యథా సర్కార్.. తథా పోలీస్..!
Publish Date:Jun 10, 2022
Advertisement
యథా రాజా తథా ప్రజా అన్నది పాత నానుడి.. యథా సర్కార్ తథా పోలీస్ అన్నది కొత్త ఒరవడి. జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేపు కేసులో పోలీసుల తీరు ఇందుకు మరో నిదర్శనం. పోలీసు వారు సర్కార్ పెద్దల మాటలు జవదాటకు.. సరే.. వేరే ఎవరైనా జవదాటినా ఒప్పరు. అంటే రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తారన్న మాట. జూబ్లీ హిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసు వారి తీరు సరిగ్గా అలాగే ఉంది. ఇది బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పరిశీలకులు అంటున్నమాట. ఎందుకంటే ఈ నెల 7 పోలీసు కమిషనర్ ఆనంద్ ఏం చెప్పారో సరిగ్గా అదే మాట అంతకు నాలుగు రోజుల ముందే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సెలవిచ్చారు. సామూహిక అత్యాచారం కేసులో బిగ్ షాట్స్ పిల్లలు ఉన్నారనీ, సామూహిక అత్యాచారం జరిగింది ఒక ఎమ్మెల్యేకు చెందిన అధికారిక వాహనంలోననీ. అయితే పోలీసులు మాత్రం ఠాఠ్ అదేం కాదు.. ఆ సామూహిక అత్యాచారం కేసులో ఉన్ననలుగురిలో ముగ్గురికి అరెస్టు కూడా చేసేశామని అప్పుడు పోలీసులు సెలవిచ్చారు. అంటే కేసు దర్యాప్తూ గట్రా ఏం లేకుండానే అసమదీయుల సంబంధీకులను కేసు నుంచి తప్పించడానికి సర్కార్ మార్గదర్శకత్వంలో పోలీసులు స్క్రిప్ట్ రెడీ చేసేశారన్న మాట. సరిగ్గా అప్పుడే రఘునందనరావు ఆధారాలతో సహా బయటపెట్టడంతో పోలీసులకు ఊపిరాడలేదు. మీడియా సహా అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి కేటీఆర్ అప్పుడు నోరు విప్పారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని ఒక హెచ్చరిక చేశారు. అప్పుడు పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యే పేరును చేర్చారు. అత్యాచారం జరిగిన కారునూ గుర్తించారు. అయినా వాస్తవాలను బయటపెట్టి తమ ఏలిన వారికి ఇబ్బంది కలిగించిన రఘునందనరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి రఘునందనరావు ఆ రోజు వాస్తవాలను మీడియా ముఖంగా బటయ పెట్టకపోయి ఉండుంటే.. హై ప్రొఫైల్ రేప్ కేసును మసిపూసి మారేడు కాయ చేసేవారనడంలో సందేహం లేదు. తమ తప్పులు బయటపడతాయని, తాము దాచిన నేరస్తుల వివరాలు వెలుగుచూశాయి అనే కారణంతో లేదా అక్కసుతో రఘునందన్ రావు పైపోలీసుల కేసు నమోదు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణను జనంఆమోదిస్తున్నారు. బాధితురాలి వివరాలు తాను చెప్పలేదని.. చెప్పినట్లు ఆధారాలు చూపిస్తే ఎంతటి చర్యకైనా సిద్ధం అని రఘునందన్ రావు చెబుతున్నా పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి గతంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనలో స్వయంగా ఐపీఎస్ అధికారులే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరాలు తెలిపారు. అప్పుడు మైనర్లు, బాధితురాలి వివరాలు వంటివేవీ వారికి అడ్డు రాలేదు. అదే విధంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పుడు 228-A కింద వారెవరిపైనా ఎందుకు కేసు నమోదు చేయలేదు. జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేప్ కేసులో ఎటువంటి విచారణ లేకుండానే నాలుగో తేదీ సాయంత్రం డిసిపి జో యల్ డేవిడ్ నిందితుల పేర్లను వెల్లడించడం చూస్తుంటే దొంగలను కాపాడడానికి పోలీసులు ఎంతగా ప్రయత్నించారో తేటతెల్లమౌతుంది. అవన్నీ విఫలమైనాయన్న కక్షే రఘునందనరావుపై కేసు రూపంలో పోలీసులు బయటపెట్టుకున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/police-wantedly-regetered-case-on-raghunanan-rao-25-137381.html





