతో సైడ్ ట్రాక్ చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలోని బిజెపి సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని రాష్ట్రంతో సంబంధం లేకండా జాతీయ స్థాయి బాధ్యతలు కట్టబెడుతోంది. బండారు దత్తాత్రేయను గవర్నర్ గా పంపించిన జాతీయ నాయకత్వం కిషనర్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. తాజాగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపించింది. తెలంగాణలో ప్రధానంగా ఉన్న సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని కేంద్రానికి తీసుకెళ్ళడంతో పాటు వారికి సముచిత పదవీ బాధ్యతలను అప్పగిస్తూ వస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ కు లైన్ క్లియర్ చేస్తున్నట్టు రాష్ట్ర బిజెపి వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి, ప్రధాని తర్వాత అంతటిస్థాయి నాయకుడు అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ ఒక్కడు చాలు... అంటూ కితాబు ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అమిత్ షా ఆ ఒక్క మాటతో రాష్ట్ర కేడర్ కు విస్పష్టంగా అర్దమయ్యేలా చెప్పేశారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. బండి సంజయ్ నియోజకవర్గం కరీంనగర్ లో బిజెపిలో అసంతృప్తి నాయకులు సమావేశమైతే.. వారిని డిల్లీకి పిలిపించి మరీ జాతీయ నాయకత్వం క్లాస్ పీకింది. ప్రజాసంగ్రామ యాత్రలో తనకు ప్రాధాన్యతనివ్వడం లేదని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించిన సందర్భంలోనూ బీజేపీ అధిష్టానం ఆయనను సముదాయించింది. తెలంగాణ బిజెపిలో అసంతృప్తి, అసమ్మతి మొలకెత్తిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధినాయత్వం జోక్యం చేసుకుని బండికి మద్దతుగా నిలబడి అసమ్మతిని మొలకలోనే తుంచేస్తోంది. బండి సంజయ్ అరెస్టు సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి స్పందించగా, ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేసి బండిసంజయ్ ను పరమార్శించారు. అనంతరం మరో మారు తెలంగాణకు బిజెపి అధ్యక్షుడిగా ఆయననే నియమించడం ద్వారా రాష్ట్ర పగ్గాలు బండి చేతిలోనే ఉన్నాయనీ, ఉంటాయనీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో బండి సంజయ్ కి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం దుబ్బాక ఉప ఎన్నికలోనూ, జిహెచ్ఎంసి ఎన్నికలలోనూ, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయాలు సాధించడం కూడా బండికి కలసి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ గతంలో ఎన్నడూ ఇంత బలోపేతంగా లేదని పార్టీ హైకమాండ్ భావిస్తోందనీ, బండికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాతనే ఈ పరిస్థితి ఏర్పడిందనీ బీజేపీ అగ్రనాయకత్వం నమ్ముతోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియేనని జనం కూడా భావిస్తున్నారంటే అందుకు బండి నాయకత్వమే కారణమని హై కమాండ్ నమ్ముతోందని పార్టీ కేడర్ కూడా అంటున్నారు. అయితే ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బండితో సమానంగా వాగ్ధాటి ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లలో బండి పోకడలపై అసంతృప్తి వ్యక్తమౌతోంది. అయితే హైకమాండ్ బండికి మద్దతుగా ఇస్తున్న సంకేతాలు వారిని ప్రస్తుతానికి మౌనం దాల్చేలా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ గా బండి సంజయ్ అభివర్ణించిన ముగ్గురు ఎమ్మెల్యేలలోనూ కూడా పార్టీలో తమకు తగిన గుర్తింపు ప్రాధాన్యతా లేదన్న అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలో అసంతృప్తి మరింత పెచ్చరిల్ల కుండా హై కమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/bjp-natiomal-leadership-back-bandi-sanjay-25-137387.html





