ఈటల చేరిక లాభమా? నష్టమా? బీజేపీకి బూమరాంగ్?
Publish Date:Jun 1, 2021
Advertisement
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కమలం గూటికి చేరుతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను పక్కనపెట్టి.. కాంగ్రెస్ ఆహ్వనాన్ని కాదనుకుని, ఉద్యమకారుల వినతులను విడిచిపెట్టి .. కాషాయ కండువా కప్పుకుంటున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొలిక్కి వచ్చినా.. బీజేపీలో ఈటల చేరిక ఎవరికి లాభమనే చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. రాజేందర్ రాకతో తమకు మరింత బలం వచ్చిందని, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే ఈటల చేరికపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈటల చేరికతో తమకువచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరు కమలనాధులు అంచనా వేస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఇదేరకమైన చర్చ జరుగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన చాలా మంది నేతలు కమలం గూటికి చేరారు. అందులో మాజీ మంత్రుులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీడీపీలో కీలక పాత్ర పోషించిన మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరారు. గరికపాటితో పాటు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన టీడీపీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లలో చాలా మంది ఇప్పటికే బీజేపీలో తమకు సరైన ప్రాతినిద్యం లేదనే అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో చేరిన కొత్తలో గరికపాటి యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. బీజేపీ నుంచి తనకు అనుకున్నంతగా సపోర్ట్ లేకపోవడం వల్లే ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. వరంగల్ కు చెందిన గరికపాటి.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి... వరంగల్ బీజేపీ వ్యవహారాలు చూశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీసీ నేత ఎర్రశేఖర్ ... బీజేపీలో ఇమడలేక ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా పట్టున్న అంజయ్య యాదవ్ కూడా గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు ఎలా ఉన్నా.. పాత టీడీపీ నేతలు మాత్రం బీజేపీలో నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావనలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను తీసుకొచ్చి కీలక స్థానంలో నిలబెడితే వారంతా మరింత అసంతృప్తి లోనయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బిజెపిలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటెలను ఎట్లా బీజేపీ లోకి తీసుకుంటారు.. ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు తనకు చెప్పడానికి ఏంటి బాధ.? అంటూ పెద్దిరెడ్డి బీజేపీ పెద్దల్ని ప్రశ్నించారు. ఈటలను బీజేపీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని పెద్దిరెడ్డి కుండబద్దలు కొట్టారు.ఈటల వ్యవహారం సామాజిక అంశం కాదు.. ఆర్థికపరమైన గొడవ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కామెంట్ చేశారు. ఆయన మంత్రి పదవి ప్రజల కొసమా.. కంపెనీల కోసమా అని ప్రశ్నించారు. దళితుల గురించి ఈటల ఏనాడైనా మాట్లాడారా.. ఆయనది ఆత్మ గౌరవం కాదు, ఆత్మ ద్రోహం అన్నారు నర్సింహులు. అంతేకాదు తనకు వందల ఎకరాలు, రూ.వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకుని ఈటల రాజేందర్ జీవితాంతం పూజ చేయాలన్నారు మోత్కుపల్లి నర్సింహులు. బీసీ నాయకుడికి మంత్రిపదవి ఇచ్చినందుకు కేసీఆర్‌కు ఈటల కృతజ్ఞతతో ఉండాలన్నారు. పెద్దిరెడ్డి ,మోత్కుపల్లి నర్సింహులు బాటలోనే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాజేందర్ తో పాటు బీజేపీ దూకుడుకు చెక్ పెట్టాలని చూస్తున్న గులాబీ బాస్.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. గతంలో తనకున్న పరిచయాలతో పాత టీడీపీ నేతలకు ఆయన గాలం వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రికి టచ్ లోకి వచ్చారంటున్నారు. ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు మంత్రి గంగుల సమక్షంలో గులాబీ జెండా పట్టుకున్నారు. పాలమూరుకు చెందిన ఎర్ర శేఖర్ కూడా త్వరలో గులాబీ గూటికి చేరుతారని అంటున్నారు. మోత్కుపల్లి కూడా కేసీఆర్ తో మాట్లాడుతున్నారని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కోసం గతంలో కేసీఆర్ ప్రయత్నించారట. అప్పుడు ఆయన బీజేపీలో చేరారు. తాజా పరిస్థితులతో రేవూరిని టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆరే రంగంలోకి దిగారంటున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలందరిని కారు ఎక్కించేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈటల రాజేందర్ పై దేవుడి భూములు, దళితుల భూములు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపైనే విచారణ జరుగుతోంది. ముఖ్యంగా దేవరయాంజల్ లోని సీతారామ ఆలయానికి సంబంధించిన భూముల అంశం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. రాముడి పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. రామాలయ భూముల ఆక్రమించారనే ఆరోపణలు వస్తే స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రామాలయ భూముల పరిరక్షణ కోసం పోరాడకుండా.. కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో చేర్చుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని కొందరు కమలం నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఈటల విషయంలో సైలెంట్ గా ఉండే.. ముందు ముందు సమస్యలు వస్తాయని కొందరు ఆందోళన చెందుతున్నారట. రామాలయ భూముల గురించి మాట్లాడకుండా హిందుత్వ నినాదం చేసినా ఫలితం ఉండదనే అభిప్రాయం కొందరి నుంచి వస్తోంది. మొత్తంగా ఈటల రాజేందర్ చేరికతో తమకు లాభం కంటే నష్టమేననే చర్చ బీజేపీ నేతల్లో తీవ్ర స్థాయిలోనే జరుగుతుందంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా వెళ్లిపోతే ఈటల వచ్చినా ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఈటల రాజేందర్ చేరికతో బీజేపీకి బూమ్ రాంగ్ తప్పదనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది.
http://www.teluguone.com/news/content/bjp-leaders-split-two-gropus-in-etela-rajender-join-25-116744.html





